పాకిస్తాన్ ప్రజాస్వామ్య ఉద్యమం (పీడీఎం) కూటమి నేతలు
పాకిస్తాన్‌లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాలనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఎట్టకేలకు ఉమ్మడి కార్యా చరణ ప్రకటించాయి. ఈ నెల 16తో మొదలుపెట్టి డిసెంబర్ 13 వరకూ దేశంలోని అన్ని ప్రాంతాల్లో బహిరంగసభలు నిర్వహించాలని అవి నిర్ణయించాయి. గత నెలలో 11 పార్టీలు కలిసి పాకిస్తాన్ ప్రజాస్వామ్య ఉద్యమం(పీడీఎం) పేరిట కూటమిని ఏర్పాటు చేసినప్పటినుంచీ ఆ పార్టీల మధ్య సంప్రదింపులు సాగుతూ వున్నాయి. వాస్తవానికి ఈ పార్టీల ఆగ్రహం ఇమ్రాన్‌పై కాదు. ఆ చాటున పెత్తనం చలాయిస్తున్న పాకిస్తాన్ సైన్యంపై. కనుకనే ఇమ్రాన్ ప్రభుత్వం చురుగ్గా కదిలింది. పాకి స్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) నేత, దేశ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్(ఎన్) నేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌లపై కేసులు మొదలయ్యాయి.
జర్దారీపై రెండు అవినీతి కేసుల్లో పాకిస్తాన్ కోర్టు నేరారోపణలు ఖరారు చేయగా... నవాజ్ షరీఫ్‌పై పంజాబ్ ప్రావిన్స్ పోలీసులు రాజద్రోహం కేసు నమోదు చేశారు. పాకిస్తాన్ రాజకీయ కార్యకలాపాల్లో అక్కడి సైన్యం జోక్యం చేసుకుంటున్నదంటూ షరీఫ్ గత వారం ఆన్‌లైన్‌లో చేసిన ప్రసంగంపై ఒక పౌరుడు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు పెట్టామని పోలీసులు చెబుతున్నారు. 2018 ఎన్నికల్లో సైన్యం రిగ్గింగ్ వల్లే ఇమ్రాన్ అధికారంలోకొచ్చారన్నది షరీఫ్ ప్రసంగం సారాంశం. ఈ కేసులో నేరం రుజువైతే ఉరిశిక్ష ఖాయం. అసలు షరీఫ్ ఆ ప్రసంగం చేసిన రోజే ఇమ్రాన్ ఆయన్ను భారత్ చేతిలో కీలు బొమ్మగా అభివర్ణించారు. ఆ వెనకే షరీఫ్‌పై రాజద్రోహం కేసు నమోదైంది.
(చదవండి: ... అయినా మారని ట్రంప్!)
పాకిస్తాన్ రాజకీయాల్లో సైన్యం పాత్రపై షరీఫ్ చేసిన ఆరోపణ కొత్తది కాదు. పాకిస్తాన్ ఏర్పడి 73 సంవత్సరాలవుతుంటే అందులో సగభాగం సైనిక పెత్తనమే సాగింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని సైనిక బలంతో కూలదోయడం, సైనిక దళాల చీఫ్ పాలకుడు కావడం పాక్‌లో రివాజు. 1958లో అయూబ్‌ఖాన్‌తో ఇది మొదలైంది. జనరల్ యాహ్యాఖాన్, జనరల్ జియా వుల్ హక్, జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ తదితరులు ఒకరి తర్వాత ఒకరు ప్రజాస్వామ్యాన్ని సమాధి చేశారు. సైనిక దళాల చీఫ్‌లే పాలకులు కావడం, వారే ఏళ్ల తరబడి పాలన పేరుతో అణచివేతను సాగించడం, ప్రజల్లో నిరసనలు వెల్లువెత్తాక నిష్క్రమించడం పాక్ చరిత్రలో మామూలే.
జనరల్ జియా వుల్ హక్ తన పాలనను శాశ్వతం చేసుకోవడానికి మత సంస్థలను రంగంలోకి దింపి, వారి ద్వారా రాజకీయ రంగాన్ని శాసించే యత్నం చేసి ఆ దేశాన్ని శాశ్వతంగా మత ఛాందసవాద శక్తుల చేతుల్లో పెట్టారు. చిత్రమేమంటే... పార్టీల నేతలుగా అవతారమెత్తిన జుల్ఫికర్ అలీ భుట్టో, నవాజ్ షరీఫ్ వంటివారు సైతం సైనిక పాలకుల ఆశీర్వాదంతోనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. సైన్యంతో బాగున్నంతకాలం వారు సజావుగా పాలన సాగించారు. సైన్యం ఆగ్రహిస్తే పదవులు కోల్పోయారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) స్థాపించిన భుట్టో అంతక్రితం జనరల్ అయూబ్‌ఖాన్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. 1977లో భుట్టో ప్రధానిగా వున్న సమయంలో ఆయన్ను కూలదోసి జనరల్ జియావుల్ హక్ అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు.
చివరకు ఆయన బతికుంటే తనకు ఎప్పటికైనా సవాలుగా నిలుస్తాడని భావించి హత్యానేరం ఆరోపణలో ఉరిశిక్ష పడేలా చేసి ప్రాణం తీశారు. ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించాకే బేనజీర్ భుట్టో అయినా, నవాజ్ షరీఫ్ అయినా అధికారంలోకొచ్చారు. అయితే వారిద్దరూ పదవిలో కొనసాగింది మాత్రం సైన్యం దయాదాక్షిణ్యాలపైనే. బేనజీర్ భుట్టో మూడు దఫాలు, నవాజ్ షరీఫ్ రెండు దఫాలు కొంతకాలం చొప్పున ప్రధానులుగా పనిచేశారు. 2008 తర్వాత సైన్యం కాస్త వెనక్కు తగ్గింది. తొలిసారి పౌర ప్రభుత్వాన్ని అయిదేళ్లూ అధికారంలో సజావుగా సాగనిచ్చింది. ఆ తర్వాత 2013లో అధికారంలోకొచ్చిన నవాజ్ షరీఫ్ సైతం అయిదేళ్లూ పాలించారు. 2018లో నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని పీఎంఎల్(ఎన్)ను ఓడించి, అధికారంలోకొచ్చిన ఇమ్రాన్ ఖాన్ వెనక మళ్లీ పాకిస్తాన్ సైన్యం ప్రధాన పాత్ర పోషించింది. ఆయన నవాజ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడిపిన ఉద్యమంలోనూ, ఎన్నికల్లో ఆయనకు అనుకూలంగా సాగిన రిగ్గింగ్‌లోనూ ప్రధాన వాటా సైన్యానిదే.
(చదవండి: ఎల్‌ఏసీ వద్ద పాకిస్తాన్ సైనికులు!)
కనుక రాజకీయాల్లో సైన్యం జోక్యం చేసుకుంటున్నదన్న నవాజ్ ఆరోపణల్లో వైపరీత్యమేమీ లేదు. కానీ పాకిస్తాన్‌లో చిన్న ఆరోపణ కూడా ప్రాణాంతకమైన నేరంగా మారడంలో వింతేమీ లేదు. అలాగే తమ వ్యతిరేకుల్ని భారత్ ఏజెంట్లుగా ముద్రేయడం, వారిని భారత్‌కు పోవాలని బెదిరించడం కూడా అక్కడ సర్వసాధారణమే. ఇప్పుడు చాన్నాళ్ల తర్వాత పాకిస్తాన్ విపక్షాలు చేతులు కలిపాయి. 2006లో అప్పటి సైనిక పాలకుడు ముషార్రఫ్‌కు వ్యతిరేకంగా బేనజీర్, నవాజ్ షరీఫ్‌లిద్దరూ లండన్‌లో సమావేశమై ‘ఛార్టర్ ఆఫ్ డెమొక్రసీ’పై సంతకాలు చేసి సమష్టి ఉద్యమం నడిపారు. చివరికది 2008లో ఎన్నికలకు దారితీసింది. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ సర్కారు ఆర్థికంగా ఒడిదుడుకుల్లో వుంది. కరోనా వైరస్ పర్యవసానంగా ఏర్పడ్డ పరిస్థితులవల్ల నిరుద్యోగ సమస్య మరింత ఉగ్రరూపం దాల్చింది.
వచ్చే మార్చిలో పార్లమెంటు ఎగువసభ సెనేట్‌కు ఎన్నికలు జరగ బోతున్నాయి. ఎగువసభలో ఇమ్రాన్‌కు మెజారిటీ రానీయకూడదనుకుంటే దేశంలో ఇప్పటినుంచీ ఉద్యమం ఉధృతం చేయాలి. కీలక రాష్ట్రమైన పంజాబ్‌లో పీఎంఎల్(ఎన్)కు ఇప్పటికే పట్టుంది. ఇతర రాష్ట్రాల్లో సైతం దృఢంగా ఉద్యమాన్ని నిర్వహిస్తే ఇమ్రాన్‌ఖాన్ సర్కారు పునాదులు కదిలిం చడం సులభమన్నది విపక్షాల అంచనా. కానీ సైన్యం అండదండలున్న ఇమ్రాన్‌ను పడగొట్టడం అంత సులభం కాదు. అయితే పాకిస్తాన్ చరిత్ర చూస్తే ఎంతో బలహీనంగా కనబడ్డ ఉద్యమాలే కాలం గడిచేకొద్దీ పదునెక్కాయి. పాక్ విపక్ష కూటమి పీడీఎం ఎంత బలంగా ఉద్యమం నిర్మిస్తుందో మున్ముందు చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment