దాదాపు అర్ధశతాబ్దం క్రితం అమెరికా అంతటా మహిళలకు దక్కిన వరం అది. 1973లో ‘రో వర్సెస్ వేడ్’ కేసులో తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయంతో ఆ దేశమంతటా గర్భస్రావం చట్టబద్ధమైంది. అలా 22 నుంచి 24 వారాల లోపు గర్భస్రావం చేయించుకోవడానికి దక్కిన హక్కు ఇప్పుడు అమెరికా సుప్రీంకోర్టు నిర్ణయంతో మహిళలకు దూరమవుతోంది. ఈ తిరోగమన చర్యతో లావోస్, ఫిలిప్పైన్స్, ఈజిప్ట్, ఇరాక్‌ల దోవలో గర్భస్రావాన్ని చట్టవిరుద్ధం చేసిన దేశాల జాబితాలో అమెరికా చేరింది.
ఇప్పుడిక అమెరికాలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం గర్భస్రావ హక్కుపై సొంత నిర్ణయాలు తీసుకొనే వీలు చిక్కింది. జూన్ 24న కోర్టు ఇచ్చిన ఈ ఆదేశం స్త్రీ స్వేచ్ఛనూ, సొంత శరీరంపై స్త్రీలకున్న సహజమైన హక్కునూ కాలరాయడమే అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్త చర్చ. గర్భస్రావాలపై నిషేధం లైంగిక సమానత్వానికీ, మహిళల మానవహక్కులకూ గొడ్డలిపెట్టు అని ఐరాస సహా అంతర్జాతీయ మహిళా సంఘాలు ఎలుగెత్తుతున్నాయి. సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం ‘కోర్టు తాజా నిర్ణయం దురదృష్టకరం, ఇది దేశానికి దుర్దినం’ అన్నారంటే విషయ తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
అమెరికా కోర్టు 6–3 మెజారిటీతో ఇచ్చిన ఆదేశాన్ని ఆసరాగా చేసుకొని, అక్కడ 50 రాష్ట్రాల్లో కనీసం 26 రాష్ట్రాల్లో గర్భస్రావంపై నిషేధాలొచ్చే సూచనలున్నాయి. రిపబ్లికన్ల హయాంలోని రాష్ట్రాలు తక్షణమే గర్భస్రావాన్ని నిషేధించడమో, లేదంటే బోలెడన్ని ఆంక్షలు విధించడమో చేయనున్నాయి. మరోపక్క డెమోక్రాట్ల సారథ్యంలోని పలు రాష్ట్రాలేమో మహిళల గర్భస్రావ హక్కును కాపాడే చర్యలకు సిద్ధమవుతున్నాయి. వెరసి, అమెరికాలో ఆ యా రాష్ట్రాలలోని పాలకపార్టీని బట్టి స్త్రీ స్వేచ్ఛ ఉండే పరిస్థితి వచ్చిందన్న మాట.
అయితే, కొత్త నియంత్రణల దెబ్బతో ఇక ఎవరూ గర్భ స్రావం చేయించుకోకుండా ఆగిపోతారని అనుకుంటే అమాయకత్వమే. దొంగచాటు గర్భస్రావాలు పెరిగి, గర్భిణుల ప్రాణాలకే ప్రమాదం పెరిగే అవకాశాలెక్కువ. ఐరాస ప్రతినిధుల అభిప్రాయమూ అదే. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న గర్భస్రావాల్లో నూటికి 45 గర్భస్రావాలు సురక్షితమైనవి కావు. అవి గర్భిణుల మరణానికి దారి తీస్తున్నాయని సాక్షాత్తూ ఐరాస పాపులేషన్ ఫండ్ లెక్క.
నిజానికి, కోర్టు తాజా నిర్ణయం తాలూకు ముసాయిదా మే నెలలోనే బయటకు పొక్కింది. అమెరికన్ స్త్రీలకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన ఓ ప్రాథమికమైన హక్కుకు ముప్పు వాటిల్లనుందని అప్పటి నుంచీ చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు కోర్టు నిర్ణయం అధికారికంగా వచ్చేసింది గనక, అటు రాజకీయంగానూ, ఇటు ప్రభుత్వ విధానపరంగానూ బైడెన్ వ్యూహాలు పరీక్షను ఎదుర్కోక తప్పదు.
కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న నిరసనను రాజకీయంగా ఉపయోగించుకొని, నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని బైడెన్, ఇతర డెమోక్రాట్లు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా గర్భస్రావ హక్కు కల్పించేలా చేయడం కష్టమే కానీ, వివిధ రాష్ట్రాల్లో డెమోక్రాట్లు విజయాలు సాధిస్తే గనక రిపబ్లికన్ల గర్భస్రావ నిషేధ యత్నాలను కొంత నియంత్రించవచ్చు. బైడెన్ వర్గం ఆ మాటే ప్రచారంలో పెట్టనుంది.
కానీ, మధ్యంతర ఎన్నికల తర్వాత అమెరికన్ పార్లమెంటులోని రెండు సభల్లోనూ రిపబ్లికన్లదే మెజారిటీ కావచ్చని ఓ అంచనా. ఛాందస సంప్రదాయవాది అయిన ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ అధ్యక్షులైనా ఆశ్చర్యం లేదని వార్త. అంటే, గర్భస్రావమే కాదు... ఇంకా అనేక అంశాల్లో అమెరికా పాత కాలపు దురభిప్రాయాల్లోకి తిరోగమిస్తుందా?
గర్భస్రావ హక్కుపై పోరు అమెరికాలో ఓ భావోద్వేగభరిత సైద్ధాంతిక యుద్ధం. కొన్ని దశాబ్దాలుగా కన్జర్వేటివ్‌లు గర్భస్రావ హక్కు నిర్ణయాన్ని తిరగదోడేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. మిగతావాళ్ళు ప్రతిఘటిస్తూనే ఉన్నారు. తీరా కోర్టులో కన్జర్వేటివ్‌ల ఆధిక్యంతో ఇప్పుడు గర్భస్రావ హక్కును తొలగించేందుకు సందు చిక్కింది. ఇదంతా ఘనత వహించిన అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ చలవే.
ఎందుకంటే, ఆయనే తన హయాంలో ముగ్గురు కన్జర్వేటివ్ సుప్రీమ్ కోర్టు జడ్జీలను నియమించారని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఆ ముగ్గురూ తాజాగా గర్భస్రావ హక్కును కొట్టిపారేసేందుకు ఓటేశారట. కేవలం ఆరే ఆరుగురు జడ్జీలు మొత్తం అమెరికన్ స్త్రీ జాతి శారీరక స్వేచ్ఛపై సమ్మెట దెబ్బ వేసి, వారి తలరాతను మార్చేయడం అత్యంత విషాదం. అమానవీయం.
లైంగిక, పునరుత్పాదక ఆరోగ్యం, హక్కులనేవి ప్రపంచ వ్యాప్తంగా స్త్రీ సమానత్వానికీ, స్వేచ్ఛకూ, ఎంపిక హక్కుకూ సంబంధించిన అంశాలు. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకొనే అమెరికాలోనే ఆ హక్కులపై నియంత్రణ పెట్టారంటే ఏమనుకోవాలి! ఎవరైనా సరే తుపాకీలు యథేచ్ఛగా కొనుక్కోవడానికి అవకాశమిస్తున్న అగ్రరాజ్యం... తీరా గర్భాన్ని కొనసాగించాలా, వద్దా అని నిర్ణయించుకొనే హక్కు మాత్రం స్త్రీలకు లేదనడమే విరోధాభాస.
ఇంకా చెప్పాలంటే, ఒక దేశం ఆర్థిక పురోగమించినంత మాత్రాన ఆ దేశంలో పౌర స్వేచ్ఛ, హక్కులు పరిరక్షితమవుతాయని అనుకుంటే పొరపాటే అని మరోమారు ఋజువైంది. ఆదర్శంగా నిలవాల్సిన భారీ ప్రజాస్వామ్య దేశంలోని వ్యవహారం రేపు మిగతా ప్రపంచమూ ఆదర్శంగా తీసుకుంటే, అది మహిళలకు జరిగే మహాపచారం. అందుకే, పాశ్చాత్య ప్రపంచం తిరోగమిస్తుంటే, మన దేశం మాత్రం గర్భస్రావం, అద్దె గర్భం, బాల్యవివాహాల నిరోధం లాంటి అంశాల్లో మెరుగైన చట్టాలతో పురోగమిస్తోందని కేంద్ర పాలకులు జబ్బలు చరుచుకోవడం అర్థం చేసుకోదగినదే!
వారికి స్వేచ్ఛ లేదా?
Published Tue, Jun 28 2022 12:50 AM | Last Updated on Tue, Jun 28 2022 12:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment