ఆదేశాలిచ్చినా ఆచరణలో పెట్టకపోతే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. వాయు కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న రాజధాని ఢిల్లీలోనే కాక, దేశవ్యాప్తంగా నిర్ణీత నిషేధిత రసాయనాలున్న టపాసులను నిషేధిస్తున్నట్టు సుప్రీమ్ కోర్టు గతవారం ఆదేశాలిచ్చింది. కానీ, జరిగింది మాత్రం వేరు. ఇష్టా రాజ్యంగా టపాసులు కాల్చడం కొనసాగింది. ఎప్పటిలానే దట్టమైన పొగలో ఢిల్లీ కూరుకుపోయింది. దీపావళి వేళ ఒక్క ఢిల్లీలోనే కాక దేశవ్యాప్తంగా వాయు, శబ్ద కాలుష్యాలు నియంత్రణ కాకపోగా మరింత పెరిగాయి. ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా సహా 7 నగరాల్లో కాలుష్యస్థాయి ఘనపు మీటర్‌కు 500 మైక్రోగ్రాముల స్థాయిని దాటేసినట్టు గంటల వారీగా చేసిన విశ్లేషణలో వెల్లడైంది. హానికారకమైన నిర్ణీత టపాసులు కాల్చడంపై నిషేధం అమలులో ప్రభుత్వాల వైఫల్యాన్ని ప్రతిబింబిస్తోంది.
ఢిల్లీ, గురుగ్రామ్, చండీగఢ్, కోల్‌కతా, ముంబయ్, తదితర నగరాల్లో నిషేధిత టపాసులు సైతం నిల్వచేశారు, అమ్మారు, బాహాటంగా వాటిని కాల్చారు. కోర్టు ఆదేశాలు సైతం గాలికి పోవడం విషాదమే. అయితే, ప్రజల్లో చైతన్యం తీసుకురాకుండా, వారిని మానసికంగా సంసిద్ధం చేయకుండా, ప్రభుత్వాల ఆచరణలో చిత్తశుద్ధి లేకుండా... ఎవరెన్ని ఆదేశాలు జారీ చేసినా ప్రయోజనం ఉండదని మరోసారి రుజువైంది. దీపావళి ముగిసి మూణ్ణాళ్ళయినా ఢిల్లీలో వాయు నాణ్యత ఇప్పటికీ ప్రమాదకర స్థాయిలోనే ఉందని వార్త. నిజానికి, దేశ రాజధానిలో టపాసులపై నిషేధం పెట్టడం ఇదేమీ తొలిసారి కాదు. వాటి అమ్మకాన్ని దేశ రాజధానిలో నిషేధించాల్సిందిగా 2018 అక్టోబర్‌లో సైతం సుప్రీమ్ కోర్ట్ అప్పటి ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. ‘పర్యావరణ హిత’ (గ్రీన్) టపాసులు, తక్కువ ఉద్గారాలు వెలువరించే ‘మెరుగైన’ టపాసులకు మినహాయింపు నిచ్చింది. అప్పుడూ ఆ మాట ఆదేశాలకే పరిమితమైంది తప్ప ఆచరణకు నోచుకోలేదు.
అప్పట్లో కొద్దిరోజులకే... తక్కువ కాలుష్యం కలిగించే టపాసులను అభివృద్ధి చేసినట్టు ‘కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్’ ప్రకటించింది. సాంప్రదాయిక టపాసుల కన్నా ఇవి చౌక అనీ చెప్పింది. వాటి అతీగతీ తెలీదు. అంతకన్నా ఘోరమేంటంటే, చైనా నుంచి దిగుమతి చేసుకున్న టపాసులు ‘మేడిన్ ఇండియా’ అంటూ నకిలీ ముద్రతో మార్కెట్‌లో యథేచ్ఛగా తిరుగుతున్నాయి. వాటిని ఆపే ప్రయత్నాలు సమర్థంగా జరగడం లేదు. అలాగే, ఇటీవల రెండు గంటలే టపాసులు కాల్చడానికి అనుమతిస్తున్నట్టు ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. ఆ ఆదేశాలూ ఎక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు. వెరసి, కాలుష్య నియంత్రణపై మాటలే తప్ప చేతలు కనిపించని వైనం సహజంగానే అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెర తీస్తోంది. టపాసుల నిషేధంపై ఢిల్లీ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ విమర్శిస్తోంది. బీజేపీ నేతాగణం, బీజేపీ పాలిత రాష్ట్రాలే ఆచారాల పేరు చెప్పి టపాసులు కాల్చేలా ప్రజల్ని కావాలని రెచ్చగొడుతున్నాయని ‘ఆప్’ ఆరోపిస్తోంది.
పరస్పర నిందారోపణలు పక్కనపెడితే, కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు. దేశ రాజధానిలో కాలుష్య నియంత్రణ చర్యలు ఫలితమివ్వకపోవడానికి... ఢిల్లీకీ, పొరుగు రాష్ట్రాలకూ మధ్య సమన్వయ లోపం ఓ ప్రధాన కారణం. ఇక, ఢిల్లీలోని ‘ఆప్’ ప్రభుత్వ వైఫల్యాలు సరేసరి. పండుగ వచ్చే ముందు ప్రతిసారీ ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తి చేయడం, మార్గదర్శకాలు జారీ చేయడం షరా మామూలే. అవన్నీ వట్టి కంటి తుడుపు చర్యలే అవుతున్నాయి. ఏటా ఈ సీజన్‌లో ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పంట వ్యర్థాల దహనంలోనూ ఇదే జరుగుతోంది. చట్టాలు చేసినా సరే పంజాబ్, హర్యానా సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం ఆగింది లేదు. ఒక్క పంజాబ్‌లోనే సెప్టెంబర్ 15 నుంచి ఇప్పటికి 28 వేలకు పైగా దహనాల ఘటనలు జరిగినట్టు లెక్క. ఫలితంగా హర్యానా లాంటి చోట్ల వాయు నాణ్యతా సూచి ‘అల్ప’, ‘అత్యల్ప’ స్థాయుల్లోనే కొనసాగుతోంది. అనారోగ్యాన్ని మరింత పెంచే ఈ కాలుష్య విషాన్ని తట్టుకోలేక కాంగ్రెస్ నేత సోనియా లాంటి వారు నిరుడు గోవా, ఈసారి జైపూర్‌లకు తరలిపోయారంటే అర్థం చేసుకోవచ్చు.
ఇవన్నీ పర్యావరణ పరిరక్షణ పట్ల మన చిత్తశుద్ధి లేమికి ప్రతీకలు. పంట వ్యర్థాలు, దీపావళి టపాసుల విషయంలోనే కాదు... వినాయక చవితి, విజయదశమి వేళ దేవతా విగ్రహాల నిమజ్జనంలోనూ ఇదే తంతు. హైదరాబాద్ లాంటి చోట్ల హుస్సేన్‌సాగర్‌లో మట్టి విగ్రహాలే నిమజ్జనం చేయాలని ఏటేటా కోర్టు ఆదేశాలిస్తున్నాయి. ప్రభుత్వాలు సరేనని తలూపుతున్నాయి. క్షేత్రస్థాయిలో జరు గుతున్నది మాత్రం వేరు. కాలుష్యకారక విగ్రహాలతో ఒకటికి మూడు రోజులు సచివాలయం సాక్షిగా నిమజ్జనాలు నడుస్తుంటాయి. సంప్రదాయాల్ని పాటించాల్సిందే. కానీ, పెరిగిన కాలుష్య ప్రమాదం దృష్ట్యా వాటిని పర్యావరణ అనుకూలంగా మార్చుకోవడం ముఖ్యం. తాగే నీరు, పీల్చే గాలిని ప్రాణాంతకంగా మార్చుకొమ్మని ఏ ధర్మమూ బోధించదు. అది గ్రహించి, మారాల్సింది మనమే!
సమాజంలో మార్పు రాత్రికి రాత్రి వస్తుందనుకోలేం. టపాసుల సంరంభాన్నీ, విగ్రహాల ఆర్భా టాన్నీ తగ్గించుకొమ్మని ప్రజలను కోరే ముందు ప్రభుత్వాలు చిత్తశుద్ధి కనబరచాలి. ఆదేశాలన్నీ అప్పటికప్పుడు తీసుకుంటున్న అత్యవసర చర్యలుగా కనిపిస్తే లాభం లేదు. పాఠాల్లో భాగంగా టీచర్ల ద్వారా పిల్లలకు అవగాహన పెంచాలి. నివాసగృహాల అసోసియేషన్లను పర్యావరణహిత చర్యల్లో భాగం చేయాలి. పర్యావరణం, ప్రజారోగ్యం అందరి బాధ్యత గనక కేంద్రం, రాష్ట్రాలు ఒక దానిపై మరొకటి నెపం మోపడం సరికాదు. ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ప్రతిపక్షాలూ సహకరించడమే దీనికి సరైన పరిష్కార మార్గం. మునిసిపాలిటీ, అసెంబ్లీ నుంచి పార్లమెంట్ వరకు అందరూ కలసికట్టుగా నడవాలి. ఊపిరాడని దేశ రాజధానిలో ముందుగా ఆ అడుగులు పడాలి.
ఆదేశాలేనా? ఆచరణ లేదా?
Published Thu, Nov 16 2023 4:27 AM | Last Updated on Thu, Nov 16 2023 4:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment