‘అరణ్య’ రోదన! | Sakshi Editorial On ISFR Report Reveals Massive Forest Cover Loss In India | Sakshi
Sakshi News home page

‘అరణ్య’ రోదన!

Published Thu, Jan 20 2022 12:15 AM | Last Updated on Thu, Jan 20 2022 12:17 AM

Sakshi Editorial On ISFR Report Reveals Massive Forest Cover Loss In India

వృక్ష భక్షణ, వన సంహారం గురించే ఎక్కువగా వినబడే దేశంలో అటవీ ఆచ్ఛాదన పెరిగిందనే కబురు ఊరటనిస్తుంది. గత రెండేళ్లలో 1,540 చదరపు కిలోమీటర్ల మేర అడవులు విస్తరించాయని తాజా నివేదిక చెబుతోంది. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ ఈమధ్య విడుదల చేసిన భారత అటవీ స్థితిగతుల నివేదిక(ఐఎస్‌ఎఫ్‌ఆర్‌) ఎంతో ఆశావహమైన చిత్రాన్ని పరిచింది. మనిషికీ, మొక్కకూ ఉండేది పేగు బంధం లాంటిది. మరణించేవరకూ అనుక్షణం మనిషి సుఖసంతోషాలతో ముడిపడి, ఎడతెగని బంధంగా నిలిచేది ప్రకృతే. ఆ సత్యాన్ని గ్రహించకుండా ఎడాపెడా అడవులు నరకడమంటే పుడమి తల్లికి కడుపు కోతను మిగల్చడమే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, జార్ఖండ్‌ రాష్ట్రాలు జాతీయ స్థాయిలో అడవుల విస్తరణకు ఈసారి ప్రధాన కారణమయ్యాయి. ఇందులో 647 చదరపు కిలోమీటర్ల పెరుగుదలతో ఆంధ్రప్రదేశ్‌ అగ్ర భాగాన ఉండగా తెలంగాణ(632 చదరపు కిలోమీటర్లు), ఒడిశా(537 చదరపు కిలోమీటర్లు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 1987తో మొదలుపెట్టి ప్రతి రెండేళ్లకూ మన దేశం అటవీ భూముల సర్వే గణాంకాలను వెల్లడిస్తోంది. ఆ వరసలో ఇది 17వ నివేదిక. పౌరుల్లో పర్యావరణ చైతన్యాన్ని పెంచడానికి ఈ నివేదికలు అవసరం. 

దేశంలో కనీసం 33 శాతం భూభాగం అడవులతో నిండి ఉంటేనే పర్యావరణ సమతూకం సరిపోతుందని ఏడు దశాబ్దాలనాటి తొలి జాతీయ అటవీ విధానం లెక్కలేసింది. ఆ తర్వాతి  కాలంలో పర్యావరణ చైతన్యం వెల్లివిరిసింది. 1988లో మలి జాతీయ అటవీ విధానాన్ని ప్రకటించేనాటికి భూగోళం సురక్షితంగా ఉండటానికి అటవీ సంరక్షణ అత్యంత కీలకమైనదన్న అవగాహన ఏర్పడింది. కానీ అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఉదారవాద విధానాల వల్ల నానాటికీ అడవులు తరిగిపోతున్న సంగతి చేదు నిజం. ఈ పరిస్థితిలో అడవుల విస్తీర్ణం పెరిగిందన్నది చల్లని కబురుకిందే లెక్క. కానీ తరచి చూస్తే వెల్లడవుతున్న వాస్తవాలు వేరు. పెరిగిన హరిత ఆచ్ఛాదనకన్నా దట్టమైన అరణ్యాలకు కలిగిన నష్టాలే అధికమని తాజా నివేదిక వెల్లడిస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో గత రెండేళ్లలో 1,643 చదరపు కిలోమీటర్ల దట్టమైన అడవులు నాశనమయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నష్టాన్ని పూడ్చడానికి మూడో వంతు ప్రాంతంలో... అంటే 549 చదరపు కిలోమీటర్ల అటవీయేతర భూముల్లో త్వరితగతిన పెరిగే మొక్కలు నాటామని చెబు తున్నారు. అయితే సహజసిద్ధంగా పెరిగే అరణ్యాలతో ఇవి సాటిరాలేవు. పర్యావరణానికి వీటివల్ల కలిగే మేలు తక్కువ. ఈ సంగతిని ఏడేళ్లక్రితమే ఫ్రెండ్స్‌ ఆఫ్‌ ది ఎర్త్‌ సంస్థ ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏఓ) దృష్టికి తీసుకొచ్చింది. అడవి నిర్వచనాన్ని మార్చాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది. ఆ నిర్వచనం అడవులతో పెనవేసుకుని ఉండే మొత్తం సాంస్కృతిక సంపదను ప్రతి ఫలించాలని సూచించింది. ఒకే రకమైన మొక్కలు పెంచుతూ, ఆ ప్రాంతాన్ని అడవిగా భావించ మనడం సరికాదని తెలిపింది. అడవి అంటే అందులో సహజసిద్ధంగా పెరిగే వైవిధ్యభరిత వృక్ష జాతులు, అక్కడ స్వేచ్ఛగా సంచరించే సమస్త జంతుజాలం... అన్నిటికీ మించి అడవిని అమ్మగా భావించుకుని, దాని ఆలంబనతో జీవనం సాగిస్తున్న ఆదివాసీలు. ఇంకా అక్కడి భూముల్లో సహజసిద్ధంగా ఏర్పడే వాగులు, వంకలు... అక్కడి నేలలో నిక్షిప్తమై ఉండే భూగర్భ జలాలు తదిత రాలు. ఆదివాసీలకు అక్కడుండే చెట్లపై సంపూర్ణ అవగాహన ఉంటుంది. అవి ఇచ్చే పండ్లు, ఫలాల గురించి, వాటిలోని ఔషధ గుణాల గురించి పరిజ్ఞానం ఉంటుంది. ఏదో ప్రాజెక్టు కోసం అడవిని సంహరించి, వాటి స్థానంలో మొక్కలు పెంచితే ఇవన్నీ తిరిగి యధాతథంగా వచ్చి చేరతాయా? ఆదివాసీల జీవితాలు మళ్లీ చిగురిస్తాయా? ప్రభుత్వాలు నిజాయితీగా ఆలోచించాలి. 

ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్‌ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, మిజోరం, మేఘాలయ, సిక్కింలలో 1,020 చదరపు కిలోమీటర్ల నిడివిలోని అడవి ఈ రెండేళ్లలో కనుమ రుగైందని విన్నప్పుడు మనసు చివుక్కుమంటుంది. దేశ అటవీ విస్తీర్ణంలో ఈశాన్య రాష్ట్రాల వాటా 23.75 శాతం. వాస్తవానికి ఈ రాష్ట్రాల్లో దట్టమైన అరణ్యాలున్నాయి. అద్భుతమైన జీవ వైవిధ్యతకు ఇది పుట్టిల్లు. కనుక ఇక్కడి అడవులు తరిగిపోతున్నాయంటే పర్యావరణవేత్తలు ఆందోళనపడతారు. అప్పుడప్పుడు ప్రకృతి వైపరీత్యాలు కూడా అడవులకు శాపంగా మారుతున్నాయన్నది వాస్తవమే. కానీ మనిషి చేసే అపచారం కూడా ఉంది. కారణాలేమైనా అడవులు తరుగుతుంటే ఆ ప్రాంతంలోని కొండచరియలు విరిగి పడతాయి. నీటి వనరుల లభ్యత తగ్గుతుంది. ఈసారి నివేదిక విశిష్టతే మంటే... ఇందులో పులులు, సింహాలు ఉండే అభయారణ్యాల స్థితిగతులేమిటో చెప్పడం. 2030 నాటికి భూతాపం పెరగడం వల్ల అడవులపై దాని ప్రభావం గణనీయంగా పడవచ్చునని నివేదిక అంచనా వేస్తోంది. వీటన్నిటి సంగతలా ఉంచి అడవుల విస్తీర్ణత కొలిచేటపుడు కాఫీ ప్లాంటేషన్లు, కొబ్బరి, మామిడి, ఇతర ఫలసాయాన్ని అందించే తోటలు వగైరాలను అడవులుగా లెక్కేసే తీరు మారాలి. వందలాది రకాల వృక్షజాతులతో సహజసిద్ధంగా ఏర్పడే అరణ్యాలనూ, ఒకే రకం చెట్లతో నిండివుండే పండ్ల తోటలనూ సమానంగా పరిగణించడం వల్ల దేశంలో అడవులు పెరిగాయన్న అభిప్రాయం కలిగించవచ్చు. కానీ అది లక్ష్యసాధనకు ఏమాత్రం తోడ్పడదు. అందువల్ల పర్యా వరణానికి కలిగే ప్రయోజనం కూడా శూన్యం.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement