కుంభమేళాకుఆర్టీసీప్రత్యేకబస్సులు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించాలనుకునే జిల్లాకు చెందిన భక్తుల సౌకర్యార్థం ఏలూరు డిపో నుంచి రెండు ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులో ఉంచామని ఏలూరు జిల్లా ప్రజా రవాణా అధికారి ఎన్వీఆర్ వరప్రసాద్ తెలిపారు. గురువారం స్థానిక ఆర్టీసీ డీపీటీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏలూరు డిపో నుంచి ఫిబ్రవరి 4వ తేదీన ఈ బస్సులు బయలుదేరుతాయని, రిజర్వేషన్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచామన్నారు. ఈ బస్సులు ఏలూరులో బయలుదేరి పూరి, కోణార్క్, భువనేశ్వర్, ప్రయాగరాజ్ సంగమ స్థానం, కాశీ, అయోధ్య, గయా, బుద్ధగయ, తిరుగు ప్రయాణంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రఖ్యాతి గాంచిన అరసవెల్లి సూర్య దేవాలయం, శ్రీకూర్మం దర్శనం అనంతరం ఏలూరు చేరుకుంటుందన్నారు. మొత్తం ఎనిమిది రోజులు జరిగే ఈ యాత్రలో రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులకు ఉదయం, రాత్రి అల్పాహారం, మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ యాత్ర మొత్తం ఖర్చు రు.12500గా నిర్ణయించామన్నారు. వివరాలకు తమ పీఆర్ఓను 93467 67670లో సంప్రదించవచ్చన్నారు.
మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు
ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఏలూరుకి సమీపంలోని బలివే పుణ్య క్షేత్రానికి ఏలూరు, నూజివీడు డిపోల నుంచి 60 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని, పట్టిసీమకి జంగారెడ్డిగూడెం నుంచి 30 బస్సులు, తాడేపల్లిగూడెం నుంచి 20 బస్సులు, తాడేపల్లిగూడెం వద్ద ఉన్న వీరంపాలెంకు తాడేపల్లిగూడెం నుంచి 10 బస్సులు, ఏలూరు నుంచి 4 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఫిబ్రవరి 7, 8 తేదీల్లో జరిగే అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణ మహోత్సవానికి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 50 బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇటీవల సంక్రాంతి పండగ సందర్భంగా హైదరాబాద్కి 572 స్పెషల్ బస్సులు తిప్పామని, వాటిద్వారా రూ.1.14 కోట్ల ఆదాయం జిల్లా ఆర్టీసీకి వచ్చిందన్నారు. గత ఏడాదితో పోలిస్తే రూ.పది లక్షలు ఎక్కువ ఆదాయం వచ్చిందని ఆర్టీసీ బస్సులు ఎంచుకొని ప్రయాణించిన ప్రతి ప్రయాణికుడికి ధన్యవాదాలు తెలియజేశారు. సమావేశంలో ఏలూరు డిపో మేనేజర్ బీ వాణి, ఏఎంటీ జీ మురళి, పీఆర్వో కేఎల్వీ నరసింహం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment