
బాణసంచా తయారీలో భద్రతా ప్రమాణాలు ముఖ్యం
కొవ్వూరు: జిల్లావ్యాప్తంగా ఫైర్ క్రాకర్స్ తయారు చేసే యూనిట్స్‌ను పరిశీలించి అక్కడ తగిన భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. గురువారం సాయంత్రం ఐ.పంగిడి గ్రామ శివారున ఫైర్ క్రాకర్స్ గోడౌన్ దగ్ధమైన ప్రదేశాన్ని కలెక్టర్ పరిశీలించారు. ప్రమాద ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి హానీ జరగలేదన్నారు. జిల్లా వ్యాప్తంగా లైసెన్స్‌ల కాల పరిమితి ముగిసిన ఫైర్ క్రాకర్స్ విక్రయ, తయారీదారులను గుర్తించి తక్షణం అనుమతులు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాణసంచా భద్రపరుస్తున్న గోదాముల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటిస్తున్నారో లేదో క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.3లక్షల మేరకు ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఐ.పంగిడిలో ఫైర్ క్రాకర్స్‌కు ఇచ్చిన అనుమతి మార్చి నెలాఖరు నాటికి ముగిసిందన్నారు. ఆర్డీవో రాణి సుస్మిత, తహశిల్ధార్ ఎం.దుర్గాప్రసాద్, పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు.
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
తుని: అన్నవరం–హంసవరం మధ్యలో రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందాడని తుని జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాసరావు గురువారం తెలిపారు. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం వీరభద్రపేట గ్రామానికి చెందిన నారపురెడ్డి చిన అప్పారావు (55) కటక్ వైపు వెళుతున్న రైలు నుంచి జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు చిన అప్పారావు ఈ నెల 2న గ్రామస్తులతో కలిసి గుంటూరు జిల్లా కారంపూడికి వ్యవసాయ పనుల కోసం వెళ్లాడు. పనులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు రైలులో ప్రయాణిస్తూ హంసవరం సమీపంలో జారిపడి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారని, కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
● కలెక్టర్ ప్రశాంతి
● ఐ.పంగిడిలో బాణసంచా గోదాము దగ్ధం
● రూ.3లక్షల మేర ఆస్తి నష్టం