జ్ఞాపకాలకు ‘సంకెళ్లు’ | Sakshi Editorial On Retired Superiors Working In National Security Agencies | Sakshi
Sakshi News home page

జ్ఞాపకాలకు ‘సంకెళ్లు’

Published Sat, Jun 5 2021 12:00 AM | Last Updated on Sat, Jun 5 2021 12:00 AM

Sakshi Editorial On Retired Superiors Working In National Security Agencies

రాజకీయ నాయకులుగా, ఉన్నతాధికారులుగా దీర్ఘకాలం అధికారానికి సన్నిహితంగా మెలగిన వారు... కీలక బాధ్యతలు నిర్వర్తించినవారు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాక తమ జ్ఞాపకాలను ఏకరువు పెడుతూ రాసే పుస్తకాలకు మంచి గిరాకీ వుంటుంది. అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలతో పోలిస్తే మన దేశంలో అలా రాయడానికి సిద్ధపడేవారు చాలా కొద్దిమంది. గత కొన్నాళ్లుగా ఆ ధోరణిలో ఎంతో కొంత మార్పు వచ్చిందనే చెప్పాలి. కానీ అలాంటివారిని సైతం నిరుత్సాహ పరిచేలా గత నెల 31న కేంద్ర సర్వీసుల(పింఛన్‌) నిబంధనలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంటెలిజెన్స్, దేశ భద్రతకు సంబంధించిన సంస్థల్లో పనిచేసి రిటైరైన ఉన్నతా ధికారులు ఆ సంస్థల పరిధిలోకి రాగల అంశాలను ముందస్తు అనుమతి లేకుండా వెల్లడించరాదని సవరించిన నిబంధనల సారాంశం. ఈ సంస్థల్లో రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌(రా), ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ), బీఎస్‌ఎఫ్, సీబీఐ తదితరాలు చాలావున్నాయి. రా లో పనిచేసి రిటైరైనవారు విదేశాల్లో ఆ సంస్థ కార్యకలాపాల గురించిన జ్ఞాపకాలను రాయదల్చుకుంటే ప్రస్తుత కార్యదర్శిని సంప్రదించి ఆయన అనుమతి తీసుకోవాలని... ఐబీలో రిటైరైన అధికారులు ఆ సంస్థ ప్రస్తుత డైరెక్టర్‌ నుంచి అనుమతి తీసుకోవాలని నిబంధనలు చెబుతున్నాయి. ఈ సంస్థల్లో పనిచేసేవారు ఎంతో నిబద్ధతతో, దేశం పట్ల అంకితభావంతో పనిచేస్తారన్న అభిప్రాయం వుంటుంది. వీరు దాదాపు ఎక్కడా కనబడరు. ప్రముఖంగా వార్తల్లో వుండరు. కానీ అధికారంలో వున్న నాయకత్వం తీసుకునే ఎలాంటి నిర్ణయంలోనైనా వీరి పాత్ర కీలకం. నిఘా సంస్థల్లో పనిచేసేవారు బాధ్యతలరీత్యా దేశంలో ఉద్రిక్తతలు చెలరేగే ప్రాంతాల్లో సంచరించాల్సి వస్తుంది. శత్రు దేశాల్లో సైతం తమ ఉనికి తెలియ కుండా అక్కడివారిలో చాకచక్యంగా కలిసిపోయి కీలక సమాచారాన్ని పొందవలసి రావొచ్చు. ఈ బాధ్యతల క్రమంలో ఒక్కోసారి ప్రాణాలకు కూడా ముప్పు రావొచ్చు. విదేశాల్లో తమ కోసం పని చేస్తూ పట్టుబడినవారిని రక్షించటం అమెరికావంటి అగ్రరాజ్యాలకు పెద్ద కష్టం కాదు. మనలాంటి దేశాలకు మాత్రం అసాధ్యం. అందుకే చేసింది ఇసుమంతైనా ఘనంగా చాటుకునే ఉబలాటం వుండేవారికి, తమ కోసమే ఎక్కువ ఆలోచించేవారికి ఆ సంస్థలు సరిపడవు.


సవరించిన నిబంధనలు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను పూర్తిగా కాలరాస్తున్నాయని చెప్పడానికి లేకుండా వాటిని రూపొందించినవారు జాగ్రత్తపడ్డారు. రిటైరైనవారు పుస్తకాలు రాయొద్దని ఆ నిబం ధనలు శాసించటం లేదు. అలా రాసినవాటిని ముందుగా అందజేసి అనుమతి తీసుకోవాలంటు న్నాయి. కానీ ఇలా ఉదారంగా కనబడుతున్న నిబంధలతో కొన్ని ఇబ్బందులున్నాయి. రిటైరైనవారి స్థానంలో వచ్చిన కొత్తవారు సాధారణంగా వారికి జూనియర్లే అయివుంటారు. గతంలో వారిద్దరి మధ్య వున్న సంబంధాల ప్రభావంతో పుస్తకంపై తుది నిర్ణయం తీసుకోవటంలో జాప్యం చేయొచ్చు. పాలకులకుండే అభ్యంతరాలు సరేసరి. అలాంటి పరిస్థితి ఏర్పడితే ఆ రిటైరైన ఉన్నతాధికారికి దిక్కేది? ఆయన మొర ఆలకించేదెవరు? ఎన్నాళ్లు ఎదురుచూసి, ఆయన కోర్టుకు పోవచ్చు? సహజం గానే నిబంధనల్లో వీటికి జవాబులు దొరకవు. రిటైరైనవారు ఇష్టానుసారం అన్నీ తేటతెల్లం చేస్తే దేశ భద్రతకు ముప్పు కలగదా అని ప్రశ్నించేవారుంటారు. దీర్ఘకాలం అంకితభావంతో పనిచేసి, సంస్థ లకు వన్నె తెచ్చినవారిని అలా ఆలోచించటం అన్యాయమే అవుతుంది. పాలకులు చెప్పింది చేయడం, వారి మెప్పు పొందటానికి ప్రయత్నించటం కాక... వారికి, దేశానికి ఏది గరిష్టంగా మేలు చేస్తుందో అంచనాకట్టి చెప్పటం అందరికీ సాధ్యం కాదు. అలా చెప్పేవారిలో కూడా తమ అనుభ వాలకు రూపుకట్టాలని, సంస్థ ఉన్నతికి దోహదపడాలని ఆలోచించేవారు తక్కువ. అలా అనుకునే వారిలో కూడా ఏ కొద్దిమందో రాయగలుగుతారు.


అమెరికా, బ్రిటన్‌ వగైరాల్లో రిటైరైనవారు జ్ఞాపకాలను అక్షరబద్ధం చేయడం సర్వసాధారణం. మన దగ్గర అధికార చట్రాల్లో మౌలికంగానే పారదర్శకత తక్కువ. అలాంటిచోట దీర్ఘకాలం సేవలందించినవారు ఆ బాణీలోనే వుంటారు. అందుకే రచయితలైన మాజీ ఉన్నతాధికారులు చాలా స్వల్పం. బి. రామన్‌ (ద కావో బాయిస్‌ ఆఫ్‌ రా), ఏఎస్‌ దులత్‌ (ద స్పై క్రానికల్స్‌), శంతను సేన్‌ (కరప్షన్, సీబీఐ అండ్‌ ఐ... సీబీఐ ఇన్‌సైడర్‌ స్పీక్స్‌), జోగిందర్‌ సింగ్‌ (ఇన్‌సైడ్‌ సీబీఐ), బీఆర్‌ లాల్‌ (హూ ఓన్స్‌ సీబీఐ), డీడీ అగర్వాల్‌(సీబీఐ అండ్‌ పోలిసింగ్‌ ఇన్‌ ఇండియా)లాంటివారు కనబడ తారు. వీరిలో దులత్‌ కొంత ముందుకెళ్లారు. ఆయన పాకిస్తాన్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ మాజీ చీఫ్‌ అసద్‌ దురానీతో కలిసి ‘ద స్పై క్రానికల్స్‌’ రాశారు. దులత్‌ మాటేమోగానీ... పాక్‌లో ఆ తర్వాత దురానీకి సమస్యలెదురయ్యాయి. మనదగ్గర తాజా సవరణలకు దురానీ పుస్తకమే ప్రేరణ కావొచ్చు. అమెరికా వంటి దేశాల్లో నిర్ణీత కాలవ్యవధి తర్వాత అధికార రహస్యాలు బయటపెట్టొచ్చన్న నిబంధ నలున్నాయి. కానీ మన దగ్గర అటువంటిదేమీ లేదు. మన దేశ చరిత్రలో దశాబ్దాలక్రితం భద్రతా పరంగా ఎంతో ఉత్కంఠ రేపిన ఉదంతాల్లో కూడా వాస్తవాలేమిటో ఈనాటికీ తెలియదు. ప్రస్తుత నిబంధనలే అనేక విధాల ఆటంకాలవుతున్నాయంటే తాజా సవరణలు వాటి పరిధిని మరింత విస్తృతం, జటిలం చేశాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే పింఛన్‌ ఆపేస్తామని హెచ్చరించటం దీర్ఘకాలం చిత్తశుద్ధితో పనిచేసినవారిని, వారి సేవలను అవమానించటమే. భావవ్యక్తీకరణకు ఆటంకాలు కల్పించటమే. ఇలాంటి వైఖరి ప్రజాస్వామిక దేశంగా మన ప్రతిష్టను దిగజారుస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement