
అన్నట్టే అయింది. పదిహేను రోజుల్లో రెండు రాజకీయ ప్రకంపనలు సంభవిస్తాయని జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ కుమార్తె – ఎంపీ అయిన సుప్రియా సులే రెండు వారాల క్రితం అన్నట్టే మొదటి ప్రకంపన మంగళవారం ఎదురైంది. రాజకీయ కురువృద్ధుడూ, 24 ఏళ్ళుగా ఎన్సీపీకి పెద్ద దిక్కూ అయిన శరద్ పవార్ తన సొంత పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగుతున్నట్టు రాజకీయ బాంబు పేల్చారు. చుట్టూ పార్టీ నేతలు ఉండగా, ఆత్మకథ రెండో ముద్రణ ఆవిష్కరణ వేదికగా శరద్ చేసిన ఆకస్మిక ప్రకటన కొందరిని కన్నీరు పెట్టించింది.
మనసు మార్చుకొమ్మంటూ మరికొందరు ప్రాథేయపడేలా చేసింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య కొద్ది గంటల వ్యవధిలోనే పునరాలోచనకు తనకు రెండు, మూడు రోజుల సమయం కావాలని శరద్ అంగీకరించేలా చేసింది. అనూహ్య నిర్ణయాలతో అవతలివారిని ఆత్మరక్షణలో పడేయడంలో ఆరితేరిన ఈ అపర చాణక్యుడి తాజా నిర్ణయానికి కారణాలు, పర్యవసానాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. జాతీయస్థాయి ప్రతిపాదిత ప్రతిపక్ష కూటమిలోనూ మల్లగుల్లాలు సాగుతున్నాయి.
అయిదున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న 82 ఏళ్ళ శరద్ భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకొనే రకం కాదు. ఆలోచన నిండిన ఆచరణవాది. అందుకే, ఆయన తాజా ఎత్తుగడ ఆసక్తికరం. నాలుగు విడతల మాజీ డిప్యూటీ సీఎం, శరద్ అన్న కుమారుడైన అజిత్ పవార్ సీఎం పదవిపై కన్నేశారనీ, చివరకు బీజేపీ అండతో కోరిక నెరవేర్చుకునేలా పావులు కదుపుతున్నారనీ కొన్ని వారాలుగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పైకి ఆ వాదనను అజిత్ సహా అందరూ కొట్టిపారేసినా, శరద్ హఠాత్ ప్రకటనతో ఒక్కొక్క పొర తొలగిపోతోంది.
ఆ మధ్య ఎన్సీపీ ఎమ్మెల్యేలు బీజేపీతో జట్టు కట్టనున్నారని తెలిసిన వెంటనే శరద్ అదేమీ పట్టనట్టుగా దర్యాప్తు సంస్థల సమన్లను ఎదుర్కొనలేనివారు పార్టీ వదలిపోవచ్చంటూ ముందరి కాళ్ళకు బంధం వేశారు. తాజాగా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా ద్వారా, ఒకరకంగా బీజేపీ అండతో అజిత్ సీఎం పీఠాన్ని అధిష్ఠించడానికి మార్గం సుగమం చేస్తూనే, కార్యకర్తలపై పట్టు బిగించారు.
నిజానికి, ఉద్ధవ్ ఠాక్రే, ఏక్‌నాథ్ శిందేల మధ్య శివసేన రెండుగా చీలి, కథ కోర్టుకెక్కిన ‘సేన వర్సెస్ సేన’ కేసులో సర్వోన్నత న్యాయస్థానం రాజ్యాంగ ధర్మాసనం ఏ క్షణంలోనైనా తీర్పు ప్రకటించవచ్చు. వచ్చే తీర్పును బట్టి ఏం జరగవచ్చు, అప్పుడేం చేయాలని రాజకీయ పార్టీలన్నీ ఇప్పటికే లెక్కలు వేసుకుంటున్నాయి. ఉద్ధవ్‌పై తిరుగుబాటు చేసి, ముందుగా జట్టు కట్టిన ఏక్‌నాథ్ సహా 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటును సుప్రీం సమర్థిస్తే, సమీకరణాలు మారతాయి.
ఆ పరిస్థితుల్లో సీఎం ఏక్‌నాథ్ అనర్హుడవడంతో పాటు ప్రస్తుత బీజేపీ – ఏక్‌నాథ్ శిందే ప్రభుత్వం మైనారిటీలో పడిపోతుంది. అప్పుడిక కొత్త మిత్రపక్షంగా అజిత్‌ను కలుపుకోవాలన్నది బీజేపీ వ్యూహం. దానికి తగ్గట్టే ఎన్సీపీని చీల్చి, శరద్‌కు రాజకీయ వారసుడిగా బీజేపీతో అజిత్ చేతులు కలుపుతారని గుప్పు మంది. అనివార్యతను అర్థం చేసుకున్న శరద్ గతంలో ఎన్టీఆర్, ములాయమ్ సింగ్‌ల లాగా వార సత్వ పోరులో బలికావడం ఇష్టం లేక వ్యూహాత్మకంగా రాజీనామా అస్త్రం సంధించినట్టుంది.
శరద్ రాజీనామాపై ఇతరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ, వయసు, ఆరోగ్యరీత్యా శరద్ నిర్ణయాన్ని గౌరవించాలనీ, ఆయన రాజీనామాను వెనక్కి తీసుకోరనీ భవిష్యత్తు గురించి మాట్లాడు తున్నది ఒక్క అజితే. దీన్నిబట్టి సూక్ష్మం గ్రహించవచ్చు. రక్తసంబంధీకులతో శరద్ తన నిర్ణయాన్ని ముందే చర్చించారట. బాబాయ్ ప్రకటన తర్వాతా తొణకని, బెణకని అబ్బాయ్ అజిత్ అందరిలా రాజీనామా ఉపసంహరణకు అభ్యర్థించకపోగా, ‘ఏదో ఒకరోజు ఇది జరగాల్సిందేగా’ అనడం పవర్ పాలిటిక్స్‌కు పరాకాష్ఠ.
సీఎం కావాలన్న అజిత్ ఆశతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ లను కీలుబొమ్మలుగా ఆడిస్తూ, ప్రత్యర్థులను వేధించే బీజేపీ ఘనచరితా దీనికి కారణమే. దర్యాప్తు సంస్థలు వెంటాడుతున్న ఎన్సీపీ నేతలు ప్రఫుల్ పటేల్ వగైరా సైతం శరద్‌తో అనివార్యత చర్చించి, ఒప్పించారట. ఎమ్మెల్యేలు బీజేపీతో నెయ్యానికి తొందరపడుతున్న వేళ ఈ సుదీర్ఘ లౌకిక రాజకీయ వాది పార్టీని కాపాడుకుంటూనే, తన చేతికి మరక అంటని రీతిలో తాజా వ్యూహానికి తెర తీశారు.
మిగిలిన మూడేళ్ళ రాజ్యసభ సభ్యత్వంలోనూ బాధ్యతలేమీ తీసుకోకుండా, దేశం కోసం, మహారాష్ట్ర కోసం పనిచేస్తానని శరద్ ఉప్పందించారు. అంటే, రేపు ఒకవేళ అజిత్ సారథ్యంలో ఎన్సీపీ కాషాయపార్టీతో అంటకాగినా పార్టీ వైఖరికి తాను కట్టుబడట్లేదని అనేందుకు ఆత్మరక్షణ సిద్ధం చేసుకున్నారు. ప్రతిపక్షాలేవీ తనను తప్పుబట్టే వీలు లేకుండా చూసుకున్నారు. పార్టీ అధినేత ఎంపిక బాధ్యతను పైకి 15 మంది సభ్యుల కమిటీకి అప్పగించినా, ఢిల్లీలో చక్రం తిప్పుతున్న కుమార్తె సుప్రియకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు, సీఎం అభ్యర్థిగా అజిత్‌కు మహారాష్ట్ర కిరీటం కట్టబెడతారని కథనం.
శరద్ రాజీనామాతో ఇప్పటికే పార్టీ జాతీయ కార్యదర్శి సహా పలువురు పక్కకు తప్పుకున్నారు. ఈ పరిణామాలతో ఎన్సీపీకి, మహారాష్ట్రలో మహావికాస్ ఆఘాడీ కూటమికి జరిగే నష్టం మాటేమో కానీ జాతీయస్థాయిలో కాంగ్రెస్‌కే మరింత కష్టం, నష్టం. ప్రతిపక్ష ఐక్యతపైనా, మాజీ కాంగ్రెస్ వాది శరద్ వ్యూహరచనపైనా హస్తం పార్టీ ఆశలు నీరుగారతాయి. 2024 ఎన్నికల వేళ బీజేపీకి ఇది లాభదాయకమే. అయితే, అజిత్‌కు దోవ ఇస్తున్నట్టు ఇస్తూనే, పార్టీపై పట్టు చూపుతున్న శరద్ పవార్ అంత తొందరగా కాడి కింద పడేస్తారా? ఇంతకీ, ముందుగానే జోస్యం చెప్పిన సుప్రియ పేర్కొన్న ఆ రెండో ప్రకంపన ఏమిటి? వేచి చూడాల్సిందే.