యోగ్యతా పత్రం!  | Vardhelli Murali Article On AP Local Body Election Results | Sakshi
Sakshi News home page

యోగ్యతా పత్రం! 

Published Sun, Mar 21 2021 4:32 AM | Last Updated on Sun, Mar 21 2021 10:35 AM

Vardhelli Murali Article On AP Local Body Election Results - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత కొందరు రాజకీయ జీవులు చేస్తున్న ఒక కామెంట్‌ మీద కొంత చర్చ జరగవలసిన అవసరం ఉంది. జగన్‌ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు జనంలోకి బాగానే వెళ్లాయి. ఫలితాల్లో వాటి ప్రభావం కనిపించిందని వారు విశ్లేషిస్తున్నారు. ఈ విశ్లేషకుల్లో కొందరు రాజకీయంగా జగన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకులు.

కొందరు సానుభూతిపరులు, తటస్థులు కూడా ఉన్నారు. ఈ తరహా కామెంట్లు వింటున్నప్పుడు చలం గుర్తుకొచ్చాడు. శ్రీశ్రీ మహాప్రస్థానం పుస్తకానికి ఆయన రాసిన యోగ్యతా పత్రం గుర్తుకొచ్చింది. అందులో చలం ఒక హెచ్చరిక చేస్తాడు. ఈ పుస్తకం మీద కవి అనేవాడి అభిప్రాయం మాత్రం అడగొద్దం టాడు. అడిగితే పాజిటివ్‌గానే స్పందిస్తారట. శ్రీశ్రీ బాగానే రాశాడు. అభివృద్ధిలోకి వస్తాడని కూడా అభినందిస్తారట. కానీ అది ప్రమాదకరమైన అభినందన. ఆకాశం ఎత్తున ఉన్న శ్రీశ్రీ వీపుమీద తట్టడానికి ప్రయత్నిస్తారు తస్మాత్‌ జాగ్రత్త అంటాడు చలం.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల విజయాల మీద కొందరి ‘పాజిటివ్‌’ స్పందన కూడా ఇటువంటిదే. సంకుచిత అర్థంలో వాళ్లు ‘సంక్షేమ’ లేబుల్‌ను ప్రభుత్వానికి అంటించాలని చూస్తు న్నారు. సంక్షేమ పథకాలంటే వాళ్ల ఉద్దేశంలో కొంతమందికి పెన్షన్లు ఇవ్వడం. కొందరికి బర్రెలో గొర్రెలో ఇవ్వడం. కొంత మంది ఖాతాల్లో డబ్బులు జమచేయడం. వాటి ద్వారా ఓట్లు రాబట్టడం... అంతే.

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలుచేస్తున్న విప్లవాత్మక కార్యక్రమానికీ, విశ్లేషక పుంగవులు అంటిస్తున్న సంక్షేమ లేబుల్‌కూ ఎటు వంటి సంబంధం లేదు. ‘శ్రీశ్రీ కవిత్వం గురించి తెలుసుకోవాలంటే స్వయంగా చదవండి. ఆయన్ని చూడాలని పిస్తే స్వయంగా చూడండి. కవి అనేవాడిని మాత్రం అడ క్కండ’ని చలం హెచ్చరించాడు. అదేవిధంగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమం తెలుసుకోవాలంటే స్వయంగా జనజీవితాలను చదవండి. కానీ, విశ్లేషకుడన్నవాడిని మాత్రం అడక్కండి. వాడు మండే సూర్యుడికి కూడా ఫర్వాలే దంటూ పాస్‌మార్కులు వేయగలడు. వాడు ఆకాశాన్ని అగ్గి పెట్టెలో బంధించి చూపెట్టగలుగుతాడు... జాగ్తేరహో!

చారిత్రక కారణాల ఫలితంగా అభివృద్ధి పథంలో వెనుక బడిపోయి, అణగారిపోతున్న వ్యక్తులను వర్గాలను గుర్తించి చేయూతనిచ్చి, వారిని పోటీ ప్రపంచంలో నిలబెట్టే ఒక మాన వీయ అభివృద్ధి ఎజెండాను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేపట్టింది. విస్తృతమైన ప్రజా సంపర్కం కారణంగా ఇటువంటి అభివృద్ధి మోడల్‌ను రచించడం ఆయనకు సాధ్యమైంది. ఎక్కువమంది ప్రజలతో ముఖాముఖి సంభాషించిన రాజకీయ నేతల్లో అగ్ర స్థానం నిశ్చయంగా జగన్‌మోహన్‌రెడ్డిదే. కొన్ని లక్షలమందితో విడివిడిగా మాట్లాడిన ఏకైక నాయకుడు జగన్‌మోహన్‌ రెడ్డి.

ఓదార్పు, పాదయాత్రల సందర్భాలు ఆయనకు ఇందులో ఉపకరించాయి. బహిరంగ సభలూ, సమావేశాల ద్వారా సుమారు రెండున్నర కోట్లమందిని ఉద్దేశించి మాట్లాడి ఉంటారు. వేలాది పూరిగుడిసెల్లోకీ, ఆ గుడిసెల్లో నివసించే వారి గుండెల్లోకీ డైరెక్ట్‌గా ప్రవేశించిన ఘనత దేశ రాజకీయ చరిత్రలో ఒక్క జగన్‌మోహన్‌రెడ్డికే దక్కింది. ఆ చేతుల్ని తాకిన ఆత్మీయ స్పర్శలు అనంతం. ఆ కళ్లు చూసిన కన్నీటి చెలమలు అసం ఖ్యాకం. ఆ చెవినపడిన జీవన పోరాట గాథలు వేనకువేలు. ఇంతటి సుసంపన్నమైన ప్రజా సంబంధాలు ఆయన రాజకీయ పథానికి ఒక తాత్విక భూమికను సమకూర్చాయి.

ప్రభుత్వం నుంచి ప్రజలు కోరుకునేదేమిటో ఆయనకు ఈ క్రమంలోనే అవగతమైంది. ప్రభుత్వం ఏమి చేస్తే ప్రజా జీవితాలు ప్రగతి మార్గం పడతాయో అర్థమైంది. ఈ అవగాహనతోనే ఎన్నికల మేనిఫెస్టోను ఆయన తయారు చేసుకున్నారు. కోటి ఆశల ఉచ్ఛ్వాసనిశ్వాసలు ఆ మేనిఫెస్టోలోని అక్షరాలు. తిలక్‌ చెప్పి నట్టు ‘ఆ అక్షరాలు కన్నీటి జడులలో తడిసిన దయాపారావ తాలు’. అందుకే ఆ మేనిఫెస్టోకి ఒక పవిత్ర హోదాను కల్పిం చారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్‌ల సరసన చేర్చారు.

అధికారంలోకి వచ్చిన ఇరవై మాసాల్లోనే మేనిఫెస్టోలోని అంశాలను దాదాపు 90 శాతానికి పైగా అమల్లోకి తెచ్చారు. మేని ఫెస్టోలో చెప్పని అంశాలను కూడా మరికొన్నింటిని జోడించి అభివృద్ధి కార్యక్రమానికి ఒక సమగ్రతను కల్పించారు. ఇరవై రెండు మాసాల్లో ఎన్నో అడ్డంకులను అధిగమించి మరీ జగన్‌ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలుచేసింది.

ప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్‌ సంక్షోభం సగం కాలాన్ని కబళించింది. ఆర్థిక తడబాట్లు ఎదురయ్యాయి. రాజకీయ దాడులు పెరిగాయి. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రత్యర్థులు ప్రయత్నాలు చేశారు. రాజ్యాంగ వ్యవస్థలను అడ్డంగా వాడుకొని చికాకులు పెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. ప్రధాన ప్రత్యర్థి మాత్రం తాను చేసిన పాపాలకు అలవాటు ప్రకారం స్టేలు తెచ్చుకుంటూనే ఉన్నారు. 99 స్టేలు తెచ్చుకున్న తర్వాత కూడా శిశుపాలునికి శిరచ్ఛేదన శిక్ష తప్పలేదన్న విషయాన్ని ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారు.

22 నెలల ఆటుపోట్ల కాలం గడిచిన తర్వాత కూడా అధి కారంలో వున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓట్ల శాతాన్ని పెంచు కున్నది. మునిసిపల్‌ ఎన్నికల్లో ఆ పార్టీకి 52.65 శాతం ఓట్లు పడ్డాయి. ప్రభుత్వ విధానాల ఫలితంగా అభివృద్ధి బాటపట్టిన ప్రజల సంఖ్య పట్టణాల్లో కంటే పల్లెల్లోనే ఎక్కువ. పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరగడం వల్ల తెలియ లేదు కానీ, మునిసిపాలిటీలకంటే కచ్చితంగా ఎక్కువ ఓట్లే వచ్చి ఉంటాయి.

స్థానిక ఎన్నికల్లో పెద్దఎత్తున తలపడే స్వతంత్రు లను, అధికార పార్టీ రెబెల్‌ అభ్యర్థులనూ కూడా గమనంలోకి తీసుకుంటే పల్లెలు, పట్టణాలు కలిసి 55 శాతం ఓటు బ్యాంకు అధికార పార్టీకి దఖలు పడ్డట్టుగా పరిగణించవచ్చు. వర్తమాన రాజకీయ రంగంలో జాతీయ రాజకీయాల్లో కానీ, పెద్ద రాష్ట్రాల్లో కానీ యాభై శాతానికి మించిన ఓటుబ్యాంకు కలిగి ఉన్న రాజ కీయ నాయకుడు ఒక్క జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే. కంటి తుడుపు హామీల వల్లనో, ఓట్లకోసం ప్రకటించే ఫలహారం పథకాల వల్లనో ఈ విజయం రాలేదు. ప్రజలకు క్షీర–నీర న్యాయం తెలుసునని ఇప్పటికే పలుమార్లు రుజువయ్యింది.

జగన్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ఎజెండా తమ జీవితాల్లో మార్పులను తీసుకొని వస్తుందన్న విశ్వాసం ఉంది కనుకనే ప్రజలు ఈ విజయాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు అందజేశారు. పార్టీ అధినేత తాము అనుసరిస్తున్న అభివృద్ధి నమూనా అంత స్సారాన్ని ఒక్క వాక్యంలో చెప్పారు. ప్రజలందరికీ నిన్నటికంటే నేడు బాగుందనిపించడం, రేపు మరింత బాగుంటుందన్న నమ్మకం కలగడం–ఇదే అభివృద్ధికి గీటురాయి. బహుశా ప్రజలకు ఈ నమ్మకం కలిగింది కనుకనే పాలక పార్టీకి అపురూపమైన విజయాన్ని కట్టబెట్టారు. ఒంటి చేత్తో 55 శాతం ఓట్లను 90 శాతం స్థానాలను (పంచాయతీ+ మున్సిపాలిటీ సగటు) గెలుచుకోవడం ఈ దేశంలో ఒక రికార్డు. బహుళ రాజకీయ పార్టీలు రంగంలో ఉండే పార్లమెంటరీ ప్రజా స్వామ్య వ్యవస్థలో 50 శాతాన్ని దాటి ఓట్లు సాధించడం ఆషామాషీ కాదు.

ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన అనంతరం చైర్మన్, మేయర్‌ అభ్యర్థుల ఎంపికలో మరో సంచలనానికి జగన్‌ తెర తీశారు. ఎనభై శాతం అధ్యక్ష పీఠాలను ఆయన బలహీన వర్గాలకు కట్టబెట్టారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిపాలనా రంగాల్లో చేపట్టిన సంస్కరణల ద్వారా బడుగుల జీవితాల్లో అభివృద్ధి వెలుగులు నింపేందుకు చేస్తున్న కృషికి ఇది కొన సాగింపు. ఈ రాజకీయ సాధికార పరికల్పన వారిని మరింత బలోపేతం చేస్తుంది. బహుముఖీనమైన చేయూతతోనే బల హీనవర్గాల్లోని రాబోయే తరాలవారు మిగిలిన వారితో పోటీ పడగల స్థాయికి చేరుకుంటారన్న వ్యూహాత్మక కార్యక్రమంగా ఈ చర్య కనబడుతున్నది.

మొత్తం అధికార పీఠాల్లో అరవై శాతాన్ని మహిళలకు అప్పగించారు. అందులో ఎక్కువ మంది సాధారణ మహిళలు. కొన్ని కులాలు లేదా వర్గాలు తరతరాలుగా వెనుక బాటుతనానికీ, అణచివేతకూ గురయ్యార నేది ఒక వాస్తవం. అలాగే అన్ని కులాల్లోనూ, వర్గాల్లోనూ మహిళలందరూ సుదీర్ఘ కాలంపాటు అణచివేతకు గురయ్యారనేది కూడా మరింత వాస్తవం. ‘న స్త్రీ స్వాతంత్య్రమర్హతి’ అన్న మను శాసనం చాలా కాలం రాజ్యం చేసింది. చదువుకు దూరం చేసింది. ‘ముదితల్‌ నేర్వగరాని విద్యగలదే, ముద్దార నేర్పించినన్‌’ అని చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు ఆరోజుల్లోనే ప్రశ్నించాల్సి వచ్చింది.

‘స్త్రీకి కూడా శరీరం ఉంటుంది, దానికి వ్యాయామం ఇవ్వాలి. మెదడు ఉంటుంది, దానికి జ్ఞానం ఇవ్వాలి. హృదయం ఉంటుంది, దానికి అనుభవం ఇవ్వాలి’ అని చలం డిమాండ్‌ చేయవలసి వచ్చింది. ఇప్పుడిప్పుడే అభివృద్ధి పథంలోకి దూసు కొని వస్తున్న మహిళలను వేగంగా ఎంపవర్‌ చేయడమే లక్ష్యంగా అర్ధభాగాన్ని మించిన అధికారాన్ని కట్టబెట్టడం జరిగి ఉండవచ్చు.

కుల, మత, వర్గ, ప్రాంత, లింగభేదం లేకుండా ప్రజలం దరూ సమానమేనన్నది ప్రజాస్వామ్య మౌలిక సూత్రం. వెనుక బడిన వారందరూ సమానస్థాయిలో పోటీపడగల స్థితికి చేరు కోవడానికి చేయూతనివ్వాలనే ఉద్దేశాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాల ద్వారా అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. కానీ ఆచరణలో వేగంగా అడుగులు వేయలేకపోయారు. ‘అన్నార్తులు, అభాగ్యులుండని ఆ నవ యుగమదెంత దూరం?’ అన్న ప్రశ్న దశాబ్దాలుగా వినబడు తూనే ఉన్నది.

జాతీయ స్థాయిలోనో, రాష్ట్రస్థాయిలోనో బలమైన రాజకీయ నాయకత్వాలున్నప్పుడు కొన్ని అడుగులు పడు తున్నా మళ్లీ ప్రతిష్టంభన ఏర్పడుతున్నది. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారిని గుర్తించి, వారి సమగ్ర అభివృద్ధి అవసరమైన ఒక ఆచరణాత్మకమైన ఎజెండాను దేశంలోనే మొదటిసారిగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేపట్టింది. ఎటువంటి కులమత వైషమ్యాలు తలెత్తకుండా, వర్గ విభేదాలు ఏర్పడ కుండానే, బలహీనవర్గాలను ప్రోత్సహించే కార్యక్రమాన్ని సామరస్యపూర్వక వాతావరణంలో ప్రారంభించడం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయం. దీని సత్ఫలి తాలను రానున్న కొద్ది సంవత్సరాల్లో మనం చూడబోతాము. సమాజంలో సమస్త వ్యక్తులూ, శక్తులూ బలోపేతమైననాడే ఆ సమాజం ఆర్థిక, సాంఘిక, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురోగతిని సాధించగలుగుతుంది.

మనకాలపు మహా శాస్త్రజ్ఞుడు స్టీఫెన్‌ హాకింగ్‌ చెప్పిన మాట లను ఒకసారి గుర్తుచేసుకోవాలి. ‘భూగోళం నుంచి త్వరత్వరగా ఇతర గ్రహాలకు వ్యాపించకపోతే మానవజాతి మరో వెయ్యేళ్లకు మించి మనుగడ సాగించకపోవచ్చు’నని ఆయన హెచ్చరిం చారు. మనకన్నా మేధస్సు కలిగిన గ్రహాంతర వాసులు దండెత్తి వస్తేనో, ఊహించని ప్రకృతి విపత్తు ఏర్పడితేనో, భారీ శకలాలు ఢీకొంటేనో అంతకంటే ముందుగానే మానవజాతి అంత రించి పోవచ్చునట. మానవుడిని చిరంజీవిని చేసే లక్ష్యం నెరవేరా లంటే మానవజాతి ఒక్కతాటిపై నిలబడి శరవేగంగా శాస్త్ర పురోగతి సాధించాలి.

కాంతిని మించిన వేగంతో విశ్వభ్రమణం చేయగల సాధన సంపత్తిని సమకూర్చుకోవాలి. ‘ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై...’ అట్టి దేవదేవుడు ముందుగా ఫిజిక్స్‌ను సృష్టించాడట. దాని వారసురాలే కెమిస్ట్రీ. కెమిస్ట్రీ సంతానమే బయాలజీ. మన మాతృమూర్తి బయాలజీ. అందువల్ల మన ముత్తాతల తాత ఫిజిక్స్‌. నక్షత్ర ధూళి పరా వర్తన కాంతులమే మనమంతా.

ఆ కాంతులకు కులం లేదు, మతం లేదు, దేశం లేదు, ఎల్లలు లేవు. జన్మతః మనం విశ్వ మానవులం. ఈ అవగాహనతో ఒక్కటిగా నిలబడితే మానవ జాతి చిరకాలం వర్ధిల్లుతుంది. మన విజ్ఞానం, మన కళలూ, సాహిత్యం, సంగీతం అవిచ్ఛిన్నంగా గ్రహాంతరయానం చేస్తాయి. గెలాక్సీకరణ వేగంగా జరుగుతుంది. ఆరొందల యేళ్లు గడిచినా ఇప్పటికీ మనం అన్నమయ్య గీతాలను ఆలపిస్తూనే ఉన్నాము. మరో వెయ్యేళ్ల తర్వాత కూడా ‘అది రమ్మంటె రాదుర చెలియా... దాని పేరే సారంగధరియా’ అంటూ పాలపుంత గెలాక్సీలోని గ్రహాల్లో మన జానపదం ప్రతిధ్వనించాలి.
 


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement