మహాప్రభో! మళ్లీ బాదుడా? | Sakshi Editorial On Bank ATM Charges | Sakshi
Sakshi News home page

మహాప్రభో! మళ్లీ బాదుడా?

Published Fri, Jul 16 2021 12:46 AM | Last Updated on Fri, Jul 16 2021 12:50 AM

Sakshi Editorial On Bank ATM Charges

‘ఈ ప్రాంగణంలో అత్యంత ముఖ్యమైన అతిథి వినియోగదారే. అతను లేదా ఆమె మన మీద ఆధారపడి లేరు. మనమే వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాం. వాళ్ళు మన పనికి అడ్డు కాదు. వాళ్ళే మన పనికి ఆధారం...’ ఇలా సాగే ఓ సుదీర్ఘ సూక్తి జాతీయ బ్యాంకుల్లో మనకు ప్రముఖంగా కనిపిస్తుంది. మహాత్మా గాంధీ మొదలు ఇంగ్లిష్‌ వ్యాపారవేత్త ఎల్‌.ఎల్‌. బీన్‌ దాకా రకరకాల వ్యక్తుల పేర్ల మీద చలామణీ అయ్యే ఈ సూక్తిని ప్రచార పటాటోపానికి బ్యాంకుల్లో పెట్టడమేనా? లేక మన బ్యాంకింగ్‌ వ్యవస్థ నిజంగా కస్టమరే దేవుడని నమ్ముతోందా? అనేక సందర్భాల్లో బ్యాంకుల వ్యవహారశైలి మొదలు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ) ఉత్తర్వుల దాకా అన్నీ చూసినప్పుడు ఆ అనుమానం రాక మానదు. బ్యాంకు ఏటీఎం లావాదేవీల ఛార్జీలను పెంచడానికి సమాయత్తమవుతూ ఆర్బీఐ ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులు చూసినప్పుడు మళ్ళీ అదే అనుమానం కలుగుతుంది.

నెలవారీ ఉచిత లావాదేవీల పరిమితి ముగిశాక, చేసే ప్రతి లావాదేవీకీ చెల్లించాల్సిన ఛార్జీని రూ.20 నుంచి 21కి పెంచేందుకు ఆర్బీఐ వీలు కల్పించింది. అయిదు నెలల్లో వచ్చే జనవరి 1 నుంచి అమలులోకి వచ్చే అదనపు భారం బ్యాంకుల నుంచి కస్టమర్లకు దక్కే నూతన సంవత్సర కానుకన్న మాట. ఇక, ఒక బ్యాంకు మరో బ్యాంకుకు సేవలందించినందుకు గాను ఒక్కో లావాదేవీకి చెల్లించే ఇంటర్‌ ఛేంజ్‌ ఫీజును కూడా పెంచుకొనేందుకు ఆర్బీఐ కొత్త ఉత్తర్వు అనుమతించింది. ఈ ఇంటర్‌ ఛేంజ్‌ ఫీజు పెంపు ఈ ఆగస్టు 1 నుంచి అమలులోకి రానుంది. ఇది బ్యాంకుల మధ్య లావాదేవీల ఫీజుగా కనిపించినా, ఈ భారమూ చివరకు బడుగు వినియోగదారుడి మీదే పడుతుందనేది ఊహకు అందే విషయమే. ఛార్జీలు పెంచడానికి ఉత్సాహపడ్డ ఆర్బీఐ అదేమిటో కానీ, వినియోగదారులకు ఇచ్చే ఉచిత లావాదేవీల సంఖ్యను మాత్రం పెంచకపోవడం విషాదం.

నిజానికి, రెండేళ్ళ క్రితం 2019 జూన్‌లో ఆర్బీఐ ఓ కమిటీ వేసింది. ఏటీఎం ఛార్జీలు, ఫీజులకు సంబంధించి సమీక్ష కోసం వేసిన ఆ కమిటీకి ‘ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌’ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సారథి. ఆ కమిటీ సిఫార్సుల మేరకు ఇప్పుడీ కొత్త ఛార్జీలను ఆర్బీఐ ప్రవేశపెడుతోంది. బ్యాంకులు వాటిని అమలు చేయడమే మిగిలింది. ఈ పరిస్థితుల్లో మన దేశంలోని బ్యాంకుల ఏటీఎం వ్యవస్థను గమనిస్తే, ఎన్నో లోటుపాట్లు. ఈ ఏడాది మార్చి నాటికి దేశంలో అన్నీ కలిపి 2 లక్షల 13 వేల పైచిలుకు ఏటీఎంలున్నాయి. అలాగే, రకరకాల బ్యాంకుల వన్నీ కలిపితే దాదాపు 90 కోట్ల దాకా డెబిట్‌ కార్డులున్నాయి. నిరక్షరాస్యులకూ, టెక్నాలజీ ప్రావీణ్యం లేని గ్రామీణ ప్రాంతాల వారికీ, వీటి వల్ల ఎంత ప్రయోజనమన్నది వేరే చర్చ. అసలింతకీ దేశంలోని 130 కోట్ల పైగా జనాభాకూ, ఇన్ని కోట్ల డెబిట్‌ కార్డులకు ఈ ఏటిఎంలు ఏ పాటి? పైగా ఈ ఏటీఎంలలో సగానికి సగం పని చేయవన్నది కస్టమర్లకు నిత్యం అనుభవైకవేద్యం. పనిచేస్తున్న వాటిలోనూ నగదు అందుబాటులో ఉండేవి అంతంత మాత్రమే. కస్టమర్ల లావాదేవీ ఏ కారణం వల్ల మధ్యలో ఆగినా, ఆ సమస్యను తక్షణం పరిష్కరించే నాథుడూ ఉండరు. ఇలాంటి కథలు లాక్‌డౌన్‌ కాలంలో అనేకం. మరి, ఈ మాత్రపు ఏటీఎంలకే ఏర్పాటు, నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయంటూ ఛార్జీలను హెచ్చించాలనుకోవడం, వినియోగదారులపై మరింత భారం వేయాలనుకోవడం ఏమంత న్యాయం?

ఆ మాటకొస్తే ఫిక్సెడ్‌ డిపాజిట్ల కన్నా మామూలు సేవింగ్స్‌ ఖాతాలకు బ్యాంకులు తక్కువ వడ్డీ ఇచ్చేదే– ఎప్పుడు కావాలంటే అప్పుడు నగదు విత్‌డ్రా చేసే హక్కు కస్టమర్లకు కల్పిస్తున్నందుకు! కానీ, ‘ఏటీఎంలలో ఇన్ని లావాదేవీలే చేయాలి, ఎక్కువైతే ఫీజు చెల్లించాలి’ అనడం ఒక రకంగా కస్టమర్ల హక్కుకు భంగం కలిగించడమే! పైపెచ్చు తడవకు ఒకసారి ఏటీఎం ఛార్జీలు పెంచడమూ సరికాదు. కస్టమర్లు బ్యాంకులకొచ్చి నిల్చొని, నగదు తీసుకొనే కన్నా, ఏటీఎం వినియోగించడం వల్ల ఖర్చు, శ్రమ తగ్గుతాయి. నేరుగా బ్యాంకు బ్రాంచ్‌కి వచ్చే కన్నా ఏటీఎంల వాడకం వల్ల అందులో పదోవంతు ఖర్చుకే పని అయిపోతుందని కూడా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఏటీఎంల వాడకాన్ని ప్రోత్సహించాల్సిన వేళ, దాన్ని భారం చేయడం హేతుబద్ధంగా తోచదు. కాబట్టి, ఆర్బీఐ ఈ ఉత్తర్వులపై పునరాలోచన చేయడం మంచిది.

కరోనా కాలంలో అందరినీ డిజిటల్‌ చెల్లింపుల వైపు ప్రోత్సహిస్తున్నామంటున్న పాలకులు అందుకే ఈ పని చేపట్టారని అనుకోవడానికీ లేదు. డిజిటల్‌ ఇండియా దిశగా అడుగులు వేయడం మాటెలా ఉన్నా, కస్టమర్లు తమ డబ్బులు తాము బ్యాంకుల్లో నుంచి తీసుకోవాలన్నా కూడా మరింత ఫీజు బాదుడుతో వెంటపడడం సరైనది కాదు. దీనివల్ల చివరకు బ్యాంకులకే దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. కస్టమర్లు బ్యాంకులను వదిలేసి, మొబైల్‌ ఫోన్‌ ఆపరేటర్‌ ద్వారా పేమెంట్‌ బ్యాంక్‌ ఖాతా తెరుచుకొనే వీలుంది. బ్యాంకు ఖాతాలోని అధిక భాగం నగదును ఎయిర్‌టెల్, జియో పేమెంట్స్‌ బ్యాంక్‌ లాంటి పలు పేమెంట్‌ బ్యాంకులకు మార్చేసుకోవచ్చు. చిన్న కస్టమర్లకూ, వ్యాపారులకూ తమకు అనువుగా భావించే ఈ పేమెంట్‌ బ్యాంకుల వల్ల వాళ్ళకు మెరుగైన వడ్డీ వస్తుంది. ఎప్పుడు, ఎలా కావాలంటే అలా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇలాంటి పేమెంట్‌ బ్యాంకులు నడుపుతున్న ఫిన్‌టెక్‌ కంపెనీలకూ, మొబైల్‌ ఆపరేటర్లకూ వేలాది అవుట్‌లెట్లుంటాయి గనక కస్టమర్లకు నగదు లావాదేవీలు సులభం. వెరసి, బ్యాంకులకే నష్టం. దీంతో, కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలిక ఊడినట్టు మారితే, బ్యాంకులు తమను తాము తప్ప మరెవరినీ నిందించలేవు. తస్మాత్‌ జాగ్రత్త!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement