
రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థులుగా జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకూ, విపక్షాలకూ కూడా ఈ ఎన్నిక కీలకం కానుంది. రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకు సర్వాధినేత రాష్ట్రపతి. ప్రధాన మంత్రి, ఆయన మంత్రిమండలి రాష్ట్రపతి అభిమతానికి అనుగుణంగానే తమ పదవుల్లో కొనసాగుతారు. ‘సంప్రదాయాలకు’ భిన్నంగా రాష్ట్రపతి తమ పూర్తి విచక్షణాధికారాలను ఉపయోగించుకోవచ్చు.
బహుశా రాబోయే సార్వత్రిక ఎన్నికల తరువాత ప్రధానమంత్రి నియామకం విషయంలో రాష్ట్రపతి కీలక భూమిక పోషించాల్సిన అవసరం పడవచ్చు. అందుకేనేమో ప్రతిపక్షాలు, అధికార పక్షం రాష్ట్రపతి ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి.
1969లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రేరణతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, అంతరాత్మ ప్రబోధం అన్న నినాదంతో అధికార కాంగ్రెస్ అభ్యర్థి నీలం సంజీవరెడ్డిని ఓడించి రాష్ట్రపతిగా వరహగిరి వెంకట గిరి నెగ్గిన ఏకైక సందర్భం మినహాయించి, ఇంత ప్రతిష్టాత్మకంగా దేశంలోని అత్యున్నత స్థానానికి ఎన్నిక జరగడం మున్నెన్నడూ జరగలేదు. తాను కోరుకున్న అభ్యర్థి మాత్రమే రాష్ట్రపతిగా ఎన్నిక కావాలని ఇందిరా గాంధీ పట్టుబట్టడం వెనుక స్పష్టమైన కారణం ఉందనేది జగద్విదితం.
తాను ప్రతిపాదించిన అభ్యర్థిని కాదని నీలం సంజీవ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోని ఆమె వ్యతిరేక వర్గమైన ‘సిండికేట్’ ఎంపిక చేసింది. రాజ్యాంగం రాష్ట్రపతికి కట్టబెట్టిన విశేష అధికారాలను ఉపయోగించి సమర్థుడైన సంజీవరెడ్డి సహాయంతో తనను పదవి నుండి తొలగించ డానికి సిండికేట్ పన్నిన కుట్రలో భాగంగానే తనకు ఇష్టంలేని అభ్యర్థిని ఎంపిక చేశారని ఇందిరాగాంధీ పసిగట్టారు.
కారణాలు ఏమైనప్పటికీ దేశవ్యాప్తంగా ఒకవైపు ఆయన పార్టీ లోనూ, పార్టీ వెలుపలా నరేంద్ర మోదీకి వెల్లువెత్తుతున్న వ్యతిరేకత, బీజేపీకి వ్యతిరేకంగా బలడుతున్న విపక్షాల ఐక్యత, బహుశా రాబోయే సార్వ త్రిక ఎన్నిక తరువాత ప్రధానమంత్రి నియామకం విషయంలో రాష్ట్ర పతి కీలక భూమిక పోషించాల్సిన అవసరం పడవచ్చు. ఇందిరా గాంధీ హయాంలో లాగా బీజేపీలోని మోదీ వ్యతిరేక వర్గం కూడా వారు కోరుకున్న అభ్యర్థి రాష్ట్రపతి అవుతే మంచిదని భావిస్తుండవచ్చు కూడా.
భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణలో కూడా, స్పష్టంగా కానీ, అస్పష్టంగా కానీ, ఎక్కడా రాష్ట్రపతి కంటే ప్రధానమంత్రికి ఎక్కువ అధికారాలున్నాయని చెప్పలేదు. కాకపోతే చాలామంది రాజ్యాంగ నిపుణులు బ్రిటిష్ నమూనానూ, అక్కడి సంప్రదాయాలనూ మన రాజ్యాంగానికి అన్వయించి ఉదాహరణలు ఇస్తుంటారు. వాస్తవానికి మనది చాలావరకు బ్రిటిష్ మోడల్ అయినప్పటికీ దాన్ని మొత్తానికి మొత్తం అనుసరించడం లేదు.
కొంతమేరకు మనది పార్లమెంటరీ వ్యవస్థ అయితే, కొంతమేరకు ప్రెసిడెన్షియల్ వ్యవస్థ అనాలి. భారత రాజ్యాంగం ప్రకారం నిజమైన కార్యాచరణ వ్యవస్థ రాష్ట్రపతిదే గానీ ప్రధానిది కాదు. రాష్ట్రపతి తన విధుల నిర్వహణలో ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి సలహాలనూ, సూచనలనూ స్వీక రిస్తారని ఆర్టికల్ 74లో పేర్కొన్నారు.
ఎన్నో ముఖ్యమైన నియామకాలను రాష్ట్రపతే చేస్తారు. వారిలో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, సుప్రీంకోర్ట్, హైకోర్ట్ న్యాయమూర్తులు, ఎన్నికల అధికారులు తదితరులుంటారు. షెడ్యూల్డ్ ప్రాంతాల పాలనకు సంబంధించి కమిషన్లను కూడా వారే నియమిస్తారు. అన్నిటికన్నా ప్రాధాన్యమైంది, ఆర్టికల్ 352 నుండి 360 వరకు పేర్కొన్న రాష్ట్రపతికున్న ఎమర్జెన్సీ విశేషాధికారాలు.
ఆ సమయంలో రాష్ట్రపతి, పౌరుల ప్రాథమిక హక్కులను సైతం రద్దు చేయవచ్చు. ఆయన ఆమోదం కొరకు పార్లమెంటు అంగీకరించిన అన్ని బిల్లులూ రావాల్సిందే. ఆయన వాటిని ఆమోదించనూవచ్చు, తిరస్కరించనూవచ్చు లేదా పునఃపరిశీలనకు పంపనూవచ్చు.
రాజ్యాంగాధికార చక్రవర్తులతో (కాన్‌స్టిట్యూషనల్ మోనార్క్స్) రాష్ట్రపతి పాత్రను పోల్చవచ్చు. రాష్ట్రపతి అధికారాలను కార్యనిర్వా హక, శాసన, న్యాయ, మిలిటరీ, దౌత్య, ఆర్థిక, ఎమర్జెన్సీపరమైనవిగా విభజించవచ్చు. కార్యనిర్వాహక అధికారాల కింద రాష్ట్రపతి ప్రధాన మంత్రినీ, ఆయన మంత్రివర్గ సహచరులనూ నియమించి వారికి పోర్ట్‌ఫోలియోలను కేటాయించడం జరుగుతుంది. ఆయన ద్వారా నియామకమైన వీరందరినీ తొలగించే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుంది.
ప్రధానిని రాష్ట్రపతి నియమించడానికి ఫలానా విధమైన పద్ధతి అని రాజ్యాంగంలో ఎక్కడా ప్రత్యేకంగా నిబంధనలు పొందు పరచలేదు. సాంప్రదాయాలుండవచ్చు. అది పూర్తిగా రాష్ట్రపతి విచక్ష ణాధికారం. రాష్ట్రపతి దేశాధినేత అయితే, ప్రధాని కేవలం ప్రభుత్వా ధినేత మాత్రమే. దేశాధినేతగా, ఎవరిని ప్రభుత్వాధినేతగా ఎంపిక చేయాలనే విషయంలో, రాష్ట్రపతికి సంపూర్ణ హక్కు, విచక్షణాధికా రాలు ఉన్నాయి. దీనికి అనుగుణంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మాతృకైన బ్రిటన్‌లో అనేక ఉదాహరణలు ఉన్నాయి.
విక్టోరియా మహారాణి 1894లో తన విచక్షణాధికారాలు ఉపయోగించి, పదవీ విరమణ చేసిన గ్లాడ్ స్టోన్ సలహాను పక్కకు పెట్టి, లార్డ్ రోస్బెరీని ప్రధానిగా నియమించారు. తిరిగి 1957లో ఎలిజబెత్ మహారాణి తన విచక్షణాధికారాలను సంపూర్ణంగా వాడుకుని, ప్రధాని కావాల్సిన బట్లర్‌కు బదులుగా హెరాల్డ్ మాక్మిలన్‌ను ఆ పదవిలో నియమిం చారు. మెజారిటీ స్థానాలను గెల్చుకున్న కన్జర్వేటివ్ పార్టీ తమ నాయ కుడిని ఎన్నుకునే లోపలే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.
సర్వేపల్లి రాధాకృష్ణన్ భారత రాష్ట్రపతిగా ఉన్నరోజుల్లో నెహ్రూ మరణానంతరం, అధికార కాంగ్రెస్ పార్టీ తన అభిప్రాయాన్ని వెల్లడించక ముందే, గుల్జారీ లాల్ నందాను ప్రధానమంత్రిగా నియ మించారు. మరో మారు కూడా గుల్జారీలాల్ నందాను ప్రధానిగా నియమించారాయన. కాకపోతే రెండు సార్లు కూడా నందా కేవలం ఆపద్ధర్మ ప్రధానిగానే కొనసాగారు.
1989 సాధారణ ఎన్నికల అనంతరం, కాంగ్రెస్ పార్టీ ప్రభు త్వాన్ని ఏర్పాటు చేయడానికి విముఖత వ్యక్తపరచడంతో... వీపీ సింగ్‌ను ప్రధానిగా నియమించడానికీ, ఆ తరువాత ఆయన రాజీ నామా దరిమిలా, మొదలు రాజీవ్ గాంధీనీ, తరువాత చంద్రశేఖర్‌నూ ఆహ్వానించడానికీ, అప్పటి రాష్ట్రపతి వెంకట్రామన్ తన విచాక్షణా ధికారాలను పూర్తిగా వినియోగించుకున్నారు.
1979లో నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా వ్యవహరించిన తీరు ఆ పదవికున్న ప్రాధాన్యతను తెలియచేస్తుంది. మొరార్జీ దేశాయి ప్రభుత్వం విశ్వాస నిరూపణలో ఓటమి తరువాత మొదలు వైబీ చవాన్‌ను ఆహ్వానించడంలో, తరువాత మొరార్జీకి మరో చాన్స్ ఇవ్వ కుండా ఉండటంలో, చరణ్ సింగ్‌ను చివరకు ప్రధానిగా నియమించ డంలో రాష్ట్రపతి వ్యవస్థకున్న విశేష అధికారాలు ప్రస్ఫుటమవుతున్నాయి.
ఆ తరువాత చరణ్ సింగ్‌ను విశ్వాస పరీక్షకు ఆదేశించారు రాష్ట్రపతి. అలా ఆదేశించడం అప్పటికి అదే మొదటిసారి. 25 రోజు ల్లోపలే చరణ్ సింగ్ ప్రధానిగా రాజీనామా చేసి పార్లమెంట్‌కు వెళ్ళని మొదటి, చివరి ప్రధానిగా మిగిలిపోయారు. లోక్‌సభను రద్దు చేయ మన్న ఆయన సిఫార్సుకు నీలం సంజీవరెడ్డి అంగీకరించారు. చరణ్ సింగ్‌ను ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగమన్నారు. దరిమిలా చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్రపతిని విమర్శించాయే కానీ ఆయన అధికారాలను కుదించలేకపోయాయి. చరణ్ సింగ్‌ను ప్రధానిగా కొనసాగమని రాష్ట్రపతి కోరడానికి కారణం, రాజ్యాంగపరమైన బాధ్యతే.
ఈ ఉదాహరణలన్నీ ఒకటే విషయాన్ని స్పష్టంగా తెలియ జేస్తున్నాయి. ప్రధాన మంత్రి, ఆయన మంత్రిమండలి రాష్ట్రపతి అభిమతానికి అనుగుణంగానే పదవిలో కొనసాగుతారు. ఇంతవరకూ జరగక పోయినా, ఇక ముందూ జరిగే అవకాశాలు లేకపోయినా, రాజ్యాంగంలోని అంతర్లీన అర్థం ప్రకారం, సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ, తాను నియమించిన ప్రధానినీ, ఆయన ప్రభుత్వాన్నీ రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది.
ఒక వేళ రాష్ట్రపతే కనుక తన విశేష–విచక్షణాధికారాలను అవసరమైనప్పుడు ఉపయోగించు కోకపోతే, పదవీ స్వీకారం చేసినప్పుడు చెప్పే ‘‘రాజ్యాంగాన్నీ, చట్టాన్నీ తన శాయశక్తులా, అహర్నిశలూ విధేయతతో సంరక్షిస్తాననీ, కాపాడుతాననీ, భద్రపరుస్తాననీ’’ అనే మాటలకు అర్థం లేదు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నికైతే భవిష్యత్‌లో ఏం జరుగుతుందో?
వనం జ్వాలా నరసింహారావు
వ్యాసకర్త తెలంగాణ ముఖ్యమంత్రి సీపీఆర్‌ఓ
మొబైల్: 80081 37012
Comments
Please login to add a commentAdd a comment