ఉప ఎన్నికల ఫలితాలు భవిష్యత్ రాజకీయ పరిణామాలను నిర్దేశిస్తాయా? అంటే, అవునని చెప్పడానికి లేదు. కాదనడానికీ వీల్లేదు! కొన్ని సంకేతాలను స్వీకరించడానికి, పరిస్థితుల్ని విశ్లేషించడానికి, కొంత అన్వయించడానికీ పనికొస్తాయనడంలో సందేహం లేదు. 13 రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను ఇలా చూడాల్సిందే తప్ప లోతుగా తడిమి.. ఇవే ప్రామాణికం, ఇలాగే జరగొచ్చు అని సిద్దాంతీకరించలేం! హిమాచల్‌ప్రదేశ్‌లో ఫలితాలు పాలకపక్షమైన బీజేపీకి, అస్సాం, పశ్చిమబెంగాల్ ఫలితాలు విపక్ష కాంగ్రెస్ ఆత్మపరిశీలనకు పని కొస్తాయి. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లోని ఒంటరి ఫలితాల్ని సాధారణీకరించలేం! స్థానికంగా నెలకొన్న రాజకీయ–సామాజిక పరిస్థితుల దృష్టి కోణం నుంచి విడిగా చూడటమే మంచిది. 29 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాల ఉపఎన్నికల మిశ్రమ ఫలితాలతో ప్రధాన పార్టీల్లో అంత ర్మథనం మొదలయింది. ఇతర పార్టీలు కూడా వారి స్థితిని గమనిస్తూ, తమ పరిస్థితిని అంచనా వేస్తున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల యాత్రలో తమ భవిష్యత్తు ప్రణాళికకు ఈ సంకేతాలు దోహదం చేయొచ్చన్నది యోచన. రెండేళ్లలో వచ్చే పలు శాసనసభల ఎన్నికలు, ఇతర ఉపఎన్నికల్లో వెల్లడయ్యే సంకేతాలు రాజకీయ వ్యూహ–ప్రతివ్యూహాలకు దోహదపడతాయి. దేశంలో బలమైన, ప్రతిపక్షంలేని పరిస్థితుల దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో గెలుపు నల్లేరుపై బండినడక అని బీజేపీ నిమ్మ ళంగా ఉండటానికి వీల్లేదని ఈ ఫలితాలు చెబుతున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో 3 అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకున్న విపక్ష కాంగ్రెస్‌కే ఈ ఫలితాలు ఒకింత విస్మయం కలిగించి ఉంటాయి. ప్రస్తుత పాలకులపై ప్రజలకు విశ్వాసం సడలినపుడు, దించి తీరాల్సిందే అని దృఢంగా వారు నిర్ణయించుకున్నపుడు... విపక్ష బలం, సామర్థ్యం లెక్కలోకే రాదని మరోమారు స్పష్టమైంది. అయిదేళ్లకోసారి ప్రత్యామ్నాయానికి పట్టంగట్టే కొండప్రాంత రాష్ట్రంగా హిమాచల్ రాజకీయ చరిత్ర మన కళ్లముందున్నా... బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వరాష్ట్రం, సీఎం జైరామ్ ఠాకూర్ సొంత నియోజకవర్గం ‘మండి’ లోక్‌సభ స్థానాన్ని పోగొట్టుకోవడం కలతకు కారణమే! అంతకంటే ముఖ్యంగా, అయిదారు మాసాల్లో ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రంలో ప్రత్యర్థి కాంగ్రెస్ 48.9 శాతం ఓట్లు సాధిస్తే, తాము 28.1 శాతానికి పడిపోవడం బీజేపీకి మింగుడుపడంది!
మిత్రులతో కలిసి ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ఎదురులేని శక్తిగా ఎదుగుతోందనడానికి అస్సాం, మెఘాలయ, మిజోరాం ఉపఫలితాలు సంకేతమే! పోటీ జరిగిన ఏడు స్థానాల్లో గెలిచారు. కానీ, కేంద్ర నాయకత్వమెంత పటిష్టంగా ఉన్నా.... స్థానిక నాయకత్వం బలంగా ఉండటం, లేకపోవడాన్ని బట్టే ఫలితాలుంటాయనేది బీజేపీ నేర్చుకోవాల్సిన కొత్తపాఠం! హిమంత బిశ్వశర్మ అస్సాంలో, శివ రాజ్‌సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌లో సాధించిన ఫలితాలు ఇతర సీఎంలు జైరామ్ ఠాకూర్ (హిమా చల్), బస్వరాజ్ బొమ్మై (కర్ణాటక) సాధించలేకపోవడాన్ని గుర్తెరగాలి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పాలక తృణమూల్ కాంగ్రెస్‌కు నువ్వా–నేనా అన్నంత పోటీ ఇచ్చిన పశ్చిమబెంగాల్‌లో అన్ని స్థానాల్లో ఓటమి, అంతకు మించి భారీ ఓట్ల వ్యత్యాసాలు కనువిప్పే! ‘హిందుత్వ’ బలంగా పనిచేసే హిందీ రాష్ట్రాల్లో నష్టపోయి, ఈశాన్య రాష్ట్రాల్లో మెరుగవడం లాభసాటి వ్యవహారమేం కాదు! ఈ గ్రహింపు వల్లేనేమో, ఈశాన్య భారతంతో పాటు పశ్చిమబెంగాల్, ఒడిశా, దక్షిణాది రాష్ట్రాలపైన బీజేపీ నాయకత్వం కేంద్రీకరిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైఎస్సార్‌సీపీ లాగా సానుకూల ఓటు సాధించగలిగితే గొప్పే! 2024 సాధారణ ఎన్నికల నాటికి, మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో ఉండే ఆ పార్టీ, ఎన్ని రాష్ట్రాల్లో సభాకాలం మూడు, నాలుగేళ్లు దాటుతోందో చూసుకొని జాగ్రత్త పడాలి. కేంద్ర– రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజా వ్యతిరేకత కలిస్తే అది మరింత ప్రమాదం. పాలనపై వ్యతిరేకత, నెరవేరని హామీలు, «నిత్యావసరాల ధరల అసాధారణ పెరుగు దల, నిరుద్యోగం, వ్యావసాయిక అశాంతి, కోవిడ్‌తో మందగించిన ఆర్థిక స్థితి... ఇవన్నీ ఓటర్లను ప్రభావితం చేశాయని, చేస్తాయనీ తాజా ఫలితాల నుంచి గ్రహించాలి.
దాదర్–నాగర్–హవేలీలో ఇంకా ఫలితం వెలువడక, తాము ఆధిక్యతలో ఉన్నపుడే, ‘2024 ఢిల్లీ పీఠానికి రహదారి ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి మొదలవుతోంది’ అన్న శివసేన వ్యాఖ్య కొంచెం అతిశయోక్తే! కాంగ్రెస్‌తో పాటు బీజేపీ కూటమికి చెందని ఇతర పక్షాలు ఒక నిజం గ్రహిం చాలి. తాము ఏకం కాకుండా బీజేపీని ఎదుర్కోవడం, వారి ఎన్నికల ఆధిపత్యాన్ని సవాల్ చేయడం దుస్సాధ్యమే! ప్రాంతీయ శక్తులున్న చోట కాంగ్రెస్ ఎంత బలహీనంగా ఉందో అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రుజువైంది. బీహార్‌లో కాంగ్రెస్ నాలుగో స్థానం ఆర్జేడీ చలువే! చిన్న భాగస్వామిగా తమతో కాంగ్రెస్ కలిసిరావాల్సిన విధిలేని పరిస్థితిని పాఠంగా నేర్పింది. ఆర్జేడీ–కాంగ్రెస్ కలిసి పోటీ చేసుంటే, జేడీ(యూ) అంత తేలిగ్గా రెండుచోట్ల నెగ్గేది కాదేమో? ఇక ప్రాంతీయ శక్తులేవీ బలంగాలేని రాజస్తాన్‌లో మూడు, నాలుగు స్థానాల్లోకి జార డంపై బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాహుల్ నాయకత్వ సామర్థ్యం, శరద్‌పవార్–మమత– మాయావతి వంటి నేతల ఆధిపత్యవాదాలు తమకు అయాచిత వరాలని బీజేపీ భావించొచ్చు! వారంతా స్పర్థలు వీడి, బలమైన ఐక్యకూటమిగా ఏర్పడితే ఫలితాలు భిన్నంగానూ ఉండొచ్చు! విభిన్న పార్శా్వలను తడిమే చర్చకు ఈ ఉపఫలితాలు తెరలేపాయి!
ఫలితాలు అందరికీ పాఠాలే!
Published Sat, Nov 6 2021 12:44 AM | Last Updated on Sat, Nov 6 2021 12:48 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment