పెట్రోల్... డీజిల్... పాలకుల పుణ్యమా అని సెంచరీ దాటేసిన వీటి రిటైల్ రేట్లపై చర్చ ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. అక్టోబర్ 30న వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలలో వీచిన ఎదురుగాలి ఫలితమో ఏమో బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పెట్రో రేట్లను రవ్వంత తగ్గించాల్సి వచ్చింది. దీపావళి కానుకగా వచ్చిన ఆ ఊరడింపు ప్రకటనతో ఇప్పుడు రాష్ట్రాలూ తమ వంతు పన్నులను తగ్గించాలన్నది డిమాండ్ పైకొచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు రానున్న పంజాబ్, ఉత్తరప్రదేశ్, గోవా సహా పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు సహజంగానే తమ వంతుగా వ్యాట్‌ను కొంత తగ్గించాయి. కానీ, ఇప్పటికే కేంద్రం నుంచి నిధుల విషయంలో ఇబ్బందులు పడుతున్నామని భావిస్తున్న ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఈ కరోనా వేళ అందుకు నిరాకరించాయి. కేంద్రమే మరింత తగ్గించాలన్నాయి. కేంద్రం ఇష్టానికి పెంచుకుంటూ పోయిన రేట్లు ఇప్పుడు రాజకీయ అవసరాల క్రీడగా మారడమే విచారకరం.
ప్రాథమిక చమురు ధరకు కేంద్ర ఎక్సైజ్ సుంకం, డీలర్ కమిషన్, వ్యాట్‌ను కలిపితే వచ్చేది – పెట్రోల్ బంకుల్లో అమ్మే రిటైల్ ధర. అంతర్జాతీయ ముడి చమురు ధరలను బట్టి దేశీయంగా పెట్రోల్ రిటైల్ రేటు పెరగడం అర్థం చేసుకోవచ్చు. కానీ, అంతర్జాతీయ మార్పులతో సంబంధం లేకుండా, ఇక్కడ పాలకులు ఎప్పటికప్పుడు అధిక సుంకాలు విధించుకుంటూ పోవడం సరైనది కాదు. గత ఏడాది క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోయినా సరే కేంద్రం లీటరు పెట్రోలుపై రూ. 13, డీజిల్‌పై రూ. 16 వంతున ఎక్సైజ్ బాదుడు బాదింది. కరోనా ముందునాళ్ళతో పోలిస్తే, ఇప్పుడు పెట్రో రేట్లు కొండెక్కి కూర్చోవడానికి అలాంటి నిర్ణయాలే కారణం. అలా ధరలను కొండంత పెంచిన కేంద్రం ఏ ప్రయోజనాల కోసమైతేనేం ఇప్పుడు ఎక్సైజ్ సుంకాన్ని గోరంత తగ్గించింది. పెట్రోలుపై రూ. 5, డీజిల్‌పై రూ. 10 మేరకైనా కేంద్రం తగ్గింపునివ్వడం ఆహ్వానించ దగినదే. అయితే, దాని వల్ల లభించిన ఊరట స్వల్పమే.
పెట్రోలియమ్ ప్లానింగ్ అండ్ ఎనాలసిస్ సెల్ డేటా ప్రకారం పెట్రోలియమ్ రంగంపై వివిధ రకాల పన్నుల ద్వారా కేంద్రానికి 2014–15లో రూ. 1.72 లక్షల కోట్లు వస్తే, ఇప్పుడది ఏకంగా రూ. 3.35 లక్షల కోట్లకు చేరింది. అందులో రాష్ట్రాలకు దక్కేది రూ. 19,475 కోట్లే. అంటే, 5.8 శాతమే. ఒకవైపున అంతర్జాతీయ సగటు క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా తగ్గినా సరే, సామాన్యుడు కొనే పెట్రోల్, డీజిల్ రేట్లు చుక్కలనంటాయి. 2019 మేలో లీటరు పెట్రోల్ రూ. 76.89, డీజిల్ రూ. 71.50 ఉండేవి. పాలకుల పుణ్యమా అని రెండున్నరేళ్ళలో ఈ ఏడాది నవంబర్ 1 నాటికి పెట్రోల్ రూ. 115.99, డిజీల్ రూ. 108.66కు సర్రున పెరిగాయి. ఇది కళ్ళెదుటి నిజం.
గడచిన రెండేళ్ళలో పెట్రోలు, డీజిల్ రేట్లపై విధించే ఎక్సైజ్ సుంకం రూపురేఖలనే కేంద్ర సర్కారు మార్చేసింది. నిజానికి, ఇంధనంపై కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 41 శాతం వాటాను రాష్ట్రాలకు పంచవలసి ఉంటుంది. కానీ, కేంద్రం తెలివిగా పెరిగిన పెట్రో ఆదాయం డివిజబుల్ పూల్‌లోకి రాకుండా, సెస్‌లు, సర్‌ఛార్జీల రూపంలోనే రూ. 2,87,500 కోట్లు వసూలు చేసింది. అలా వచ్చినదాన్ని రాష్ట్రాలకు ఇచ్చే పని లేకుండా, తన దగ్గరే ఉండిపోయేలా కేంద్రం ఎత్తు వేసింది. న్యాయబద్ధంగా తమకు రావాల్సిన వాటాకు కేంద్రం ఇలా గండి కొట్టడంతో, రాష్ట్రాలు గతంలో సాక్షాత్తూ 15వ ఆర్థిక సంఘానికి ఫిర్యాదు కూడా చేశాయి.
యథేచ్ఛగా సెస్ పెంచిన కేంద్రం తీరా ఇప్పుడు రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలనే వాదనను స్వపక్షీయుల నోట అనిపిస్తోంది. అసలే కరోనా దెబ్బతో ఆదాయాలు పోయి, దేశవ్యాప్తంగా రాష్ట్రాలన్నీ కునారిల్లాయి. ఈ పరిస్థితుల్లో పెట్రోల్ రేట్లలోనూ రాష్ట్రాలే తగ్గింపు ఇవ్వాలని కోరితే, రాష్ట్రాలు మాత్రం ఎక్కడకు పోతాయి? ఏం చేస్తాయి? ఆ మాటకొస్తే ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను, కేంద్ర జీఎస్టీల వల్ల వచ్చే ఆదాయం కన్నా చమురుపై ఎక్సైజ్ సుంకంతో కేంద్రానికి వచ్చేది తక్కువ. కానీ, ప్రభుత్వం నడపడానికి ఈ చమురుపై వచ్చే ఆదాయమే అత్యంత కీలకమన్నట్టు కేంద్ర పాలకులు మాట్లాడడం ఎంతవరకు అర్థవంతం?
ఏమైనా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా పన్నులను సమర్థించుకోవడం వల్ల అంతిమ భారం వినియోగదారుడి మీదే పడుతోంది. దేశంలో అమ్ముడయ్యే ప్రైవేట్ ప్యాసింజర్ వాహనాల్లో నూటికి 80కి పైగా ప్రారంభ స్థాయి ద్విచక్ర వాహనాలే. పెట్రో ధరలపై కేంద్రం అనుసరిస్తున్న ప్రస్తుత విధానాలతో ఏకంగా ఈ సామాన్యుల ఇంటి బడ్జెట్లే తలకిందులు అవుతున్నాయి. అంటే, అటు ఆర్థికవ్యవస్థ పరంగా కానీ, ఇటు ప్రజా సంక్షేమ రీత్యా కానీ పెట్రోల్‌పై కేంద్ర సర్కారు వారి పన్ను విధానం లోపాలపుట్టే. ఇకనైనా, పెట్రో రేట్ల వ్యవహారాన్ని రాజకీయ విన్యాసంగా మార్చకుండా, పాలకులు సరైన నిర్ణయం తీసుకోవాలి. రాబడిలో న్యాయమైన వాటాపై కేంద్రం, రాష్ట్రాలు ఒక అంగీకారానికి వచ్చి, పెట్రోల్‌పై అధిక పన్నులు తగ్గించాలి. సామాన్యులకు మేలు చేయాలి.
పెట్రో రంగంపై బాదుడుతో ఆదాయాన్ని పెంచుకొనే ప్రయాస మానేసి, దశాబ్దకాలంగా పడిపోతున్న ప్రత్యక్ష పన్నుల ఆదాయాన్ని పెంచుకోవడంపై కేంద్రం దృష్టి పెట్టడం అత్యవసరం. మరోపక్క జీఎస్టీ మెరుగ్గా అమలయ్యేలా, మరింత ఆదాయం వచ్చేలా చూసుకోవాలి. ఇలాంటి అసలైన ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తేనే, ఈ పెట్రో మంటలు తగ్గుతాయి. అలా కాకుండా, తామే ధరలు పెంచేసి, ఆ పైన పదో, పరకో తగ్గించాం లెమ్మంటే అది అక్షరాలా పిర్ర గిల్లి జోల పాడడమే!
రాజకీయ ఇంధనం!
Published Tue, Nov 9 2021 2:34 AM | Last Updated on Tue, Nov 9 2021 2:36 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment