తపోదీక్షలో ఉన్న వ్యాసుడికి ఉన్నట్టుండి సృజన ఉప్పొంగుతుంది. మానవజాతి చరిత్రను కావ్యరూపంలో రాయ సంకల్పించి, తనకు లేఖకుడిగా కౌమార బాలుడైన పరీక్షిత్తును ఉండమంటాడు. పరీక్షిత్తుకు తన పూర్వీకులను అతి దగ్గరగా పరిచయం చేయడం వ్యాసుడి ప్రాథమికోద్దేశం. మనుషుల అతి సంక్లిష్టమైన స్వభావాలను చిత్రించడం ద్వారా మానవజాతికి తమ ఉనికి పట్ల ఒక జాగరూకతను కలిగించడం పరమ లక్ష్యం. ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధం తర్వాత జరిగింది సర్వనాశనమే. ఇంతటి మహోన్నత కార్యం కాబట్టే, సాక్షాత్తూ దేవుడే(గణేశుడు) స్వయంగా వ్యాసుడికి లేఖకుడిగా కుదురుకుంటాడు. ఇటీవల మరణించిన రంగస్థల దిగ్గజం పీటర్ బ్రూక్ దర్శకత్వం వహించిన ‘ద మహాభారత’, తానూ ఒక పాత్రగా ఉన్న భారతాన్ని వ్యాసుడు రాయడానికి పూనుకోవడంతో ప్రారంభమవుతుంది.
మనకు మహాభారతం కొత్తది కాదు. మన సారస్వతం మహాభారతంతో ప్రభవించింది. మన రంగస్థలం మహాభారతంతో సంపన్నమైంది. మన చిత్రసీమ మహాభారతంతో పదునెక్కింది. ‘తత్వజ్ఞులు ధర్మశాస్త్రంగా, ఆధ్యాత్మవిదులు వేదాంతంగా, నీతివిచక్షణులు నీతిశాస్త్రంగా, కవులు మహాకావ్యంగా, లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహంగా, పౌరాణికులు బహుపురాణ సముచ్ఛయంగా’ గౌరవించే ఇతిహాసం ఇది. ‘ఇందులో ఉన్నదే ప్రపంచంలో ఉన్నది. ఇందులో లేనిదేదీ ప్రపంచంలో లేదు.’ అందుకే బయట తలెత్తిన సమస్యకు మహాభారతంలో సమాధానం వెతకడానికి ప్రయత్నించాడు ఇంగ్లండ్‌కు చెందిన ‘పద్మశ్రీ’ పీటర్ బ్రూక్(1925–2022).
వియత్నాంతో అమెరికా యుద్ధం జరిగిన తర్వాతి విధ్వంసం బ్రూక్‌కు మహాభారతం మీద ఆసక్తిని కలిగించింది. ప్రతి పాత్రా రక్తమాంసాలతో, తనవైన బలహీనతలతో ఉండి, యుద్ధ బీభత్సాన్ని అనివార్యం చేస్తుంది. ప్రతి మనిషీ సృష్టి విధ్వంసంలో ఏదో ఒక మేరకు పాత్రను పోషిస్తూనే ఉంటాడు; అందుకే అందరూ ఈ ప్రపంచానికి ఉమ్మడిగా బాధ్యులేనని పీటర్‌కు నమ్మకం కలిగింది. దాన్నే విశ్వ యవనిక మీద ఎలుగెత్తి చాటాడు.
క్లాసిక్స్‌ను స్టేజీ మీదకు తేవడంలో రంగస్థలానికి ప్రమాణాలు నెలకొల్పిన పీటర్ బ్రూక్ ‘అవర్ గ్రేటెస్ట్ లివింగ్ థియేటర్ డైరెక్టర్’ అనిపించుకున్నాడు. భారతం కోసం ఫ్రెంచ్ రచయితలైన జాన్ క్లాడ్ కారియేరీ, మేరీ హెలెనా ఏస్తియన్‌తో జట్టు కట్టాడు. ఎందరో సంస్కృత పండితులను కలిశారు. ఎనిమిదేళ్ల శ్రమ తర్వాత పన్నెండు గంటల నాటకంగా భారతం రూపొందింది. 1985లో తొలి ప్రదర్శన జరిగింది. పదహారు దేశాలకు చెందిన నటీనటులతో నాలుగేళ్లపాటు వీరి బృందం అమెరికా నుంచి ఆఫ్రికా గ్రామాల వరకూ పర్యటించింది. ముంబయి నగరానికీ వచ్చింది.
తెలుపు, నలుపు, గోధుమ వర్ణాల నటులతో ఇది నిజంగానే ప్రపంచ నాటకంగా మారిపోయింది. ‘లార్డ్ ఆఫ్ ద ఫ్లైస్’ లాంటి సినిమాతో సినీ దర్శకుడిగానూ ప్రసిద్ధుడైన బ్రూక్ తన నాటకం ఆధారంగానే 1989లో ఐదున్నర గంటల టెలివిజన్ సిరీస్‌గా ‘ద మహాభారత’ రూపొందించారు. ఆయన్ని అంచనా కట్టడానికి మనకు ఇప్పుడున్న సోర్సు ఇదే! ‘మ..హా..భా..ర..త్..’ అంటూ దూరదర్శన్ ద్వారా 94 వారాల ధారావాహికను ఇంటింటికీ పరిచయం చేసిన బీఆర్ చోప్రాకు ముందు, లేదా సమాంతరంగా బ్రూక్ అనుసృజన మొదలైంది.
మొదటి సీన్ నుంచే మనకు అలవాటైన భారతాన్ని చూడటం లేదని అర్థమైపోతుంది. ద్రౌపది(మల్లికా సారాభాయి) లాంటి ఒకట్రెండు పాత్రలు తప్ప ఎవరూ భారతీయులు కాదు. సెట్టింగులు తక్కువ, ఆభరణాలు అత్యల్పం, కిరీటాలు లేవు, పరిచారికలు కనబడరు, జయజయ ధ్వానాలు శూన్యం, రాజకుమారులందరూ షేర్‌వానీలు తొడుక్కుంటారు. మహామహా యోధులు బారులు తీరిన చివరి యుద్ధ ప్రారంభ సూచికగా అర్జునుడు శంఖం ఊదినప్పుడు కనబడేది మహా అయితే రెండు తెల్ల గుర్రాలు మాత్రమే. ఒక భారీ విజువల్ ఫీస్ట్ దీన్నుంచి ఆశించలేం. కానీ పీటర్ బ్రూక్ గొప్పతనం ఎక్కడంటే, అవేవీ లేకుండానే ఆ ఉద్వేగాన్ని పలికించగలగడం. రంగస్థలం మీద ఒక ఖాళీ స్థలంలో నువ్వొక విశ్వాన్ని చూపగలవు; నటుడి చేతిలోని ఒక కర్ర, ఒక సీసా, లేదా ఖాళీ మద్య పాత్రతో ఎంతో చేయొచ్చునంటాడు బ్రూక్. ఆ స్ఫూర్తి ఇందులోనూ కనబడుతుంది. కథను వర్తమానంలో చూపడం కంటే జరిగిపోయినదాన్ని వ్యాసుడు నెరేటర్‌గా చెబుతుండటం వల్ల ఇందులో ఉన్నదేదీ ఇక లోపంగా కనబడదు.
కృష్ణుడు నీలవర్ణంలో ఉండకపోవడం, భీష్ముడంతటివాడిని కూడా మనవలు పేరు పెట్టి పిలవడం భారతీయ పద్ధతికి దూరం. గన్నేశా, సత్యవత్తి లాంటి ఉచ్ఛారణలు భారతీయేతరుల పరిమితి. వీటికంటే కూడా భారత వారసత్వాన్ని దొంగిలిస్తున్నాడని పీటర్ నిందలు ఎదుర్కొన్నాడు. అయితే, భారతం ప్రపంచానికి చెందినదని తన ప్రయత్నాన్ని సమర్థించుకున్నాడు.
మడుగులో నీళ్లు తాగడానికి అనుమతి ఇచ్చేముందు యక్షుడు అడిగే ప్రశ్న: ‘ఈ ప్రపంచానికి కారణం ఏమిటి?’ దానికి ధర్మరాజు సమాధానం: ‘ప్రేమ!’ ఇదే సర్వకాలావసరం. సాహిత్య ఆదాన ప్రదానాలకు కారణమయ్యే, అన్ని ప్రాంతాల వైవిధ్యమైన కథనాలను ప్రపంచం వినగలిగేట్టు చేసే సాంస్కృతిక దూతలు ఎప్పుడూ అవసరమే. మనుషులను అర్థం చేసుకోవడం ద్వారానే మనుషులు మారగలరు.
Comments
Please login to add a commentAdd a comment