అఫ్ఘానిస్తాన్‌లో రెండు దశాబ్దాలుగా సాగిస్తున్న ‘ఖరీదైన’ యుద్ధానికి ముగింపు పలకాలని నిర్ణయిం చినట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎట్టకేలకు అధికారికంగా ప్రకటించారు. వచ్చే నెల 1తో మొదలుపెట్టి సెప్టెంబర్ 11 కల్లా అక్కడున్న తమ 2,500 మంది సైనికులనూ ఉపసంహరించుకుం టామని ఆయన చేసిన ప్రకటన అమెరికా మూటగట్టుకున్న అతి పెద్ద వైఫల్యంగా చరిత్రలో నమోదవుతుంది. 2,448 మంది సైనికులను పోగొట్టుకొని, 2 లక్షల కోట్ల డాలర్ల వ్యయం చేసి అది అక్కడ మిగిల్చిందల్లా శిథిలప్రాయమైన దేశాన్ని. అణ్వస్త్రం తప్ప తన అమ్ములపొదిలో వున్న సమస్త ఆయుధాలనూ అమెరికా అక్కడ కుమ్మరించింది. క్షిపణి దాడులతో అఫ్ఘాన్ చిగురుటాకులా వణికింది. నలుగురు గుమిగూడితే వాళ్లను ఉగ్రవాదులుగా భావించి వైమానిక దాడుల్లో హత మార్చడం చాలా సందర్భాల్లో జరిగింది. ఈ పాపాలకు సంబంధించి జూలియన్ అసాంజ్ బయట పెట్టిన ఎన్నో పత్రాలు, వీడియోలు ప్రపంచాన్ని దిగ్భ్రాంతిలో పడేశాయి. ఉగ్రవాదుల మాటేమో గానీ... వేలమంది సాధారణ పౌరులు మరణించారు. ఫలితంగ్లా అక్కడ ఉగ్రవాదం మరింత ముదిరింది. అయినా తాజా ప్రకటనలో బైడెన్ స్వోత్కర్ష మానుకోలేదు. ‘స్పష్టమైన లక్ష్యాలతో అక్కడికెళ్లాం... వాటిని సాధించాం’ అని ఆయన చెప్పుకున్నారు. భూగోళంలో ఏమూలనవున్నా ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని ప్రతినబూని 2001 లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ అఫ్ఘాన్‌కు పంపిన అమెరికన్ సైనికుల సంఖ్య లక్షకు పైమాటే. వీరికి నాటో కూటమి దేశాల సైనికులు అదనం. ఇప్పుడు అమెరికా సైనికులతోపాటు ఆ కూటమికి చెందిన 7,000మంది సైనికులు కూడా నిష్క్రమిస్తారు. ఏ దేశమైనా మరో దేశాన్ని దురాక్రమించటం, పెత్తనం సాగించటం, అక్కడి పౌరుల జీవితాన్ని అల్లకల్లోలం చేయటం అనాగరికం. రిపబ్లికన్ల ఏలుబడి ముగిసి ఒబామా నాయకత్వంలో డెమొక్రాటిక్ పార్టీ ప్రభుత్వం వచ్చాక అమెరికాకు జ్ఞానోదయమైంది. 2014నాటికల్లా అమెరికా దళాలు అక్కడినుంచి వైదొలగుతాయని ఒబామా అప్పట్లో చెప్పారు. కానీ అదేమీ జరగలేదు. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా డోనాల్డ్ ట్రంప్ దీనిపై విశేషంగా ప్రచారం చేశారు. తాను వచ్చిన వెంటనే దళాలన్నీ వెనక్కి రప్పిస్తామని ప్రకటించారు. కానీ అదేమీ జరగలేదు. ఆ దిశగా మాత్రం ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. పాకిస్తాన్ ప్రాపకంతో తాలిబన్‌లతో చర్చోపచర్చలు జరిపి మొత్తానికి ఈ ఏడాది మే 1నుంచి మొదలుపెట్టి దశలవారీగా సైనిక దళాలను వెనక్కి తీసు కొస్తామని మొన్న అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ప్రకటించారు. కొత్తగా వచ్చిన అధ్యక్షుడు ఈ విష యంలో ఏ నిర్ణయం తీసుకుంటారోనని ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసింది. చివరకు బైడెన్ తాలి బన్‌లకు ట్రంప్ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చదల్చుకున్నట్టు ప్రకటించారు.
బైడెన్ చెప్పినట్టు అమెరికా లక్ష్యాల్లో ఒకటైతే నెరవేరింది. 2001 సెప్టెంబర్‌లో అమెరికాలో విమానాలను దారి మళ్లించి నరమేథానికి కారణమైన అల్ కాయిదా నేత ఒసామా బిన్ లాడెన్‌ను ఆ దేశం హతమార్చగలిగింది. అలాగే అల్ కాయిదా సంస్థను కూడా చిన్నాభిన్నం చేయటంలో విజయం సాధించింది. కానీ ఆ సంస్థకు మించిన భయంకరమైన ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాద సంస్థ ఆవిర్భవించింది. అనేకానేక ముఠాలుగా విడిపోయిన ఉగ్రవాదులు దేశవ్యాప్తంగా ఆధిపత్యం కోసం సాగించిన హింసాకాండ అంతా ఇంతా కాదు. మహిళలదైతే దుర్భరమైన స్థితి. అఫ్ఘాన్‌లో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పామని, మహిళల హక్కులకు రక్షణ ఏర్పడిందని అమెరికా చెప్పుకుం టోంది. కానీ అవన్నీ కాబూల్ వంటి కొన్నిచోట్లకే పరిమితం. పేరుకు ప్రభుత్వమంటూ వున్నా దాని ఏలుబడిలో వున్న ప్రాంతం అతి తక్కువ. ఉగ్రవాద ముఠాల్లో తాలిబన్‌లది ప్రస్తుతానికి పైచేయి. వారి మాటే శాసనం. గత కొన్నేళ్లుగా గ్రీన్‌జోన్ పేరిట పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసుకుని అమెరికా, నాటో దళాలు దానికే పరిమితమవుతుండగా, వారి దగ్గర శిక్షణ పొందిన అఫ్ఘాన్ పోలీ సులు, సైనికులు శాంతిభద్రతలు చూస్తున్నారు. గ్రీన్‌జోన్‌పై సైతం పలుమార్లు దాడులు జరిగా యంటే అఫ్ఘాన్ పోలీసులు, సైనికుల దుస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అన్ని విధాలా భంగపడ్డ అమెరికా తమ గడ్డపై ఉగ్రవాదులు బీభత్సం సృష్టించిన రోజైన సెప్టెంబర్ 11నాడే అక్కడినుంచి పూర్తిగా వైదొలుగుతామని అంటున్నది.
ఏదో ఒక సాకుతో దేశాలను దురాక్రమించటం నేరమే. ఆ కోణంలో అమెరికా దళాల ఉప సంహరణ సరైందే కూడా. అలాగని అమెరికా దళాల ఉపసంహరణకు పరిస్థితులు పరిపక్వమయ్యాయని బైడెన్ చేస్తున్న వాదనతో ఎవరూ ఏకీభవించలేరు. దాన్ని తనకూ, తాలిబన్‌లకూ మధ్య నడిచే లడాయిగా పరిగణించకుండా ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ వేదిక సారథ్యంలో ఒక సామరస్యపూర్వకమైన పరిష్కారానికి ప్రయత్నించి వైదొలగివుంటే అది ఆ దేశ పౌరులకు మాత్రమే కాదు... భారత్‌తోసహా ఈ ప్రాంత దేశాలన్నిటికీ ఉపయోగకరంగా వుండేది. ఒకసారంటూ అమె రికా దళాలు వైదొలగి, తాలిబన్‌ల ఏలుబడి మొదలైతే ఎలాంటి అరాచకాలు తలెత్తుతాయోనన్న భయాందోళనలు ఆ దేశంలోని మైనారిటీలకూ, మహిళలకూ, ఇరుగుపొరుగు దేశాలకూ వుంది. వారి రాకను ఆహ్వానిస్తున్నది ఒక్క పాకిస్తాన్ మాత్రమే. భారత్‌కు తాలిబన్‌లతో చాలా చేదు అనుభవా లున్నాయి. అన్నిటినీ బేఖాతరుచేసి, ఇప్పటికీ హింసను విడనాడని తాలిబన్‌ల దయాదాక్షిణ్యాలకు వదిలేయడం అమెరికా బాధ్యతారాహిత్యానికి చిహ్నం.
అఫ్ఘాన్‌కు అమెరికా గుడ్‌బై
Published Fri, Apr 16 2021 12:56 AM | Last Updated on Fri, Apr 16 2021 4:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment