అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధికార పగ్గాలు చేపట్టిన కొద్దికాలంలోనే దక్షిణాసియాపై దృష్టి పెట్టారు. అధీన రేఖ ప్రశాంతంగా వుండటానికి భారత్–పాకిస్తాన్‌లు మిలిటరీ డైరెక్టర్ జనరల్స్ స్థాయిలో అవగాహన కుదుర్చుకోవటం వెనకున్న కారణం అదేనని విశ్లేషకులు అంచనా వేస్తుండగానే ఇప్పుడు అఫ్ఘానిస్తాన్ వ్యవహారంలో కదలిక మొదలైంది. వాస్తవానికి డోనాల్డ్ ట్రంప్ వున్నప్పుడే అఫ్ఘాన్ విషయంలో గట్టి ప్రయత్నాలకు బీజం పడింది. ఆ దేశం నుంచి అమెరికా సేనల్ని వెనక్కు తీసుకొస్తానని 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆయన వాగ్దానం చేశారు. ఆ ప్రకారమే పావులు కదిపారు. పాకిస్తాన్ సాయంతో ఉగ్రవాద సంస్థ తాలిబన్ ప్రతినిధులను చర్చల వరకూ తీసుకు రాగలిగారు. 2021 మే 1 కల్లా ఆ దేశం నుంచి అమెరికా సేనల్ని వెనక్కు రప్పిస్తామంటూ ఒక గడువు కూడా పెట్టుకున్నారు. ప్రపంచంలో ఎక్కడున్న ఉగ్రవాదంపై యుద్ధం చేస్తామని, దాన్ని తుద ముట్టిస్తామని చెప్పి అఫ్ఘాన్‌లో అమెరికా, దాని మిత్రదేశాల దళాలు ప్రవేశించి రెండు దశాబ్దాల వుతోంది. కానీ పరిస్థితులు అనుకూలంగా లేవని అర్థమయ్యాక యుద్ధం మాట అటుంచి ఆత్మ రక్షణే అక్కడున్న ఆ దళాలకు ప్రధాన అవసరంగా మారింది. వేరే దేశాల పరిరక్షణ బాధ్యతలు తీసు కోవటం వల్ల అమెరికా ఖజానా గుల్లవుతోందని, అటు సైనిక దళాలకూ నష్టం వాటిల్లుతున్నదని ట్రంప్ భావించటమే వెనక్కి రప్పించాలన్న నిర్ణయానికి కారణం.
దారీ తెన్నూ లేకుండా పోతున్న సంక్షుభిత దేశంలో శాంతి నెలకొనాలని వాంఛించటం హర్షించదగ్గదే. కానీ అందుకోసం చేసే ప్రయత్నాలు ఆ సమస్యతో సంబంధం వున్న అన్ని పక్షాలకూ ఆమోదయోగ్యంగా వుండాలి. అవి మరో పెద్ద ఉపద్రవానికి దారితీయని విధంగా వుండాలి. ఆ కోణంలో చూస్తే ట్రంప్ వైఖరికీ, బైడెన్ వైఖరికీ మధ్య వ్యత్యాసం వుంది. అఫ్ఘాన్ విషయంలో ఒక్క పాకిస్తాన్‌తో తప్ప ట్రంప్ ఎవరితోనూ సక్రమంగా చర్చించలేదు. రష్యాను భాగస్వామిని చేశారు తప్ప, అఫ్ఘాన్‌లో అనేక అభివృద్ధి ప్రాజెక్టుల్లో తలమునకలైవున్న మన దేశాన్ని విశ్వాసంలోకి తీసుకోలేదు. చివరకు 2018లో రష్యాలో జరిగిన అఫ్ఘాన్ సదస్సుకు హాజరయ్యేలా మన దేశాన్ని ఒప్పించారు. నిరుడు ఫిబ్రవరిలో అప్పటి అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో సమక్షంలో ఖతార్‌లోని దోహాలో శాంతి ఒప్పందంపై సంతకాలయ్యాయి. నాలుగు నెలల్లో అమెరికా తన సేనల్ని తగ్గించుకోవాలని అందులో నిర్ణయించారు. ఆలోగా 5,000 మంది తాలిబన్ ఖైదీలను అఫ్ఘాన్ ప్రభుత్వం విడుదల చేస్తే... తమ అధీనంలోని వేయిమంది అఫ్ఘాన్ భద్రతా దళాల సభ్యుల్ని తాలి బన్‌లు విడిచిపెట్టడానికీ అందులో అవగాహన కుదిరింది. అలాగే ఉగ్రవాద సంస్థ అల్–కాయిదాతో తెగదెంపులు చేసుకోవటంతోపాటు ఐఎస్ ఉగ్రవాదుల్ని ఏరిపారేసేందుకు తాలిబన్‌లు సంసిద్ధత వ్యక్తం చేశారు. కానీ పట్టుమని పక్షం రోజులు గడవకుండానే తాలిబన్‌లు ఆ ఒప్పందాన్ని ఉల్లం ఘించారు. అడపా దడపా బాంబులతో మోతెక్కించారు. ఒప్పందం ప్రకారం అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తాలిబన్ ఖైదీలను విడుదల చేయకపోవటమే అందుకు కారణం. చివరకు అమెరికా జోక్యంతో ఘనీ దారికొచ్చారు. ఆ తర్వాతైనా తాలిబన్‌లు పూర్తిగా హింసకు స్వస్తి చెప్పింది లేదు. అటు తర్వాత అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హడావుడి, ఇతర పరిణామాల కారణంగా ఆ ఒప్పందం విషయంలో కదలిక లేదు. ఇప్పుడు బైడెన్ ఇందుకు భిన్నమైన పంథా అవలంబిస్తున్నారు. భారత్‌తోపాటు రష్యా, చైనా, పాకిస్తాన్, ఇరాన్ విదేశాంగమంత్రులతో, ఆ దేశాల రాయబారులతో సమావేశం నిర్వహించి అఫ్ఘాన్‌లో శాంతి ఏర్పడేందుకు సమగ్రమైన ప్రయత్నం చేయాలని ఐక్య రాజ్యసమితికి సూచించారు. అలాగే అఫ్ఘాన్ సర్కారు, తాలిబన్‌ల మధ్య సమావేశం ఏర్పాటుచేసి శాంతి ఒప్పందానికి తుది మెరుగులు దిద్దే బాధ్యతను టర్కీకి అప్పజెప్పారు. తాలిబన్‌లతో నేరుగా చర్చించకూడదన్న గత వైఖరిని మన దేశం సడలించుకుంది. ఈ ప్రాంత పరిణామాల్లో మన ప్రమేయాన్ని పెంచుకోవటమే సరైందని భావించటం మంచిదే. అదే సమయంలో ఉగ్రవాదం విషయంలో స్పష్టమైన హామీ లేకుండా పాకిస్తాన్‌తో చర్చించరాదన్న పట్టుదలను కూడా సడ లించుకోబట్టే అధీన రేఖ వద్ద కాల్పుల విరమణపై ఆ దేశంతో ఇటీవల డీజీఎంఓల స్థాయిలో అవగాహన కుదిరింది.
అఫ్ఘాన్‌లో శాంతి కోసం ఒక్క అమెరికా మాత్రమే కాదు... రష్యా, చైనా కూడా తెగ తాపత్ర యపడుతున్నాయి. దీని వెనక వాటి ప్రయోజనాలు వాటికున్నాయి. అక్కడి భూగర్భంలోని ఖనిజ సంపద విలువ లక్ష కోట్ల డాలర్ల పైమాటేనని దశాబ్దంక్రితమే వెల్లడైంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్‌లకూ, ల్యాప్‌టాప్‌లకూ, ఎలక్ట్రిక్ కార్లకూ తోడ్పడే బ్యాటరీల్లో కీలకపాత్ర పోషించే లిథియం నిక్షేపాలు అక్కడ అపారంగా వున్నాయి. తాలిబన్‌లు రంగంలోకొస్తే ఆ విషయంలో అమెరికా, రష్యా, చైనాలకు ఏమేరకు ప్రయోజనం కలుగుతుందన్న సంగతలావుంచితే... మన భద్రత, ఇతర ప్రయో జనాల పరిరక్షణ విషయంలో మన దేశం స్పష్టంగా వుండాలి. మనం కోరుకుంటున్నదేమిటో, ఇన్నాళ్లుగా జరిగిన పరిణామాల్లో మనకు అసంతృప్తి కలిగించినవేమిటో అమెరికాకు తేటతెల్లం చేసి తగిన హామీలు పొందాలి. అంతా అయిందనుకున్నాక అనిశ్చితి యధాప్రకారం కొనసాగితే, తాలి బన్‌లు గతం మాదిరే వ్యవహరిస్తే, పాకిస్తాన్ వారికి లోపాయికారీగా మద్దతిస్తే రెండు దశాబ్దాలనాటి అనుభవాలే పునరావృతమయ్యే ప్రమాదం వుంది.
అఫ్ఘాన్‌పై కొత్త అడుగులు
Published Thu, Mar 11 2021 12:56 AM | Last Updated on Thu, Mar 11 2021 2:59 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment