● సచివాలయం ఆవరణలో కారు షెడ్డు నిర్మించిన తెలుగు తమ్ముడు
● తమ్ముడికి అండగా అక్క
● కళ్లు మూసుకున్న అధికార యంత్రాంగం
రాజమహేంద్రవరం రూరల్: కూటమి ప్రభుత్వంలో చెలరేగిపోతున్న అక్రమార్కులు.. తమ వ్యవహారాలకు అధికారాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు. ఈ బరితెగింపు ఏ స్థాయికి చేరిందంటే ప్రభుత్వ భవనాల ప్రాంగణాలను కూడా అక్రమించుకునేంత వరకు వెళ్లిపోయింది. ఇటీవల బొమ్మూరు గ్రామంలోని శ్మశానంలో 30 వేప చెట్లు అక్రమంగా అమ్మేసుకోవడం, రజకుల చెరువు గట్టుపై తుమ్మచెట్లను అభివృద్ధి పనుల పేరిట అక్రమంగా తొలగించి సొమ్ము చేసుకోవడం తెలిసిందే. ఇప్పుడు తాజాగా బొమ్మూరు రాఘవేంద్రనగర్‌కాలనీలోని సచివాలయం–3 ప్రాంగణంలో ఆ ప్రాంత తెలుగు తమ్ముడు రేకులతో షెడ్డును నిర్మించి, అందులో కారును పెట్టుకుంటూ తమ ఘనతను చాటుకుంటున్నారు. ఇదేదో తాత్కాలికంగా పార్కింగ్ చేసుకుంటున్నారనుకునేరు.. పక్కాగా షెడ్డును నిర్మించి మరీ శాశ్వత పార్కింగ్‌ను ఏర్పాటు చేసుకోవడాన్ని చూసిన గ్రామస్తులు ముక్కున వేలేసుకుంటున్నారు. మరో అడుగు ముందుకేసి కార్యదర్శికి కూడా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ తెలుగు తమ్ముడు మాత్రం పైనుంచి కింద వరకు మాదే అధికారం మమ్మల్ని ఎవడ్రా ఆపేది అంటూ.. కారును, షెడ్డును మాత్రం అలాగే ఉంచేశాడు. సదరు ఆక్రమణ దారుడికి తోడు రూరల్ నియోజకవర్గంలో నెంబర్ 2 నేనే అంటూ చెప్పుకుంటున్న అక్క కూడా అండగా ఉన్నట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. సదరు అక్క నేరుగా గ్రామ ప్రత్యేకాధికారి అయిన నగరపాలకసంస్థ కమిషనర్‌కు ఈ షెడ్డు జోలికి వెళ్లొద్దంటూ రికమెండ్ చేశారంటున్నారు. దీంతో ఇక మాకేం అడ్డు అనుకుంటూ కారును దర్జాగానే పార్క్ చేసుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు ఈ విషయంపై తగు చర్యలు చేపట్టకపోతే.. చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న కమిషనర్ కార్యాలయం వద్దకే ప్రజాందోళన చేరేలా కన్పిస్తోంది.