ఉరుము లేని పిడుగు! గోవాలో 53వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ) ముగింపు వేడుకల వేదికపై అవార్డ్ జ్యూరీ ఛైర్మన్ – ఇజ్రాయిలీ దర్శకుడు నదవ్ లపిద్ అందరి ముందూ చేసిన వ్యాఖ్య అలాంటిదే! ఇఫీలోని అంతర్జాతీయ పోటీ విభాగంలో ఇతర దేశాల చిత్రాలతో పాటు భారత్ నుంచి ఒక ఎంట్రీ అయిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ చూసిన ఆయన దాన్ని ‘అసభ్య ప్రచార చిత్రం.
ఈ ఉత్సవంలో ప్రదర్శనకు తగదు’ అన్నారు. ఈ హఠాత్ వ్యాఖ్యలు ఒక వర్గాన్ని హతాశులను చేస్తే, మరో వర్గంలో హర్షం నింపాయి. అతిథిగా పిలిచి, అవార్డుల జ్యూరీ పెత్తనమిస్తే ఇంత మాట అంటారా? కశ్మీర్‌లోని మైనారిటీ హిందువుల బాధల్ని తొలిసారి ఇంతగా తెరపై చూపిస్తే, సినిమా బాలేదనడమేమిటి? ఆస్కార్లు వచ్చిన స్పీల్‌బర్గ్ ‘షిండ్లర్స్ లిస్ట్’ మాటేమిటి? ఇలా ఎన్నో ప్రశ్నలు చర్చ రేపుతున్నాయి.
1990ల నుంచి ఇప్పటికీ ఆగని కశ్మీరీ పండిట్ల విషాదగాథ కట్టెదుటి నిజం. ఎవరూ కాదనలేని సత్యం. అయితే, ఆ సత్యాన్ని ఏ రకంగా తెరపై చూపారన్నదే వివాదం. ఈ ఏడాది మార్చిలో రిలీజైన ఈ 170 నిమిషాల చిత్రం వాణిజ్య విజయం అందుకుంది. అంతే వివాదాస్పదమూ అయింది. 1990ల కాలఘట్టాన్ని మనసును కదిలించేలా తెరపై చూపారనే ప్రశంసతో పాటు పలు వాస్తవాలను తమకు అనుకూలమైన మేరకే చూపి, మతోద్వేగాన్ని రెచ్చగొట్టారనే విమర్శలూ వెల్లువెత్తాయి.
మోదీ, అమిత్ షా తదితర పాలకవర్గ అగ్రనేతలు స్వయంగా ఈ చిత్రాన్ని ప్రశంసించారు. ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ సహా బీజేపీ పాలిత రాష్ట్రాలు, నేతాగణం వినోదపు పన్ను మినహాయింపు నుంచి ఉచితంగా టికెట్ల పంపిణీ దాకా ఈ చిత్రాన్ని పూర్తిగా భుజానికెత్తుకున్నాయి. అలా సహజంగానే ఈ సినిమాకు రాజకీయ రంగు, విభజన – విద్వేషవాదమనే పొంగు వచ్చాయి.
‘సెకనుకు 24 ఫ్రేముల చొప్పున చెప్పే సత్యం సినిమా’ అన్నారు దర్శక దిగ్గజం గొడార్డ్. కానీ, ఇవాళ విప్లవ వీరుడు అల్లూరి సైతం బ్రిటీషు వారి దగ్గర పనిచేసినట్టు సినిమాటిక్ కల్పనతో ఆస్కార్ గురిగా మన చిత్రాలు బరిలోకి దిగుతున్నప్పుడు సినిమా ఎంత సత్యమనే సందేహం కలుగుతుంది. స్వప్నలోక విహారంగా మారిన నేటి సినిమాలో సైతం కళ్ళెదుటి జీవితానికి కల్పన చేర్చి కదిలించేలా చెబితే చాలు.
విలువలెలా ఉన్నా వసూళ్ళవర్షం కురుస్తుంది. అది బాక్సాఫీస్ నిరూపిత సత్యం. వ్యాపారంలో అది ఓకేనేమో కానీ, కళాత్మక విలువలెన్నో చూసి కిరీటం పెట్టాల్సిన అవార్డ్స్‌కు అది పనికొస్తుందా? ఇఫీలో అంతర్జాతీయ చిత్రాలతో పోటీకి మనోళ్ళు దింపిన ‘కశ్మీర్ ఫైల్స్’తో సమస్య ఇదే. కశ్మీర్‌పై కన్నీరుపెట్టేవారూ కథనంలో నిజాయతీపై భిన్నాభిప్రాయంతో ఉంటే తప్పు పట్టలేం.
కరోనా తర్వాత రూ. 330 కోట్లు సంపాదించి, ఈ ఏటి మేటి బాలీవుడ్ హిట్‌గా నిలిచిన ‘కశ్మీర్ ఫైల్స్’ ఇప్పటికీ ప్రకంపనలు సృష్టిస్తోంది. లాల్‌బహదూర్ మరణం మిస్టరీపై ‘తాష్కెంట్ ఫైల్స్’ తీసి, పెద్దగా ఆకర్షించలేని దర్శక– రచయిత వివేక్ అగ్నిహోత్రి దీనికి మాత్రం సీక్వెల్ తీస్తానని ప్రకటించారు. ‘కశ్మీర్ ఫైల్స్’ ప్రేరణగా అదే తరహాలో అనేకులు రకరకాల ‘ఫైల్స్’తో వెండితెర వ్యాపారం మొదలెట్టారు.
ఈ పరిస్థితుల్లో ‘ఇఫీ’ జ్యూరీ ఛైర్మన్∙వ్యాఖ్య దౌత్యపరంగానూ కలకలం రేపింది. ఇజ్రాయిల్ రాయబారి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. తోటి ఇజ్రాయిలీ వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేశారు. భారత ఆతిథ్యాన్ని దుర్వినియోగం చేసినందుకు క్షమాపణ కోరాలంటూ బహిరంగ లేఖ రాశారు. ‘భారత్‌కు వచ్చి వెళ్ళిపోతున్న నీకేం! ఇక్కడే ఉండాల్సినవాళ్ళ పరిస్థితి ఏమి’టంటూ మందలిస్తూనే, మనసులోని భయం బయటపెట్టారు.
నిజానికి, నదవ్‌కు ఇలాంటివి కొత్తేమీకాదు. కాన్, బెర్లిన్ లాంటి ప్రఖ్యాత చిత్రోత్సవాల్లో జ్యూరీ సభ్యుడిగా అనుభవం, ఘాటుగా మాట్లాడతాడనే ముద్ర ఆయనకున్నాయి. ఆ నిష్కర్ష వైఖరి వల్లే ఇఫీకి పిలిచి, జ్యూరీ బాధ్యతలిచ్చారనుకోవచ్చు. అయితే, ప్రపంచంలో అత్యధిక సినిమాలు తీసే దేశంలో, ప్రభుత్వం వారి ప్రతిష్ఠాత్మక చలనచిత్రోత్సవంలో, పాలకపక్ష అండదండలున్న కళాకృషిని విమర్శించడం జీర్ణించుకోవడం కష్టమే.
అలాగే, గెల్చిన చిత్రాలను ప్రస్తావించే వేదికపై అవార్డ్ రాని ఎంట్రీపై వ్యాఖ్యలు చేయడమూ విచిత్రమే. అంత మాత్రానికే సినిమాను విమర్శించిన వారందరినీ అర్బన్ నక్సల్స్, దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్న తుకడే గ్యాంగ్ అనేయచ్చా?
నదవ్ పండిట్లకు మద్దతునిస్తూనే, ‘హింసాద్వేషాల్ని ప్రేరేపించేలా మసిపూసి మారేడుకాయలా ఆ చిత్రం తీశారు. ఫాసిస్ట్ కోణం ఉంద’ని వివరణనిచ్చారు. ఇది తనొక్కరి అభిప్రాయం కాదనీ, బయట పెదవి విప్పకున్నా సినిమా చూడగానే జ్యూరీ మొత్తం ఇదే అభిప్రాయపడిందనీ తేల్చారు. సిన్మా సహా ఏ కళాకృషీ విమర్శకు అతీతం కాదు. ఆత్మాశ్రయమే అయినా అవార్డ్ నిర్ణేతల పని అదే!
విధాన నిర్ణయాలతో బాధితులకు సాంత్వన చేకూర్చాల్సినవారు అది గాలి కొదిలి, ప్రచార కళతో వెండితెర వెనక దాగుందామనుకుంటేనే దారుణం. గత ఎనిమిదేళ్ళలో పాలకులు ఎందరు పండిట్లకు కశ్మీర్‌లో పునరావాసం కల్పించగలిగారు? మిగిలిన కొద్ది కుటుంబాలు నేటికీ తూటాలకు బలవుతుంటే ఏ మేరకు రక్షణ కల్పించారు? వీటిని వదిలేసి, నిర్దిష్ట రాజకీయ లక్ష్యాలతో తీసిన వ్యాపారాత్మక చిత్రం బాగోగులపై ఎవరో, ఏదో అన్నారని విరుచుకుపడితే ఉపయోగమేంటి? బాధిత కశ్మీరీలకు కావాల్సింది పెదాల మీది ప్రేమ కాదు... పాలకుల చేతల్లో చేవ. సినిమాలు అందుకు ప్రేరేపిస్తే మంచిదే. వెనకుండి నడిపే రాజకీయుల కోసం విద్వేషాలకు ఆజ్యం పోసి, విభజన పెంచితేనే కష్టం. తాజా ఘటనతో ‘ఇఫీ’ జ్యూరీలను సజాతీయులతో నింపేస్తే మరీ నష్టం!
చిత్రమా? ప్రచార విచిత్రమా?
Published Thu, Dec 1 2022 2:33 AM | Last Updated on Thu, Dec 1 2022 2:33 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment