ఆచి తూచి వ్యవహరించాలి | G 7 Summit Japan Focus To Stop Russia Ukraine War | Sakshi
Sakshi News home page

ఆచి తూచి వ్యవహరించాలి

Published Sat, May 20 2023 12:53 AM | Last Updated on Sat, May 20 2023 4:06 AM

G 7 Summit Japan Focus To Stop Russia Ukraine War - Sakshi

యుద్ధోన్మాదం పర్యవసానంగా మనిషి మృగంగా మారితే ఏమవుతుందో ప్రపంచానికి ఇప్పటికీ చాటుతూనే ఉన్న హిరోషిమా నగరంలో శుక్రవారం మూడురోజులపాటు జరిగే జీ–7 దేశాల శిఖ రాగ్ర సదస్సు ప్రారంభమైంది. 15 నెలలుగా ఎడతెరిపి లేకుండా కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో సహజంగానే ఈ సదస్సులో అది ప్రధానంగా చర్చకొస్తుంది. ఉక్రెయిన్‌లో రష్యా ‘వ్యూహాత్మక ఓటమి’కి అందరూ ఏకం కావాలంటూ ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పిలుపునిచ్చారు. పాశ్చాత్య దేశాలన్నీ రష్యాకు వ్యతిరేకంగా ఒక్కటయ్యాయి.

ఉక్రెయిన్‌కు ఆయు ధాలందిస్తూ రష్యా యుద్ధ వ్యూహాలను వమ్ముచేస్తున్నాయి. అయితే అదొక్కటే సరిపోదు. జీ–7 సమావేశాల వేదిక హిరోషిమా గనుక ఆ దేశాధినేతలందరూ చిత్తశుద్ధితో బాధ్యతాయుతంగా ఆలో చించి ఈ యుద్ధాన్ని కట్టడి చేయడానికి తీసుకోవాల్సిన  చర్యలేమిటన్న అంశంపై దృష్టి సారించాలి. గెలుపోటముల సంగతలావుంచి ఇది అణుయుద్ధంగా పరిణమించకుండా ఏంచేయాలో ఆలోచించాలి. ఎందుకంటే హిరోషిమా, నాగసాకి పట్టణాలపై రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1945 ఆగస్టు 9న అమెరికా అణుబాంబులు ప్రయోగించటం పర్యవసానంగా ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఆనాటి విషాద ఉదంతాల్లో రెండు లక్షలమందికిపైగా మృత్యువాత పడ్డారు. అనంతర దశాబ్దాల్లో మరిన్ని లక్షలమంది దీర్ఘకాల వ్యాధుల బారినపడి చనిపోయారు.

బాంబు జారవిడిచిన ప్రాంతానికి చుట్టూవున్న 11 చదరపు కిలోమీటర్ల పరిధిలో కనీవినీ ఎరుగని విధ్వంసం చోటు చేసుకుంది. తరాలు గడుస్తున్నా ఇప్పటికీ అంగవైకల్యంతో జన్మిస్తున్నవారు అక్కడ ఎక్కువే. ఈ శిఖరాగ్ర సదస్సు అణు నిరాయుధీకరణ, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చర్యలపై దృష్టి సారిస్తుందంటున్నారు. అయితే అణ్వస్త్ర దేశాలన్నీ తమ వద్ద ఉన్న అణ్వాయుధాలను స్వచ్ఛందంగా వదులు కోవడానికి ముందుకు రానంతవరకూ ఈ లక్ష్యాలు నెరవేరవు.  ఉక్రెయిన్‌ దురాక్రమణ యుద్ధంలో అణ్వస్త్రాలు ప్రయోగిస్తామని తరచు పుతిన్‌ బెదిరిస్తున్నారు. ఉత్తరకొరియా అణు క్షిపణులను అభివృద్ధి చేస్తున్నానంటున్నది. ఈ పరిణామాలు ఆందోళనకరమైనవే. కాదనలేం. అయితే తమ దగ్గర తప్ప వేరే ఎవరివద్దా అణ్వస్త్రాలు ఉండరాదన్న వాదంతో ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనటం సాధ్యంకాదు. అసలు ఎవరిదగ్గరైనా మానవాళిని సర్వనాశనం చేసే ఆయుధాలు ఎందుకుండాలన్న ప్రశ్న ఎవరికి వారు వేసుకోవాలి. అమెరికా అణు ఛత్రఛాయలో కొనసాగుతున్న జపాన్‌ అణునిరా యుధీకరణ గురించి మాట్లాడటంపై విమర్శలు తలెత్తటంలో వింతేమీ లేదు.  

జీ–7 సభ్యదేశాల ముందు పెద్ద ఎజెండాయే ఉంది. తైవాన్‌కు చైనా నుంచి వస్తున్న బెదిరింపులు, గతంలో పాశ్చాత్య దేశాలకు వలసలుగా ఉండి స్వాతంత్య్రం పొంది ఇప్పుడు రష్యా, చైనా లకు సన్నిహితమవుతున్న పేద దేశాల విషయంలో అనుసరించాల్సిన వ్యూహం ఇందులో చర్చకు రాబోతున్నాయి. ఆర్థిక స్థితిగతులు సరేసరి. అరబ్‌ దేశాల వైఖరితో తలెత్తిన చమురు సంక్షోభం, దాన్ని వెన్నంటి వచ్చిన ఆర్థిక మాంద్యంతో నిలువెల్లా వణికిన పాశ్చాత్య దేశాలు 1975లో ఒక్కటై జీ–6గా ఏర్పడ్డాయి. ఇందులో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్‌లతోపాటు అమెరికా చేరింది. ఆ మరుసటి ఏడాది కెనడా చేరికతో అది జీ–7 అయింది. చిత్రమేమంటే...అప్పటికి ప్రపంచ ఆర్థిక కార్యకలాపాల్లో యాభై శాతం వాటావున్న ఈ దేశాలకు ఇప్పుడు 30 శాతం మించిలేదు. చైనా, భారత్, బ్రెజిల్‌ ఆర్థిక వ్యవస్థలు చురుకందుకున్నాయి. రష్యా, చైనాలవైపు మొగ్గుతున్న పేద దేశా లకు ఆరోగ్యం, ఆహారభద్రత, మౌలిక సదుపాయాల కల్పన తదితర రంగాల్లో తోడ్పాటునందిస్తూ వాటిని అక్కున చేర్చుకోవాలని జీ–7 దేశాలు భావిస్తున్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ఇంధన సంస్థ, ఓఈసీడీ తదితర సంస్థల ప్రతినిధులు కూడా హాజరవుతున్నారు గనుక ఆ దిశగా విధాననిర్ణయాలుండొచ్చు. ఇక రష్యా చమురుపై విధించిన ఆంక్షల అమలుపై ఇందులో చర్చిస్తారంటున్నారు. దాంతోపాటు వజ్రాల వ్యాపారంలో కూడా రష్యాను కట్టడి చేయటంపై జీ–7 దృష్టి సారించబోతోంది. ఇది నేరుగా భారత్‌నూ, ప్రత్యేకించి గుజరాత్‌లో అధికంగా ఉన్న వజ్రాల పరిశ్రమనూ ప్రభావితం చేస్తుంది. ప్రపంచ వజ్రాల వ్యాపారంలో 40 శాతం వాటా ఉన్న రష్యా, గుజరాత్‌లోని సూరత్‌ వజ్రాల పాలిషింగ్‌ పరిశ్రమపై ప్రధానంగా ఆధారపడుతుంది. రష్యాపై విధిస్తున్న ఆంక్షలవల్ల ఆ దేశం ఒక్కటే కాదు... ముడి చమురు, వజ్రాలు తదితర ఉత్పత్తులపై ఆధారపడుతున్న భారత్‌వంటి దేశా లకు సైతం ఇబ్బందులు తలెత్తుతాయి. జీ–7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంలో మన వైఖరిని స్పష్టంగా తెలియజేయటం అవసరం. 

ప్రచ్ఛన్న యుద్ధం ముగిసి మూడు దశాబ్దాలవుతోంది. ఇన్నేళ్లుగా ప్రపంచ దేశాల మధ్య పర స్పర విశ్వాసం వల్ల అయితేనేమి, ఎవరూ తొలుత అణ్వాయుధాలు వినియోగించరాదన్న నియమం పెట్టుకోవటం వల్ల అయితేనేమి ప్రమాదం లేకుండా పోయింది. అయితే ఆ దశ ముగిసి పరస్పరం హెచ్చరికలు, సవాళ్ల పర్వం మొదలైంది. యుద్ధం సంప్రదాయ ఆయుధాల పరిధిలోనే పరిభ్రమిస్తుందనుకోవటం ఆత్మవంచనే అవుతుంది.  కనుక జీ–7 దేశాలు అత్యంత జాగురూకతతో ఈ అంశాన్ని పరిశీలించాలి. ఉక్రెయిన్‌కు ఆయుధాలందజేస్తూ పోవటం, ఆంక్షలు అమలు చేయటంవల్ల రష్యా లొంగుబాటులోకొస్తుందా, అది మరింత రెచ్చిపోయి ఉన్మాద స్థితికి చేరుతుందా అన్నది గమనించు కోవాలి. విజ్ఞతతో వ్యవహరించాలి. ఆ యుద్ధాన్ని ఆపటమే ధ్యేయంగా తదుపరి చర్యలుండాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement