వంద మేకల్నీ, గొర్రెల్నీ చంపి తినేసిన ఒక తోడేలు,.. నూటా ఒకటో మేకపిల్ల భయంతో పారిపోతుంటే ధైర్యం చెప్పిందట. నీకు నేను రక్షణగా ఉంటాను, భయపడకూ అని అభయ మిచ్చిందట. తోడేలు మాట మేకపిల్ల నమ్మేస్తే ఏమవుతుంది?
రాకెట్ వేగంతో అతి స్వల్పకాలంలోనే 54 ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడమో, మూసివేయడమో చేసి ప్రపంచ బ్యాంకు ప్రశంసలు పొందిన వ్యక్తి తెలుగుదేశం అధినేత చంద్ర బాబు. ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైన పీవీ నరసింహారావు సైతం చంద్రబాబు ‘ప్రైవేట్’ స్పీడ్‌కు ఆశ్చర్య చకితులయ్యారు. ఆయన ఒక సందర్భంలో మాట్లాడుతూ ‘ప్రైవేటీకరణ కోసం మేము కిటికీలు ఓపెన్ చేస్తే ఈ చంద్రబాబు తలుపులన్నీ బార్లా తెరిచేశాడయ్యా’ అన్నారు. ప్రైవేటీకరణకు బద్ధ వ్యతిరేకులైన కమ్యూనిస్టులు చంద్ర బాబుకు ప్రపంచబ్యాంకు జీతగాడు, ఐఎమ్‌ఎఫ్ దళారీ వంటి అనేక బిరుదులను ప్రసాదించి సత్కరించారు. ప్రైవేటీకరణ అనే విషయంలో ఇదీ చంద్రబాబు స్వభావం. స్వరూపం!
అటువంటి స్వభావం కలిగిన చంద్రబాబు ఈమధ్యన విశాఖపట్నం వెళ్లారు. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ వాళ్లకు అప్పగించే ప్రయత్నాల్లో ఉన్నదని వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రజల్లో ఆందోళన నెలకొని ఉన్నది. కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా నిరవధిక నిరాహారదీక్షలు చేస్తున్నాయి. ఈ రకంగా ప్రజలు తమంత తాము ఆందోళనకు దిగిన ప్రాంతాల్లో వెంటనే రాజకీయ జీవులు వాలిపోవడం సహజం. ఆ విధంగా వాలిన ఒక తెలుగుదేశం నాయకుడు ఆరు రోజులు నిరాహారదీక్ష చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించు కొని పార్టీ అధినేత కూడా అక్కడ వాలిపోయారు. పార్టీ కార్య కర్తల సమావేశంలో, కార్మికుల నిరాహారదీక్షా శిబిరం దగ్గర జరిగిన రెండు సమావేశాల్లో ఆయన మాట్లాడారు.
కార్యకర్తలతో జరిగిన సమావేశంలో మీ విశాఖపట్నం వాళ్లు పిరికివాళ్లు.. పిరికివాళ్లు అని సుమారు పదిమార్లు రెచ్చగొట్టారు. రెండు సమావేశాల్లోనూ తనను తాను ప్రైవేటీకరణ వ్యతిరేక చాంపియన్‌గా అభివర్ణిం చుకున్నారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను తానే అడ్డుకున్నానని చెప్పుకొచ్చారు. వాస్తవమేమిటంటే వాజ్‌పేయి జమానా నాటికి దేశంలో ప్రైవేటీ కరణ వ్యతిరేక శక్తులు బలంగానే ఉన్నాయి. విశాఖ ఉక్కు వంటి పెద్ద ఫ్యాక్టరీని ప్రైవేట్‌పరం చేస్తే వచ్చే వ్యతిరేకతకు జడిసి కేంద్రం వెనక్కు తగ్గింది. కానీ, చంద్రబాబు ఆ ఘనత తనదేనని ఖాతాలో వేసుకున్నారు. మీరంతా పోరాడండీ, నేను తోడుగా ఉంటానని సభలో ప్రకటించారు. వెంటనే సభలోంచి ‘మోదీ డౌన్‌డౌన్’ అనే నినాదాలు వినిపించాయి. విద్యుత్ వేగంతో వెన్నెముకలోంచి భయం ప్రవహించినప్పుడు ముఖ కవళికల్లో సంభవించే మార్పు ఆయనలో కనిపించింది. అసంకల్పిత ప్రతీ కార చర్య మాదిరిగా ‘ఏయ్, ఆగండయ్యా’ అని సభికులను గద్దించారు. కానీ పోరాడమంటారు, తాను వెంట ఉంటా నంటారు. కేంద్రంతో వద్దంటారు. ఎవరితో పోరాడాలి?.. ప్రైవే టీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మికులు ప్రైవేటీకరణ చక్రవర్తిగా పేరుగాంచిన చంద్రబాబు మాటలను విశ్వసిస్తే తోడేలు–మేకపిల్ల కథ గుర్తుకు రాకుండా ఉంటుందా?
విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు... 1966 ప్రాంతంలో తెలుగు నేల నలుమూలలా ప్రతిధ్వనించిన నినాదం. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ తేడాల్లేకుండా అన్ని ప్రాంతాల ప్రజలు వీధుల్లోకి వచ్చి ఉద్యమించిన అపురూప సందర్భం. ఆ అర వయ్యో దశకమే ప్రపంచ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. భూమధ్యరేఖపై విప్లవాల జెండా రెపరెపలాడిన రోజులు. ఉద్వేగం, ఉత్తేజం, ధిక్కారాల తీన్‌మార్‌లో యువతరం కవాతు చేసిన దశాబ్దం. ఓజోన్ పొర మాదిరిగా రివల్యూషనరీ రొమాం టిసిజమ్ భూగోళాన్ని కప్పివేసిన ఒకానొక కాస్మిక్ వండర్. అగ్గిపుల్ల వెలిగిస్తే దావానలమయ్యే రోజులు. నాటి సామాజిక స్వభావం విశాఖ ఉక్కు ఉద్యమాన్ని కూడా భాస్వరమై మండించింది. ఎదురు నిలిచిన తుపాకులను ఎగతాళి చేస్తూ ముప్పయ్ రెండు మంది అమరులయ్యారు. వేలాదిమంది లాఠీ దెబ్బలు తిన్నారు. జైళ్లపాలయ్యారు. పోరాటం ఫలించింది. కేంద్రం తలొగ్గింది. విశాఖ ఉక్కును ప్రకటించింది. నత్తవేగంతో కల సాకారమయ్యింది. 1981లో ఫ్యాక్టరీ ప్రారంభమైంది. మీడియా పెదవి విరిచింది. ‘ఇస్పాత్ నిగమ్ – రొంబ తమిళమ్’ అని పత్రికలు వ్యాఖ్యానించాయి. తెలుగువాళ్ల పోరాటంతో ఏర్పడ్డ ఫ్యాక్టరీ పేరు హిందీలో పెట్టారు, కీలక స్థానాలను తమిళులు ఆక్రమించారన్న అభిప్రాయాన్ని పత్రికలు ఆరకంగా వ్యక్తం చేశాయి. ప్రైవేట్ బ్యాంకులను ప్రభుత్వం జాతీయం చేసింది కూడా అరవయ్యో దశకంలోనే. కీలక పరిశ్రమలను ప్రభుత్వరంగం ఆక్రమించడం శరవేగంతో కొనసాగింది. రాజ భరణాలను (privy purses) రద్దు చేశారు. భూసంస్కరణలకు బీజం పడింది కూడా ఆరోజుల్లోనే. నాటి ఆలోచనలూ, ఆర్థిక విధానాలు ఇప్పుడు పూర్తిగా తలకిందులయ్యాయి.
ఉద్దేశపూర్వకమో లేక దాని సహజ లక్షణమో తెలియదు గానీ, ఎనభయ్యో దశకం నాటికి మన మిశ్రమ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఒడిదుడుకులకు లోనయ్యింది. తొంభయ్యో దశకం ప్రారంభం నాటికి విదేశీ చెల్లింపులకు మారకం నిధులు లేక బంగారం తాకట్టు పెట్టే దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో భారత ప్రధానిగా పీవీ నరసింహారావు బాధ్యతలు చేపట్టారు. సునిశిత మేధావి, దార్శనికుడైన పీవీ దేశ ఆర్థిక స్థితిని పూర్తిగా అవగతం చేసుకున్నారు. ప్రసిద్ధ ఆర్థికవేత్త, ఆర్‌బీఐ గవర్నర్‌గా పనిచేసిన మన్‌మోహన్‌సింగ్‌ను ఆర్థికమంత్రిగా నియమించు కున్నారు. ఒక నియంత్రిత విధానంతో ఆర్థిక సంస్కరణలను ప్రారంభించారు. ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించారు.
అదే సమయంలో పశ్చిమ దేశాల బహుళజాతి వ్యాపార సంస్థలకు ప్రపంచం మొత్తం మార్కెట్‌గా అందుబాటులోకి రావలసిన అవసరం ఏర్పడింది. వర్ధమాన దేశాలు నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. వాటికి అప్పులివ్వడానికి బహుళజాతి వ్యాపార సంస్థల ఆశీస్సులతో ఏర్పడిన ప్రపంచ బ్యాంకు, ఐఎమ్‌ఎఫ్ తదితర సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. కానీ, షరతులు వర్తిస్తాయి. ఈ షరతుల్లో అవమానకరమైనవి కూడా ఉంటాయి. చిన్నచిన్న దేశాలతో వ్యవహరించినప్పుడు ఆ షర తులు చాలా అమానుషంగా ఉంటాయి. ఒప్పుకోని దేశాలను ఒప్పించడానికి దళారులుంటారు. దళారుల వల్ల కూడా కాని ఒప్పందాలకు సీఐఏ రంగంలోకి దిగేది. అది రంగంలోకి దిగిన ఫలితంగా లాటిన్ అమెరికాలో ఇద్దరు దేశా ధ్యక్షులు విమాన ప్రమాదాల్లో చనిపోయారు. బలవంతంగా అప్పులు తీసుకునే కార్యక్రమానికి అడ్డువచ్చిన వ్యక్తులను, వ్యవస్థలను అడ్డుతొలగించడం, ఒప్పందాలను కుదర్చడం దళారుల బాధ్యత. ప్రపంచబ్యాంకు తరఫున ఈ పనులన్నీ చేసి పదవీ విరమణ తర్వాత పశ్చాత్తాపంతో జాన్ పెర్కిన్స్ అనే అమెరికన్ 'Confessions of an economic hitman' అనే పుస్తకాన్ని రాశారు. తన చేతులకంటిన రక్తాన్ని ఈ పశ్చా త్తాపంతో కడిగేసుకునే ప్రయత్నం చేశారు. ‘ఒక దళారీ పశ్చా త్తాపం’ పేరుతో కొణతం దిలీప్ ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. విశేష పాఠకాదరణ పొందిన పుస్తకం ఇది. వ్యతిరేకులను శిక్షించడమే కాదు సహకరించిన వాళ్లను సత్క రించడం కూడా ఈ అప్పుల స్కీమ్‌లో ఉంది. అలా సత్కారాలు పొందిన భారతీయుల్లో ప్రముఖుడు చంద్రబాబునాయుడు. ఆయనను గొప్ప విజినరీగా బహుళజాతి సంస్థల ఏజెంట్లు ప్రచారంలో పెట్టారు.
1999లో రెండోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన దగ్గర్నుంచీ 2004లో గద్దె దిగేలోపు ఐదేళ్లలో 54 ప్రభుత్వరంగ సంస్థలను చంద్రబాబు ప్రభుత్వం చప్పరించేసింది. సుమారుగా నెలకొక ప్రభుత్వరంగ సంస్థను చిదిమేశారు. ఇందులో 14 సహకార చక్కెర ఫ్యాక్టరీలున్నాయి. వాటిమీద ఆధారపడిన వేలాదిమంది రైతులను సంక్షోభంలోకి నెట్టారు. వాళ్లకు చెల్లిం చవలసిన కోట్లాది రూపాయల బకాయిలను ఎగవేసి మరీ వాటిని నిర్వీర్యం చేశారు. కొన్నింటిని తన బినామీలకు కారుచౌకగా కట్టబెట్టారు. రిపబ్లికన్ ఫోర్జ్ కంపెనీ ఊపిరి తీసి నగరం నడిబొడ్డున ఆ ఫ్యాక్టరీకి ఉన్న వందలాది ఎకరాల విలువైన భూములను తన బినామీలకూ అనుయాయులకూ పప్పుబెల్లాల్లా పంచేశారు. ఆల్విన్ వాచెస్‌ను మూసేసి వేల కుటుంబాలను వీధిన పడేశారు. వోల్టాస్ లిమిటెడ్, గోదావరి ఫర్టిలైజర్స్, వజీర్ సుల్తాన్ టుబాటో, సిర్పూర్ పేపర్ మిల్స్, ఐసీసీ, ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్స్, నిజాం షుగర్స్... ఇలా యాభై నాలుగు. ఈ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తూ భద్రమైన జీవితాలను గడిపిన వేలాది కుటుంబాలు ఏమయ్యాయో?. పొద్దున్నే నిద్రలేపి, స్కూలుకు తయారుచేసి యూనిఫామ్ తొడిగే అమ్మ, ఇంటిముందు హారన్ కొట్టే స్కూల్ ఆటో, అమ్మకు బై చెబుతూ స్కూలుకెళ్లిన రోజులు... హఠాత్తుగా ఆగిపోయిన ఆటో, రావద్దని చెప్పిన స్కూల్ ప్రిన్సిపాల్, ఆఫీసుకు వెళ్ల వలసిన నాన్న పిచ్చిచూపుల్తో ఇంట్లోనే, ఆడించే అమ్మ ఏడుస్తూ... ఏం జరిగిందనేది ఆ పిల్లలకెప్పుడు అర్థమైందో... వారిలో ఎందరు మళ్లీ గాడిన పడ్డారో, ఎన్ని బతుకులు ఛిద్ర మయ్యాయో... లెక్క లేవి?. మనకు పారే నీటిని కొలిచే కొల మానాలున్నాయి. కానీ, కారే కన్నీటిని ఏ కొలమానాలతో లెక్కిం చాలో తెలియదు. ఇటువంటి కళంకిత చరిత్రను లిఖించిన అపవి త్రమైన చేతులతో వచ్చి ఒక సమర శిబిరం ముందు నిలబడి ప్రసంగించడం బాధాకరమైన సన్నివేశం.
ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయండని ఆయన పిలుపునిస్తున్నారు. కానీ కేంద్రంపై కాదట. కేంద్రం పెద్దల పేర్లు పలకడానికి కూడా వీల్లేదట. ఒకపక్క కేంద్రం ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని ఝంఝామారుతంగా తోసుకొస్తున్నది. వేలాదిమంది రైతులు ఢిల్లీ రహదారులను డెబ్బయ్ రోజులపాటు దిగ్బంధం చేసినా వ్యవసాయ చట్టాలపై కేంద్రం అడుగు కూడా వెనకకు వేయలేదు. ఇటువంటి పరిస్థితుల్లో నిర్మాణాత్మకమైన ఆచరణయోగ్యమైన విధానాల ద్వారానే విశాఖ ఉక్కును ప్రైవేట్‌పరం కాకుండా కాపాడు కోగలం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన పని కూడా అదే. విశాఖ ఉక్కును ప్రభుత్వరంగంలో ఏవిధంగా కొనసాగించవచ్చునో, ఏవిధంగా లాభాల బాటలోకి తీసుకు రావచ్చునో పలు సూచనల్లో తెలియజేస్తూ సాక్షాత్తు ప్రధాన మంత్రికే లేఖ రాశారు. అటువంటి ముఖ్యమంత్రి మీద పోరాటం చేద్దామని ప్రధాని పేరెత్తడానికే వణికిపోయే ప్రతిపక్ష నేత పిలుపునిస్తున్నారు. ప్రతిపక్ష నేత తన రాజకీయ సిద్ధాం తాలను విశదీకరిస్తూ గతంలో ‘మనసులో మాట’ అనే పుస్తకాన్ని రాసుకున్నారు. ప్రభుత్వరంగంలో ఉద్యోగాలు భర్తీ చేయడం వృధా అని అందులో రాసుకున్నారు. ఉద్యోగం శాశ్వతం, భద్రం అనే అభిప్రాయం ఉద్యోగులకు వస్తే ప్రమాదమట. వాళ్లు పనిచేయరట! అందుకే కాంట్రాక్టు ఉద్యోగులను నియమించు కోవాలట. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యోగులారా... వింటున్నారా ఈ నాయకుని సుభాషితాలు. అనుమానముంటే ‘మనసులో మాట’ పుస్తకం 63, 64 పేజీల్లో చూడండి. రాష్ట్ర ప్రభుత్వాధినేత వైఎస్ జగన్‌పై పోరాటం చేద్దామని ఈ ప్రతిపక్ష నేత పిలుపునిస్తున్నారు. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చీ రావడంతోనే ప్రభుత్వరంగంలో నాలుగు లక్షలమందికి పూర్తి ఉద్యోగమో, సేవా ఉద్యోగమో కల్పించారు కనుక.
చెరువు కట్ట మీద ముసలి పులి కూర్చుని వున్నది. దాని చేతిలో ఒక బంగారు కడియం మెరుస్తున్నది. మిమ్మల్ని ఉద్దే శించి ఏదో చెబుతున్నది. వృద్ధాప్యం వల్ల జీవహింస మానేసిందట. శాకాహారిగా మారిందట. పూర్వం చేసిన పాపాలను పరిహారం చేసుకునేందుకు ఆ కడియం మీకిస్తుందట. నమ్ముతారా? దగ్గరకెళ్లి తీసుకుంటారా? తేల్చుకోండి మిత్రులారా!
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
Comments
Please login to add a commentAdd a comment