అక్కున చేర్చుకున్నవారిని మెచ్చుకోవటం, అయిష్టత చూపినవారికి దూరం జరగటం సర్వసాధారణం. ప్రధాని మోదీ కూడా దానికి భిన్నంగా ఉండలేకపోయారు గనుకే మంగళవారం నాటి తన విజయోత్సవ ప్రసంగ ప్రారంభంలో ఎప్పటిలా ‘జైశ్రీరాం’ అనడానికి బదులు ‘జై జగన్నాథ్’ అనివుండొచ్చు. ఆశించిన సీట్లు ఇవ్వని ఉత్తరప్రదేశ్ ప్రస్తావన కన్నా ఆదరాభిమానాలు చూపి ఏకంగా 21 ఎంపీ స్థానాల్లో 20 కట్టబెట్టడంతో పాటు రాష్ట్ర పాలనాపగ్గాలను సైతం అందించిన ఒడిశా ప్రధానికి స్ఫురించటంలో వింతేముంది? ఈ ఎన్నికల్లో బీజేపీకి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి.
అందువల్ల పదేళ్లనాడే 282 స్థానాలు, అటుపై 303 స్థానాలు గెలిచిన బీజేపీ ఈసారి 240తో సరిపెట్టుకోవాల్సివచ్చింది. ఇది సాధారణ మెజారిటీ కన్నా 32 తక్కువ. ఎన్‌డీఏ కూటమిగా ఇప్పటికీ 292 స్థానాలున్నా నితీశ్ కుమార్, చంద్రబాబు వంటి ఊగిసలాట మనస్తత్వం గల భాగస్వాములున్న చోట ఏదైనా జరగొచ్చన్న భయాందోళనలు బీజేపీకి ఉండటం సహజమే. అందులోనూ నితీశ్ ఎప్పటి నుంచో కోరుకుంటున్న ప్రత్యేక హోదా డిమాండ్ తెరపైకొచ్చినా ఆశ్చర్యం లేదు. బాబు చరిత్ర గమనిస్తే ఆయన హోదా కోసం పట్టుబట్టే అవకాశం అంతంత మాత్రమే. మొత్తానికి ‘అబ్ కీ బార్ మోదీ సర్కార్’ అన్న నినాదాన్ని సవరించుకుని ‘అబ్ కీ బార్ కూటమి సర్కార్’ అనక తప్పట్లేదు.
సంప్రదాయానికి భిన్నంగా తక్కువ స్థానాలిచ్చిన ఉత్తరాదితో పోలిస్తే... సగానికిపైగా స్థానాలిచ్చిన తూర్పు జోన్, ఆశించినదానికి మించి ఇచ్చిన దక్షిణాది బీజేపీకి భుజాలు కాశాయి. పశ్చిమ జోన్‌లోని మహారాష్ట్రలో ఫిరాయింపులను ప్రోత్సహించి రెండు ప్రధాన పార్టీల్లో చీలిక తెచ్చిన పర్యవసానంగా ఎన్‌డీఏ దెబ్బతింది. సగం స్థానాలు కూడా సాధించలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ ఇది బీజేపీని వణికిస్తోంది. మహారాష్ట్రలో 2019లో శివసేనతో పొత్తు పెట్టుకుని అక్కడున్న 48 స్థానాల్లో బీజేపీ సొంతంగా 23, కూటమిగా 41 గెల్చుకుంది.
ఈసారి 28 చోట్ల పోటీచేస్తే అందులో సగం కూడా దక్కలేదు. బీజేపీ 9తో సరిపెట్టుకోగా... దాని మిత్రపక్షాల్లో ఒకటైన శివసేన (షిందే) వర్గం పోటీచేసిన 15లో ఆరు, ఎన్సీపీ(అజిత్) పోటీచేసిన అయిదింటిలో రెండు గెల్చుకున్నాయి. ఈసారి కనీసం 45 రాబట్టాలన్న ఆశ కొట్టుకుపోయింది. ఈ జోన్‌లోని గుజరాత్‌లో ఎన్‌డీఏకు 25 లభించినా చాన్నాళ్ల తర్వాత ఒకస్థానం విపక్షాలకు దక్కటం అది జీర్ణించుకోలేని అంశం. ఇక రాజస్తాన్‌లోవున్న మొత్తం 25 స్థానాలూ గతంలో ఎన్‌డీఏ గెల్చుకోగా ఈసారి 14తో సరిపెట్టుకుంది. ఇండియాకు 11 దక్కాయి. పశ్చిమజోన్‌లో మొత్తం 103 స్థానాలుంటే ఎన్డీయేకు 59, ఇండియాకి 42 వచ్చాయి.
ఉత్తరాదిన ఏడు రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ–కశ్మీర్, ఢిల్లీ, చండీగఢ్, లద్దాఖ్‌లున్నాయి. ఈ ప్రాంతంలో మొత్తంగా 195 స్థానాలుండగా ఎన్డీయేకు 117 దక్కాయి. అంకె ఘనంగానే కనబడుతున్నా ఇండియా కూటమి 71 స్థానాలు ఎగరేసుకుపోవటం అసాధారణం. ఇక్కడి యూపీ, పంజాబ్, హరియాణా, బిహార్, మధ్యప్రదేశ్, హిమాచల్, ఉత్తరాఖండ్‌లలో ఇండియా కూటమి పక్షాలకు పెద్దగా రాకపోవచ్చని బీజేపీ అంచనా వేసుకుంది. కానీ ఉత్తరప్రదేశ్‌లోని 80 స్థానాల్లో 2019లో 62 గెల్చుకున్న ఎన్‌డీఏకు ఈసారి కేవలం 36 వస్తే, విపక్ష కూటమి 43 గెల్చుకుంది. పైగా ఆ కూటమిలోని సమాజ్‌వాదీ 33 సాధించి బలం పుంజుకుంది.
ఇక బిహార్‌లో 40 స్థానాలకూ ఎన్డీయే 30 గెల్చుకుంది. తొమ్మిది విపక్ష కూటమికి వచ్చాయి. కానీ రైతు ఉద్యమ ప్రభావంగల హరియాణాలోని 10 స్థానాల్లో అయిదు స్థానాలే లభించాయి. ఇండియా కూటమికి మరో అయిదు వచ్చాయి. పంజాబ్‌లోని 13 స్థానాల్లో బీజేపీకి ఒక్కటంటే ఒక్కటి రాలేదు. ఇండియా కూటమికి 10 లభించాయి. గతంలోని వోటింగ్ శాతం గల్లంతైనా ఢిల్లీ మాత్రం మాట దక్కించింది. అక్కడి ఏడు స్థానాలూ బీజేపీ ఖాతాలో పడ్డాయి. కేజ్రీవాల్ అరెస్టు ప్రభావం ఏమాత్రం లేదు. మధ్యప్రదేశ్ (29), హిమాచల్ (4), ఉత్తరాఖండ్ (5) గంపగుత్తగా ఎన్‌డీఏ వైపే మొగ్గాయి. ఇక దక్షిణాదిలో నిరుడు ఎన్నికల్లో అసెంబ్లీని చేజార్చుకున్న కర్ణాటకలో ఎన్‌డీఏకు 19 సీట్లు రావటం, ‘ఇండియా’ కేవలం 9కి పరిమితం కావటం బీజేపీకి ఊరటనిచ్చింది.
అలాగే ఏపీలో ఎన్‌డీఏకు 21, తెలంగాణలో 8, కేరళలో ఒకటి లభించటం అంచనాకు మించినవే. దక్షిణాదిన గల 131 స్థానాల్లో ‘ఇండియా’ కూటమికి లభించిన 77తో పోలిస్తే ఎన్డీయేకు వచ్చిన 49 తక్కువే కావొచ్చుగానీ... ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే ఎక్కువ. 114 స్థానాలున్న తూర్పు జోన్‌లో ఎన్డీయేకు 67 లభించాయి. ఇందులో ఒడిశా గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. 24 ఏళ్లపాటు ఆ రాష్ట్రాన్ని పాలించి సిల్వర్ జూబ్లీలోకి అడుగుపెడదామనుకున్న బిజూ జనతాదళ్ అధినేత, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ను నిరోధించి అధికారం దక్కించుకోవటంతోపాటు ఒకటి మినహా ఎంపీ స్థానాలన్నీ బీజేపీ గెల్చుకుంది. ఇదే జోన్‌లోని బెంగాల్ కేవలం 12 ఎంపీ స్థానాలకే బీజేపీని పరిమితం చేయటం గమనించదగ్గది.
మొత్తానికి ఉత్తరాదిలో భావోద్వేగాల కన్నా నిరుద్యోగం, అధిక ధరలు, పడిపోయిన జీవనప్రమాణాలు వగైరా అంశాలు చర్చలోకొచ్చాయి. వోటింగ్‌లోనూ వాటి ప్రభావం కనబడింది. ఇది మెచ్చదగ్గ విషయం. వచ్చే ఏడాది రాబోయే 16 ఫైనాన్స్ కమిషన్ నివేదిక, ఆ మరుసటేడు లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన, ఫెడరల్ వ్యవస్థపై సాగే చర్చ కీలకమైనవి. ఈ అంశాల విషయంలో ఏకపక్ష నిర్ణయాలకు బదులు అందరినీ సంప్రదించక తప్పని స్థితి ఏర్పడటం హర్షించదగింది. దేశ ప్రజానీకం ప్రదర్శించిన విజ్ఞతనూ, దానివెనకున్న స్ఫూర్తినీ రాజకీయ పక్షాలన్నీ గ్రహిస్తే జటిల సమస్యల పరిష్కారం కష్టం కాదు.
సమస్యలపై ‘సమష్టి’ దృష్టి
Published Thu, Jun 6 2024 12:54 AM | Last Updated on Thu, Jun 6 2024 12:54 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment