మూడు నెలలుగా కాస్తంత ప్రశాంతత నెలకొన్నట్టుందనుకొనే లోగా కథ మళ్ళీ మొదటి కొచ్చింది. మణిపుర్‌లో శాంతి మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. కల్లోలిత ఈశాన్య రాష్ట్రంలో మెయితీల ప్రాబల్య మున్న కొన్ని ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో మునుపెన్నడూ లేని డ్రోన్ దాడులతో దేశం ఉలిక్కి పడింది. ఇప్పటి దాకా భావిస్తున్నట్టు ఇది కేవలం రెండు వర్గాల మధ్య జాతి, మతఘర్షణలే అనుకోవడానికి వీల్లేదని తేలిపోయింది. ముందుగా వేసుకున్న ఒక పథకం ప్రకారం, వ్యవస్థీకృతంగా సాగిస్తున్న యుద్ధనేరాల స్థాయికి దాడులు చేరిపోయాయి.
మణిపుర్‌లో ఘర్షణలు తగ్గిపోయాయంటూ ప్రధాని మోదీ చెప్పిన మాటల్లో పస లేదని క్షేత్రస్థాయి సంఘటనలతో స్పష్టమైంది. పైగా భారత భూభాగం లోపలే, సాక్షాత్తూ దేశ పౌరులపైనే ఇలా సైనిక వ్యూహంతో డ్రోన్ దాడులు మొత్తం ఈ ప్రాంతాన్నే భయంలోకి నెట్టి, అస్థిరపరచే కుట్రగా కనిపిస్తోంది. మయన్మార్‌లో జుంటాపై ప్రజాస్వామ్య అనుకూల వేర్పాటువాదులు సాగించే ఈ యుద్ధతంత్రం ఇక్కడ దర్శన మివ్వడం సరిహద్దుల ఆవల ప్రమేయాన్ని చూపుతోంది. ఇది ఆందోళనకరమైన పరిణామం.
అత్యాధునిక సాంకేతిక జ్ఞానంతో కూడిన డ్రోన్ల ద్వారా తీవ్రవాదులు రాకెట్ చోదిత గ్రెనేడ్లను ప్రయోగించడంతో ఆదివారం పలువురు గాయపడ్డారు. సోమవారం సైతం మరో గ్రామంపై ఇదే పద్ధతిలో డ్రోన్ దాడులు జరిగాయి. మణిపుర్‌లో హింస కొంతకాలం నుంచి ఉన్నదే అయినా, ఇలా పౌరులపై డ్రోన్లతో బాంబులు జారవిడవడం ఇదే తొలిసారి. అదీ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌కు వ్యతిరేకంగా గిరిజనుల ఆధిక్యం ఉన్న కొన్ని జిల్లాల్లో కుకీ – జో వర్గాలు నిరసన ప్రదర్శనలు జరి పిన మర్నాడే ఈ ఘటనలు జరగడం గమనార్హం. యుద్ధాల్లో వాడే ఇలాంటి వ్యూహాలను ఇలా అనూహ్యంగా అందరిపై ప్రయోగించి, ఉద్రిక్తతల్ని పెంచినది కుకీలే అన్నది పోలీసుల ఆరోపణ.
అదెలా ఉన్నా, ఇది మన నిఘా సంస్థల వైఫల్యానికీ, తీవ్రవాదుల కట్టడిలో మన భద్రతాదళాల వైఫల్యానికీ మచ్చుతునక. పరిస్థితి తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం మణిపుర్‌లో జరిగిన డ్రోన్ దాడులను నిశితంగా అధ్యయనం చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. తీవ్ర వాదులు ఎలాంటి డ్రోన్లను వాడారన్నది మొదలు పలు అంశాలను ఈ కమిటీ నిశితంగా పరిశీలించనుంది. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా నివారించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టా లన్న దానిపై నివేదిక సమర్పించనుంది.
అయితే గతేడాది మేలో మొదలైన హింసాకాండ చివరకు ఈ స్థాయికి చేరిందంటే, ఇప్పటికీ చల్లారలేదంటే తప్పు ఎక్కడున్నట్టు? ఉద్రిక్తతల్ని చల్లార్చి, విభేదాలు సమసిపోయేలా చూడడంలో స్థానిక పాలనా యంత్రాంగం ఇన్ని నెలలుగా విఫలమైందన్న మాట. కొండ ప్రాంతాలకూ, లోయ ప్రాంతాలకూ మధ్య బఫర్ జోన్లు పెట్టి, భద్రతాదళాల మోహరింపుతో శాశ్వతంగా శాంతి భద్రతల్ని కాపాడగలమని పాలకులు భావిస్తే పిచ్చితనం.
అసమర్థ పాలనతో పాటు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ మాత్రం కుర్చీ పట్టుకొని వేలాడుతూ, ఆ మధ్య కూడా గొప్పలు చెప్పారు. తాము నియమించిన శాంతిదూతలు గణనీయమైన పురోగతి సాధించారనీ, ఆరు నెలల్లో శాంతి తిరిగి నెలకొంటుందనీ ఊదరగొట్టారు. ఆ మాటలన్నీ నీటిమూటలేనని తాజా ఘటనలు ఋజువు చేశాయి. పైపెచ్చు, తాజాగా ఆధునిక సాంకేతికత సాయంతో, అత్యాధునిక ఆయుధాలతో సాగుతున్న దాడులను బట్టి చూస్తే, కొన్ని వర్గాలకు దేశం వెలుపల నుంచి అన్ని రకాల వనరులు అందుతున్నట్టు అనుమానం బలపడుతోంది.
దేశ సమగ్రత, సార్వభౌమత్వానికే ముప్పుగా పరిణమించే ఇలాంటి పరిస్థితుల్లో పాలకులు కుంభకర్ణ నిద్ర పోతే పెను ప్రమాదం. శతాబ్దాలుగా అనేక సంక్షోభాలను ఎదుర్కొని, తమ మట్టినీ, మనుగడనూ కాపాడుకొన్న చరిత్ర మణిపుర్ ప్రజలది. అలాంటి ప్రాంతాన్ని పేరుకు మాత్రమే భారత్‌లో భూభాగంగా చూడక, ఆ ప్రాంత ప్రజల బాగోగులు, అక్కడి శాంతి సుస్థిరతలు తాము పట్టించుకుంటామని పాలకులు నిరూపించుకోవాల్సిన సమయమిది.
2023 నుంచి కుకీలు, మెయితీల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం అట్టుడుకుతోంది. ఎక్కడ ఏ వర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉంటే, అక్కడ అది ఆ వర్గపు అడ్డాగా ఇప్పటికే మణిపుర్ అనేక జోన్లుగా అనధికారంగా చీలిపోయింది. ఇంటిలోని ఈ గుండెల మీద కుంపటి చాలదన్నట్టు, ఆ పక్కనే మన దేశానికి సరిహద్దులు సైతం అంతే ఉద్రిక్తంగా తయారయ్యాయి.
జుంటాకూ, తిరుగు బాటుదారులకు మధ్య ఘర్షణలతో మయన్మార్ రగులుతోంది. ఇటీవలి రాజకీయ సంక్షోభంతో పొరుగున బంగ్లాదేశ్‌తో వ్యవహారం అస్తుబిస్తుగా ఉంది. ఈ గందరగోళ భూభౌగోళిక వాతావరణం మణిపుర్ వ్యవహారాన్ని మరింత సున్నితంగా మార్చేస్తోంది. అంతా బాగానే ఉందనడం మాని, ఇప్పటికైనా బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ తాము అనుసరిస్తున్న ధోరణిని పునస్సమీక్షించుకోవాలి.
మణిపుర్ మరో యుద్ధభూమిగా మిగిలిపోకూడదనుకుంటే, మన పాలకులకు కావాల్సింది రాజకీయ దృఢసంకల్పం, చిత్తశుద్ధి. దేశ అంతర్గత భద్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదాన్ని గమనించి, తక్షణ నష్టనివారణ చర్యలు చేపట్టాలి. ఏ ఒక్క వర్గానికో కొమ్ము కాయడం మాని, పెద్దన్న తరహాలో అన్ని వర్గాల ప్రజల మధ్య స్నేహ సౌహార్దాలు నెలకొనేలా నిజాయతీగా కృషి చేయాలి.
సంబంధిత వర్గాలన్నిటితో రాజకీయ చర్చలు సాగించాలి. ఘర్షణల్ని పెంచిపోషిస్తున్న అంతర్లీన అంశాలను గుర్తించి, వాటిని ముందుగా పరిష్కరించాలి. తాత్కాలిక సర్దుబాటు కాక శాశ్వత శాంతిస్థాపనకై చర్చించాలి. ఇప్పటికైనా పాలకులు వివేకాన్ని చూపగలిగితే, మణిపుర్‌ను మంటల్లో నుంచి బయటపడేయవచ్చు. లేదంటే దేశమంతటికీ కష్టం, నష్టం.
మళ్ళీ మంటలు
Published Wed, Sep 4 2024 5:26 AM | Last Updated on Wed, Sep 4 2024 5:26 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment