ఆదమరిచివున్న ఉద్ధవ్ ఠాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) సర్కారును నిరుడు జూలై మొదటివారంలో పడగొట్టి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన శివసేన చీలిక వర్గం నాయకుడు ఏక్‌నాథ్ శిందే చివరకు పార్టీని, విల్లు–బాణం చిహ్నాన్ని కూడా సొంతం చేసుకున్నారు. ఆయన వర్గమే అసలు సిసలు శివసేన అని ఎన్నికల సంఘం శనివారం ధ్రువీకరించి ఓ పని పూర్తిచేసింది. సర్కారు పతనమైనప్పుడు జరిగిన రాజకీయ పరిణామాలకు సంబంధించిన వివాదాన్ని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలా లేదా అనే అంశంలో సుప్రీంకోర్టులోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ సాగిస్తుండగానే ఎన్నికల సంఘం నిర్ణయం వెలువడింది. దీంతో ముడిపడివున్న ఇతర అంశాలు సుప్రీంకోర్టు తేల్చవలసివున్నందున ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వాయిదా వేయాలన్న ఉద్ధవ్ వర్గం వినతి వీగిపోయింది.
పార్టీ ఎమ్మెల్యేలు 55 మందిలో 40 మంది.. 18 మంది ఎంపీల్లో 13 మంది శిందే వర్గంలో ఉన్నందువల్ల ఆ వర్గంవైపే మెజారిటీ ఓటర్లున్నట్టని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. ఉద్ధవ్ ఠాకరే వర్గం కోరినట్టు పార్టీ నియమావళి జోలికి పోనవసరం లేదని నిర్ణయించింది. అసమ్మతిని సకాలంలో పసిగట్టలేకపోవటం, తిరుగుబాటు ఎమ్మెల్యేల మనోభావాలేమిటో, వారు కోరుకుంటున్నదేమిటో గుర్తించి ప్రభుత్వాన్ని కాపాడుకోలేకపోవటం ఉద్ధవ్ చేతకానితనమే. అయితే రాజకీయాలపై కనీస అవగాహన ఉన్నవారు సైతం ఎన్నికల సంఘం నిర్ణయంలోని మతలబును అర్థం చేసుకోలేరు. శివసేన అధినేత బాల్ ఠాకరే కన్నుమూశాక పార్టీ పగ్గాలు ఉద్ధవ్ చేతికొచ్చాయి. ఆయన నేతృత్వంలోనే 2019 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని శివసేన పోటీచేసింది. అనంతర పరిణామాలలో సీఎం పదవిని తొలి దఫాలో తమకు ఇవ్వటానికి నిరాకరించినందుకు ఎన్‌సీపీ, కాంగ్రెస్‌లతో చేతులు కలిపి ఎంవీఏ కూటమి సర్కారును ఏర్పాటుచేసింది. ఈ క్రమంలో ఎక్కడా ఏక్‌నాథ్ శిందే స్వరం వినబడింది లేదు. ఉద్ధవ్ ఆశీస్సులతో ఆయన మంత్రి అయ్యారు. ఇంత స్పష్టంగా కనబడుతుండగా కొంతమంది ఎమ్మెల్యేలనూ, ఎంపీ లనూ కూడగట్టుకున్నంత మాత్రాన పార్టీ ఆయనకే దక్కడమేమిటి? అసెంబ్లీలో ఉండే బలాబలాలే ప్రభుత్వ భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి.
సంఖ్యాబలం ఎవరికి అధికంగా ఉంటే వారిదే ప్రభుత్వం అవుతుంది. అసలు ఎమ్మెల్యేలు ప్రలోభపడి తమ రాజకీయ అభిప్రాయాలనూ, విశ్వాసాన్నీ వీడినంత మాత్రాన ఓటర్లు సైతం ఆ బాటే పట్టారని నిర్ధారణకు రావటం ఏం సబబు? ఇంతక్రితం పార్టీ వేరు...లెజిస్లేచర్ పార్టీ వేరు అనే విభజన ఉండేది. లెజిస్లేచర్ పార్టీలో జరిగే పరిణామాల ప్రభావం పార్టీపై ఉండేది కాదు. 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని హస్తగతం చేసుకున్న చంద్రబాబునాయుడు ఆ తర్వాత కూడా పార్టీనీ, పార్టీ గుర్తునూ కూడా కొల్లగొట్టారు. న్యాయస్థానాలు సైతం చంద్రబాబు నీతిమాలిన చర్యకు వత్తాసు పలకటం అప్పట్లో దేశవ్యాప్తంగా అందరినీ దిగ్భ్రాంతిపరిచింది. 60వ దశకంలో ఇందిరా గాంధీ హయాంలో కాంగ్రెస్‌లో చీలిక వచ్చినప్పుడు ఏ వర్గం అసలైందో తేల్చటానికి మూడు గీటురాళ్లు నిర్ధారించారు. ఆ మూడూ– పార్టీ నియమావళి ఏం చెబుతుందో చూడటం, పార్టీలో మెజారిటీ పక్షం ఎవరివైపుందో తెలుసు కోవటం, చట్టసభలో అధికసంఖ్యాకులు ఎవరివైపున్నారో నిర్ధారించుకోవటం. 1996లో బాల్ ఠాకరే నాయకత్వంలో పార్టీ ఆమోదించిన నియమావళిపై 1999లో ఎన్నికల సంఘం అభ్యంతరాలు వ్యక్తం చేసిందని, కానీ ఉద్ధవ్ 2018లో ఆ నిబంధనలే తిరిగి తెచ్చారని ఎన్నికల సంఘం ఇప్పుడంటున్నది. కొద్దిమంది గుప్పెట్లో అధికారాన్ని కేంద్రీకృతం చేసే ఆ నిబంధనలు అప్రజాస్వామికమని చెబుతోంది. అయితే 2019 ఎన్నికలకు ముందుగానీ, ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డాకగానీ ఆ విషయంలో ఎన్నికల సంఘం ఎందుకు మౌనంగా ఉందో అర్థంకాదు.
శివసేనలో చీలిక వెనక కేంద్రంలోని ఎన్‌డీఏ కూటమి సర్కారుకు నాయకత్వంవహిస్తున్న బీజేపీ ఆశీస్సులున్నాయన్నది బహిరంగ రహస్యం. అసమ్మతి చిచ్చు రగిల్చినప్పుడే శిందే తన వర్గం ఎమ్మెల్యేల శిబిరంలో ఈ మాట చెప్పారు. ఇప్పుడు ఎన్నికల సంఘం నిర్ణయం వెలువడ్డాక కూడా ఆ మాటే మరోసారి అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన వెనక కొండలా నిలబడతానని భరోసా ఇచ్చారని, దాన్ని నిలబెట్టుకున్నారని ఒక కార్యక్రమంలో చెప్పారు. తమనుంచి పార్టీనీ, గుర్తునూ కొల్లగొట్టేందుకు రూ. 2,000 కోట్ల ఒప్పందం జరిగిందన్న శివసేన ఉద్ధవ్ వర్గం నాయ కుడు సంజయ్ రౌత్ చేసిన ప్రకటనకు పెద్దగా విలువనివ్వాల్సిన అవసరం లేదు. సాక్ష్యాధారాల్లేకుండా మాట్లాడితే ఎవరూ విశ్వసించరు. ఆ మాటెలావున్నా వివాదానికి సంబంధించిన అనేక అంశాలు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నాయి గనుక అప్పటివరకూ ఎన్నికల సంఘం తన నిర్ణయాన్ని వాయిదా వేసివుంటే బాగుండేది. బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికలు ముంగిట్లో ఉన్నందున విల్లు–బాణం శిందేకు అప్పగించి ఆయనదే నిజమైన శివసేన అనే అభిప్రాయం కలిగించటానికి ఈసీ తహతహలాడిందని ఉద్ధవ్ వర్గం ఆరోపిస్తోంది. అందులో నిజానిజాల మాటెలా వున్నా ఇన్నేళ్ల అనుభవాల్లో ఫిరాయింపుల చట్టం ఎంత లోపభూయిష్టంగా ఉన్నదో తెలుస్తున్నది గనుక దాన్ని సవరించి మరింత సమగ్రమైన చట్టం తీసుకురావాలి.
Comments
Please login to add a commentAdd a comment