ఆహూతులైన వివిధ దేశాల ప్రభుత్వాధినేతలు, అనేక రంగాల ప్రముఖులు, వేలాది జనం సాక్షిగా, రాష్ట్రపతి భవన్ వేదికగా ఆదివారం రాత్రి నరేంద్ర మోదీ కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. భారత ప్రధాని స్వర్గీయ నెహ్రూ తర్వాత మళ్ళీ వరుసగా మూడుసార్లు ప్రధాని పదవిని చేపట్టిన మరో వ్యక్తిగా మోదీ చరిత్ర సృష్టించారు. ప్రధాన మంత్రి కిసాన్ నిధి నుంచి 17వ విడతగా 9.3 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరేలా రూ. 20 వేల కోట్లు పంపిణీ చేసే ఫైలుపై తొలి సంతకంతో సోమవారం ఉదయమే మోదీ పనిలోకి దిగిపోయారు.
మొదటి రెండు పర్యాయాలు బీజేపీ సొంత బలంతో ‘మోదీ సర్కార్’గానే పాలన చేసిన కమలనాథులు ఈ మూడోసారి మాత్రం చాలినంత సంఖ్యాబలం లేక, మిత్రపక్షాల అండతో అచ్చమైన ‘ఎన్డీఏ సర్కార్’గా పని చేయాల్సి రావడం కొత్త పాలనలోని పెద్ద మార్పు. గతంలో గుజరాత్ సీఎంగా కానీ, ఆ తరువాత గడచిన పదేళ్ళుగా ప్రధానిగా కానీ తన మాటే శాసనంగా చలామణీ అయిన మోదీ ఇప్పుడు వివిధ ప్రాంతాలు, పార్టీలు, ఆశలు, ఆకాంక్షలకు చెవి ఒగ్గి, ఏకాభిప్రాయసాధనలో ఏ మేరకు విజయం సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
జనరల్ (24), ఓబీసీ (27), ఎస్సీ (10), ఎస్టీ (5), మైనారిటీలు (5)... ఇలా వివిధ వర్ణ శోభితమైన హరివిల్లుగా మొత్తం 71 మంది సహచరులతో మోదీ సారథ్యంలో కొత్త మంత్రి మండలి ఏర్పాటైంది. మొత్తం 81 మంది మంత్రి పదవులకు అవకాశం ఉండగా ఏకంగా 71 మందిని తొలి విడతలోనే తీసుకున్న మోదీ 24 రాష్ట్రాలకు కేంద్రంలో ప్రాతినిధ్యం కల్పించినట్టయింది. అయితే, ప్రమాణ స్వీకారం జరిగిన అనేక గంటల తర్వాత సోమవారం రాత్రికి గాని మంత్రిత్వ శాఖల కేటాయింపు ప్రకటన వెలువడలేదు. ఏకపక్ష నిర్ణయాలు అలవాటైన ప్రభుత్వ పెద్దలు సంకీర్ణ ప్రభుత్వంలో అన్ని పక్షాలకూ సంతృప్తి కలిగేలా వ్యవహరించడంలోని ఇబ్బందిని ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నట్టుంది.
ఆ మాటకొస్తే ప్రమాణ స్వీకారానికి ముందు, ఆ తరువాత కూడా సంకీర్ణ పక్షాలలో కొన్ని బాహాటంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఒక మంత్రి పదవి... అదీ సహాయ మంత్రి పదవే ఇవ్వడం, అందులోనూ గతంలో క్యాబినెట్ హోదాలో పనిచేసిన ప్రఫుల్ పటేల్‌కు ఆ స్థాయి తక్కువ పదవి ఇవ్వడం పట్ల అజిత్ పవార్ సారథ్యంలోని జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ప్రమాణ స్వీకారం కన్నా ముందు ఆదివారమే అభ్యంతరం చెప్పింది. మంత్రి పదవిని తిరస్కరించింది.
గెలిచిన అనురాగ్ ఠాకూర్ నుంచి, ఓడిపోయిన స్మృతీ ఇరానీ దాకా పలు పాత ముఖాలకు కొత్త సర్కారులో మోదీ మొండిచేయి చూపారు. అదే సమయంలో 33 మందిని మొదటిసారి మంత్రుల్ని చేశారు. ఏపీ నుంచి ముగ్గురికి, తెలంగాణ నుంచి ఇద్దరికీ మంత్రులుగా బెర్తులిచ్చారు. ఆ లెక్కలెలా ఉన్నా, సోమవారం సాయంత్రం తొలిసారిగా కేంద్ర క్యాబినెట్ భేటీ జరిగే లోగా... సంకీర్ణ సర్కారు నుంచి మరిన్ని గొంతులు పైకి లేచాయి. ఏడుగురు ఎంపీలున్న తమ కన్నా తక్కువ సంఖ్యాబలం గల పార్టీలకు క్యాబినెట్ హోదా మంత్రి పదవిచ్చి, తమకు మాత్రం స్వతంత్ర హోదా ఉన్న సహాయ మంత్రి పదవితోనే సరిపుచ్చారంటూ ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలోని శివసేన అసమ్మతి వ్యక్తం చేసింది.
సొంత గూటిలోనూ బీజేపీకి సణుగుళ్ళు తప్పట్లేదు. కేరళలో తొలిసారిగా ఖాతా తెరిచిన కమలం పార్టీ త్రిస్సూర్ నుంచి గెలిచిన సినీ నటుడు సురేశ్ గోపికి మంత్రిమండలిలో స్థానం కల్పించింది. అయితే, సహాయ మంత్రి హోదా ఇచ్చినందుకు కినిసి ఆయన పక్కకు తప్పుకోవడానికి సిద్ధమైనట్టు వార్తలు రావడం, రచ్చ రేగేసరికి ఆఖరుకు ట్విట్టర్‌లో అలాంటిదేమీ లేదని ఖండించడం చకచకా జరిగాయి. వీటిని బట్టి సంకీర్ణ సర్కార్ నడపడంలోని సవాళ్ళు మోదీకి ఆదిలోనే అర్థమై ఉండాలి.
మరోపక్క మరికొద్ది నెలల్లోనే మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రాల్లో బలహీనంగా ఉన్న బీజేపీ అక్కడ మళ్ళీ బలం పుంజుకోవాలని ప్రయత్నిస్తుంది. అలాగే, దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ క్యాబినెట్‌లో ప్రాతినిధ్యమూ కమలనాథుల ‘మిషన్ సౌత్’ వ్యూహంలో భాగమే. ఇక, వివిధ రాష్ట్రాలకు గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఆరుగురు ఇప్పుడు మోదీ క్యాబినెట్‌లో ఉన్నారు. స్వయంగా మోదీని సైతం కలుపుకొంటే ఆ సంఖ్య ఏడుకు చేరుతుంది.
అంటే పాలనలో అనుభవానికి కొరత లేదు. కాకపోతే, వ్యక్తిగతంగా అధికారంలో శిఖరాలను చూసినవారు కలసికట్టుగా ముందడుగు వేయడంలో అహంభావాలకు తావు లేకుండా చూసుకోగలరా అని విశ్లేషకుల అనుమానం. అయితే, రక్షణ, ఆర్థిక, హోమ్, విదేశీ వ్యవహారాల వంటి కీలక శాఖలను గత ప్రభుత్వంలోని మంత్రులకే కట్టబెట్టారు. ఇది కొత్త సీసాలో పాత సారాగా తోచినా, విధానాల కొనసాగింపు, సుస్థిరత్వానికి పెద్దపీట వేశారనుకోవాలి.
వెరసి మోదీ ప్రజల కొత్త తీర్పుతో ఇప్పుడు కొత్త పిచ్ మీద ఆట మొదలుపెట్టారు. ఒకప్పటి వాజ్‌పేయి సంకీర్ణ సర్కార్‌లా సక్సెస్ కావాలంటే సహనం, సహానుభూతి పెంచుకోక తప్పదు. సంకీర్ణ సర్కారుకు తోడు బలమైన ప్రతిపక్షమూ ఉన్నందున పించ్ హిట్టింగ్‌కు అవకాశం లేదు. తిరుగులేని మెజారిటీ ఉన్న గతంలోలా ఇప్పుడు ఎవరికీ ముందస్తు సమాచారం ఇవ్వకుండానే పెద్ద నోట్ల రద్దు, దేశవ్యాప్త లాక్‌డౌన్ లాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం లాంటివి చేయలేరు.
వివాదాస్పదమైన ఒకే దేశం – ఒకే ఎన్నిక, ఉమ్మడి పౌరస్మృతి లాంటి సొంత అజెండాను కాషాయధ్వజులు కొన్నాళ్ళు పక్కనపెట్టక తప్పదు. ఆటలో దూకుడుకు అవకాశం లేనప్పుడు అవుటవకుండా ఆత్మరక్షణ ధోరణిలో ఆడక తప్పదు. పదేళ్ళుగా ప్రాంతీయ పార్టీలను సామ దాన భేద దండోపాయాలతో ఆడిస్తున్న పెద్దలకు కచ్చితంగా ఈ సంకీర్ణపు ఆట సరికొత్తదే! అలాగే పెరిగిన బలంతో ఊపిరి పీల్చుకున్న ప్రతిపక్షం సైతం 18వ లోక్‌సభలో కూటమిగా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తేనే ప్రజలకు మేలు.
సరికొత్త సంకీర్ణ విన్యాసం
Published Tue, Jun 11 2024 12:04 AM | Last Updated on Tue, Jun 11 2024 12:04 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment