ఆటలోనైనా, వేటలోనైనా... గెలవాలంటే వ్యూహం ముఖ్యం. రాజకీయాలకూ అది వర్తిస్తుంది. ఆ సంగతి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి తెలిసినంతగా విపక్షాలకు సైతం తెలిసినట్టు లేదు. భారత రాష్ట్రపతి పీఠానికి తాజాగా అధికార, విపక్ష కూటములు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన తీరు అచ్చంగా అలాంటిదే.
అభ్యర్థి ఎవరన్నది గుట్టుగా ఉంచి, మంగళవారం దాకా మంతనాలు సాగించిన బీజేపీ, చివరకు తన భాగస్వామ్య పక్షాలతో కూడిన ‘జాతీయ ప్రజాస్వామ్య కూటమి’ (ఎన్డీఏ) అభ్యర్థిగా గిరిజన మహిళ ద్రౌపదీ ముర్మూ పేరు బయటపెట్టింది. ఒక మహిళను, అందులోనూ ఆదివాసీని అభ్యర్థిగా ప్రకటించి, ఆటలో మొదటి బంతిలోనే ప్రతిపక్ష కూటమిని దాదాపు అవుట్ చేసింది. మరోపక్క బీజేపీ వ్యతిరేక పక్షాలన్నీ కలసి యశ్వంత్ సిన్హాను రాష్ట్రపతి ఎన్నికల బరిలోకి దింపాయి. కానీ, అభ్యర్థి ఎంపికకే కష్టపడిన విపక్షాలు రేపు ఎన్నికలలో గట్టి పోటీనిస్తామన్న నమ్మకం మాత్రం కలిగించలేకపోయాయి.
కిందిస్థాయి నుంచి పైకొచ్చిన ద్రౌపది ప్రస్థానం ఆసక్తికరం. ఒడిశాలో మారుమూల మయూర్ భంజ్ జిల్లాకు చెందిన ఆమె రాజకీయాల్లోకి రాక ముందు గిరిజన ఉద్యమకారిణిగా ఓ అగ్గిబరాటా. నీటిపారుదల శాఖలో క్లర్కుగా మొదలై, టీచరుగా పనిచేసి, రాజకీయాల్లోకి వచ్చి కౌన్సిలరై, రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన చరిత్ర ఆమెది. 2007లో రాష్ట్ర ఎమ్మెల్యేలలో బెస్ట్‌గా ఎంపికైన ఆమె నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బీజేడీ – బీజేపీ కూటమి సర్కారులో మంత్రిగా కూడా అనేక విభాగాలను సమర్థంగా నిర్వహించి పేరు తెచ్చుకోవడం విశేషం.
మునుపు జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేసిన ఈ సంథాల్ మహిళ సామర్థ్యానికి కొదవ లేదు. అయితే, అత్యున్నత పదవికి అభ్యర్థిగా ఎంపికలో ఆమె సమర్థత కన్నా మహిళగా, ఆదివాసీగా ఆమె అస్తిత్వానికే ప్రాధాన్యం ఇచ్చారనేది విశ్లేషకుల వాదన. పైపెచ్చు, ఉత్తర, దక్షిణ భారతావనుల నుంచే రాష్ట్రపతులు ఎన్నికవుతూ వస్తున్న దేశంలో తూర్పు ప్రాంతం నుంచి గిరిజన మహిళను బరిలోకి దింపడం బీజేపీకి సామాజిక, రాజకీయ ప్రయోజనాలు తెచ్చిపెట్టే తురుఫుముక్క.
ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లలో దూరమైన ఆదివాసీ ఓటర్లను ఆకర్షించడానికీ, వచ్చే సార్వత్రిక ఎన్నికలకు మహిళల– దేశంలోని 10 కోట్ల గిరిజనుల ఓటుబ్యాంకును సుస్థిరం చేసుకోవడానికీ బీజేపీకి ఇదొక మంచి ఛాన్స్. రాగల రెండేళ్ళలో గుజరాత్ సహా అనేక ఎన్నికలున్న వేళ ఒక్క దెబ్బకు బోలెడు పిట్టలని ఆలోచించాకే ఆమెను అభ్యర్థిగా ప్రకటించారనుకోవచ్చు.
మరోపక్క కారణాలు ఏమైనా, వయస్సు, అనుభవం ఉన్న ఫరూఖ్ అబ్దుల్లా, శరద్ పవార్, గోపాలకృష్ణ గాంధీ – ముగ్గురూ విపక్ష రాష్ట్రపతి అభ్యర్థులుగా పోటీకి నిరాకరించడం గమనార్హం. ఎట్టకేలకు ఐఏఎస్ అధికారిగా పని చేసి, జనతా పార్టీలో చేరి, ఆ పైన బీజేపీకి వలస వచ్చి, 2014లో మోదీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని గట్టిగా బలపరిచి, ఆనక పార్టీనీ, క్రియాశీలక రాజకీయాలనూ వీడి ఆయనకు తీవ్ర విమర్శకుడిగా మారిన యశ్వంత్ సిన్హా విపక్షాలకు దిక్కయ్యారు.
2020 బెంగాల్ ఎన్నికల ముందు తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. ఆయన రాజకీయ, సామాజిక అనుభవం మెచ్చ దగినదే. విపక్షాల చర్చల్లో ఆది నుంచీ ఆయన పేరు వినపడింది. విపక్షాలు మొదట ఇతర అభ్యర్థుల వైపు మొగ్గినా, చివరకు ప్రత్యామ్నాయాలు కరవయ్యాక సిన్హా పేరుకే సరే అనాల్సి వచ్చింది. ఆయన కాషాయ గతాన్ని పట్టించుకోనట్టు ప్రవర్తించాల్సి వచ్చింది. అయితే, ఆయన గెలుపు కష్టమే.
నిజానికి, మండల్ కమిషన్ రోజుల నుంచి దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చివేస్తూ వచ్చిన అస్తిత్వ రాజకీయాల ఛాయలోకి రాష్ట్రపతి భవన్ వచ్చి చాలాకాలమైంది. దళిత పక్షపాతులమనే ముద్ర కోసం కె.ఆర్. నారాయణన్‌ను కాంగ్రెస్ తెస్తే, మైనారిటీలకు అనుకూలమనే పేరు కోసం అబ్దుల్ కలామ్‌ను వాజ్‌పేయి హయాంలో ఎన్డీఏ తెర పైకి తెచ్చిందనే విశ్లేషణలూ లేకపోలేదు.
అంత మాత్రాన ఆ మేధావుల సమర్థతను తక్కువగా చూడలేం. ద్రౌపది అభ్యర్థిత్వాన్ని సైతం ఆ దృష్టితోనే అర్థం చేసుకోక తప్పదు. అణగారిన వర్గాలను అక్కున చేర్చుకొని, పునాదిని విస్తరించుకొనే క్రమంలో క్రితంసారి 2017లో రామ్‌నాథ్ కోవింద్‌తో, ఇప్పుడు అందుకు కొనసాగింపుగా ద్రౌపదితో బీజేపీ తిరుగులేని పాచిక విసిరింది. దుర్భర దారిద్య్రం నుంచి పైకొచ్చిన ద్రౌపది లాంటి వారి కథ సమాజానికి స్ఫూర్తినిస్తూనే, ఓటర్లకు పార్టీ నుంచి తగిన రాజకీయ సూచనలు చేసినట్టయింది. అలా అటు సామాజిక మార్పు, ఇటు రాజకీయ బలం – రెండూ సమకూరాలన్నది వ్యూహం.
వ్యూహం నుంచి, ఓట్ల అంకెల దాకా అన్నీ అధికార బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏకే అనుకూలంగా ఉన్న వేళ... రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలను నెల ముందే ఇప్పుడే ఇట్టే ఊహించవచ్చు. అటు మహిళ, ఇటు ఆదివాసీ కావడంతో ద్రౌపది అభ్యర్థిత్వాన్ని ఎవరైనా వ్యతిరేకించడం కష్టమే. ఒడిశా మూలాల రీత్యా నవీన్ పట్నాయక్ బీజేడీ సైతం ఆమెకే జై కొడుతుంది.
ఎలక్టోరల్ కాలేజీలో సానుకూలతతో ఆమె గెలుపు నల్లేరుపై బండి నడకే. అద్భుతాలేమైనా జరిగితే తప్ప అతి పిన్నవయసు రాష్ట్రపతిగా ద్రౌపది అత్యున్నత పీఠంపై అధివసిస్తారు. 75 ఏళ్ళ స్వతంత్రభారతంలో తొలి ఆదివాసీ రాష్ట్రపతిగా, ప్రతిభా పాటిల్ తర్వాత రెండో మహిళా రాష్ట్రపతిగా రికార్డుకెక్కుతారు.
ఇన్నేళ్ళకైనా దేశ అత్యున్నత పీఠం గిరిజనులకు దక్కడం స్వాగతించాల్సిన విషయం. రాజకీయ ఎత్తుగడగానైనా, సామాజిక మార్పు తెచ్చే నిర్ణయం తీసుకున్నందుకు ఎన్డీఏను అభినందించాల్సిందే. ఇలాగే మహిళలకూ, గిరి జనులకూ పెద్దపీట వేయడాన్ని ఇతర రంగాల్లోనూ పాలకపక్షం కొనసాగిస్తే తప్పక హర్షించాల్సిందే.
ఒక్క దెబ్బకు ఎన్నో పిట్టలు!
Published Thu, Jun 23 2022 12:17 AM | Last Updated on Thu, Jun 23 2022 8:31 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment