ఉజ్జయిని: ఈ వారం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో, దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన రెండు వేర్వేరు ఉదంతాలు మన సమాజం ఉనికిని ప్రశ్నిస్తున్నాయి. ఇక్కడ మానవత్వం ఉందా, కన్నుమూసిందా అన్న సందే హాన్ని రేకెత్తిస్తున్నాయి. ఉజ్జయిని నగర వీధుల్లో మొన్న సోమవారం ఉదయం ఒంటిపై సరైన బట్టలు కూడా లేకుండా నెత్తురోడుతున్న పన్నెండేళ్ల బాలిక తనను కాపాడాలంటూ ఇల్లిల్లూ తిరిగి విన్నవించుకున్నా ఒక్కరంటే ఒక్కరు స్పందించలేదు.
ఇలా రెండున్నర గంటలు గడిచి ఆమె స్పృహ కోల్పోయి రోడ్డుపై పడిపోగా ఒక ఆశ్రమం నుంచి బయటికొస్తున్న యువకుడు గమనించి చొరవ తీసుకున్నాడు. తన పైపంచె తీసి కప్పి ఆమెను ఆసుపత్రిలో చేర్చి పోలీసులకు సమాచారం అందించాడు. ఆమెపై అత్యంత దారుణంగా అత్యాచారం జరిగిందని వైద్య పరీక్షలో తేలింది. బహుశా ఆ యువకుడు కూడా స్పందించకపోయి వుంటే రక్తస్రావంతో ఆమె మరణించేది కూడా.
ఎందుకంటే అత్యాచారం చేసిన దుర్మార్గుడు ఆమె అవయవాలను తీవ్రంగా గాయపరిచాడు. గర్భాశయానికైతే అత్యవసరంగా శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది కూడా. దశాబ్దం క్రితం ఢిల్లీలో నిర్భయ అనుభవించిన నరక యాతననే ఈ బాలిక కూడా చవిచూసింది. తాను ఉజ్జయిని ఎలా చేరిందో చెప్పలేని స్థితిలో ఉంది. బాలిక తప్పిపోయిందని అంతక్రితం ఆమె తాత సాత్నాలో ఫిర్యాదు చేశాడంటున్నారు. ఉజ్జయినికి 720 కిలోమీటర్ల దూరంలోని సాత్నా నుంచి ఆ బాలికను తరలించిందెవరు అన్నది ఇంకా తేల్చాల్సి వుంది.
ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడితోపాటు మరో అయిదు గురిని అరెస్టు చేశారు. దేశ రాజధాని నగరంలో మంగళవారం జరిగిన ఉదంతం కూడా అమాను షమైనది. ప్రసాదం దొంగిలించాడన్న అనుమానంతో మతిస్థిమితం లేని ఒక ముస్లిం యువకుణ్ణి అందరూ ఏకమై కరెంటు స్తంభానికి కట్టి, తీవ్రంగా కొట్టి ప్రాణం తీశారు. ఒంటినిండా గాయాలతో తీవ్ర రక్తస్రావమై అతను మరణించాడని శవపరీక్షలో తేలింది. ఈ ఉదంతంలో అరెస్టయిన ఏడు గురూ పాతికేళ్ల లోపువారే కాగా, అందులో ఒకడు మైనర్. ఈ రెండు ఉదంతాల్లోనూ సమాజం ప్రేక్షక పాత్ర వహించింది. బాధితులను ఆదుకోవాలన్న స్పృహ లేకుండా ప్రవర్తించింది.
ఉజ్జయిని నగరానికి ఉజ్వల చరిత్ర వుంది. ఒకనాడది వైభవోపేతంగా వర్ధిల్లిన సాంస్కృతిక కేంద్రం. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దంలో మౌర్య చంద్రగుప్తుడి విశాల సామ్రాజ్యంలో భాగం. తన తండ్రి బిందుసారుడి కాలంలో అశోకుడు స్వయంగా పర్యవేక్షించిన ప్రాంతం. నాలుగో శతాబ్దంలో రెండో చంద్రగుప్త విక్రమాదిత్యుడి రాజధాని. అది కాళిదాస మహాకవీంద్రుడు నడయాడిన నేల. అక్కడే శూద్రకుడు, ధన్వంతరి, వరరుచి, వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు వంటివారు వివిధ శాస్త్రాల్లో ఉద్దండ పండితులుగా ప్రఖ్యాతి గడించారు.
అంతటి గొప్ప చరిత్ర కలిగినచోట పట్టపగలు నగర వీధుల్లో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఒక బాలిక కాపాడమని అర్థిస్తే ఆడ, మగ అందరూ తలుపులేసుకున్నారంటే... పదో పరకో ఇచ్చి తమ అపరాధ భావనను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించారంటే ఎలాంటి వారికైనా మనసు వికలమవుతుంది.
రోడ్డు ప్రమాదాలు జరిగి నప్పుడు బాధితులను ఆసుపత్రికి తరలించటానికీ, కనీసం పోలీసులకు ఫోన్ చేసి చెప్పటానికీ ఎవరూ ముందుకు రాకపోవటం తరచు గమనిస్తూనే ఉంటాం. చట్టపరమైన ఇబ్బందుల్లో చిక్కుకుంటామనీ, కోర్టుల చుట్టూ తిరగాల్సివస్తుందనీ ఇప్పటికీ అనేకులు వెనకడుగేయటం కనబడుతూనే ఉంటుంది. కానీ అర్ధనగ్న స్థితిలో ఆపన్నహస్తం కోసం ఎదురుచూసిన బాలికకు వైద్య సాయం అందేలా చూడటం సంగతి అటుంచి కనీసం ఒంటిని కప్పుకోవటానికి బట్టలిచ్చేందుకు కూడా ఎవరూ సిద్ధపడకపోవటం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఈ అమానవీయతకు సీసీ టీవీ కెమెరాలు సాక్ష్యంగా నిలిచాయి.
సమాజం మొత్తాన్ని కాపలా కాయటం ఏ ప్రభుత్వానికైనా అసాధ్యమన్నది వాస్తవం. లక్షల్లో జనాభా ఉండేచోట వందల్లో మాత్రమే రక్షకభటులుంటారు. అయితే ఉన్న ఆ కొద్దిమందీ కూడా కొన్ని సందర్భాల్లో నేరగాళ్లకు సాయపడుతున్నారనీ, రాజకీయ ప్రాపకం కోసం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనీ ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నారు. రెండున్నర గంటలపాటు ఆ బాలిక ఎక్కడో మారుమూల పల్లెటూరులో కాదు... కేంద్రం స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తున్న నగర వీధుల్లో అత్యంత దారుణమైన పరిస్థితుల్లో సంచరిస్తున్నప్పుడు ఒక్క కానిస్టేబులైనా ఆమెను గమనించి ఆదుకోలేకపోవటం పోలీసుల పనితీరును పట్టిచూపిస్తోంది.
ఇక గోవధ జరిగిందనో, జరగబోతున్నదనో అనుమానంతో కొందరు దుండగులు మారణాయుధాలతో దాడిచేసి చంపుతున్న ఉదంతాల్లో నేరగాళ్లకు ప్రభుత్వాల ఆశీస్సులుంటున్న సంగతి బహిరంగ రహస్యం. కానీ సమాజం ఏమై పోతోంది? పట్టపగలు కళ్లెదుట జరుగుతున్న దురంతాలపై కూడా కనీస స్పందన కొరవడటం, సహానుభూతి వ్యక్తం కాకపోవటం ఏమిటి? ఎన్నికల్లో ఓటేయటంతోనే పౌరులుగా తమ బాధ్యత తీరిందని జనం అనుకుంటున్నారా? కుల మత చట్రాల్లో, రాజకీయ రొదలో కూరుకుపోయి మనుషు లుగా తమ నైతిక బాధ్యతను విస్మరిస్తున్నారా? ఎవరికి వారే ప్రశ్నించుకోవాలి. ఆపత్సమయాల్లో మానవీయతను ప్రదర్శించటం, సహానుభూతి వ్యక్తపరచటం, బాధితులకు అండగా నిలవటం మనుషుల కనీస లక్షణాలని తెలుసుకోలేని సమాజం శవప్రాయమైనది. అలాంటిచోట ఎవరికీ రక్షణ ఉండదు. సమాజం సంఘటితంగా ఉన్నప్పుడే, అన్యాయాన్ని ప్రశ్నించే తత్వాన్ని ఒంటబట్టించు కున్నప్పుడే ఇలాంటి దురంతాలకు అడ్డుకట్ట పడుతుంది.
ఇదీ చదవండి: అర్ధనగ్నంగా రక్తమోడుతూ
Comments
Please login to add a commentAdd a comment