ఏసీబీ వలలో హాస్టల్ వార్డెన్
నూజివీడు: నూజివీడులోని మడుపల్లి తాతయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (వార్డెన్) పోతుల నాగమణి గురువారం రాత్రి ఏసీబీ వలకు చిక్కారు. హాస్టల్‌లో పనిచేసే అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి వద్ద నుంచి రూ.30 వేలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఏలూరు ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ ఏలూరు డీఎస్పీ సుబ్బరాజు తెలిపిన వివరాల ప్రకారం.. పండా ఝాన్సీ అనే మహిళ హాస్టల్‌లో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో హౌస్ కీపింగ్, శానిటేషన్ విభాగంలో ఐదేళ్లుగా పనిచేస్తోంది. వార్డెన్ పోతుల నాగమణి రూ.లక్ష ఇస్తేనే హాస్టల్‌లో పనికి రానిస్తానని ఝాన్సీని రెండు నెలలుగా వేధిస్తున్నారు. అంత ఇ వ్వలేనని, రూ.30 వేలు ఇస్తానని ఝాన్సీ బతిమాలడంతో నాగమణి ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఝాన్సీ ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. వారి సూచన మేరకు ఝాన్సీ గురువారం రాత్రి నూజివీడు ఎంప్లాయీస్ కాలనీలోని వార్డెన్ ఇంటి వద్దకు వెళ్లి రూ.30 వేలు ఇవ్వగా, ఆ మొత్తాన్ని వార్డెన్ భర్త జాదం రామోజీరావు బీరువాలో పెడుతుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. రాత్రంతా అక్కడే ఉండి రికార్డు తయారు చేసి వార్డెన్ నాగమణి, రామోజీరావులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం, ఏసీబీ కోర్టులో హా జరుపరిచేందుకు వారిని విజయవాడకు తరలించారు. దాడిలో ఇన్‌స్పెక్టర్లు ఎం.బాలకృష్ణ, కె.శ్రీనివాస్, ఎన్‌వీ భాస్కరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి వద్ద రూ.30 వేలు డిమాండ్
రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కిన వార్డెన్, ఆమె భర్త
Comments
Please login to add a commentAdd a comment