సనా మిట్టార్, దేవాన్షి రంజన్
మన పని మనం చేసుకుంటూ పోతే గుర్తింపు దానంతట అదే వస్తుందన్న మాటకు ఉదాహరణగా నిలుస్తు్తన్నారు ఢిల్లీకి చెందిన దేవాన్షి రంజన్, సనా మిట్టార్‌లు. ఈ ఇద్దరు విద్యార్థినులూ చదువుతోపాటూ సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటున్నారు. కరోనా సమయంలోనూ వెనుకంజ వేయక వీరు చేస్తోన్న కృషికి గుర్తింపుగా ప్రతిష్టాత్మక డయానా అవార్డు వరించింది. దివంగత ప్రిన్సెస్ డయానా గౌరవార్థం సామాజిక సేవ, మానవతా కారణాలకోసం కృషి చేసే 9–25 ఏళ్ల యువతీయువకులకు ఇచ్చే డయానా అవార్డు ఈ ఇద్దరమ్మాయిలనూ వెతుక్కుంటూ వచ్చి మరీ పురస్కరించింది.
పిల్లలకు చదువు చెబుతున్న దేవాన్షి, సనా
ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ లేడీ శ్రీ రామ్ కాలేజీలో చదువుతోన్న 21 ఏళ్ల దేవాన్షి రంజన్ లింగ సమానత్వం, మానసిక ఆరోగ్యం, బాలబాలిక విద్యపై కృషిచేస్తోంది. గత ఐదేళ్లుగా మురికివాడల్లో నివసించే నిరుపేద పిల్లలకు చదువు చెప్పడం, నిరుపేద మహిళల్లో ఆర్థిక అంశాలు, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తోంది.
మైక్‌డ్రాప్..
‘‘కరోనా కారణంగా అంతంతమాత్రంగా ఉన్న నిరుపేద బతుకులు రోడ్డు మీద పడడంతో చాలా మంది పిల్లలు బడికెళ్లడం మానేశారు, కొంతమంది స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకునే స్థోమత లేకపోవడం వల్ల కూడా చదువుకు దూరమయ్యారు. ఇటువంటి వారందరికి చదువు చెప్పేందుకు లడ్లీ అనే ఎన్జీవో ఫౌండేషన్‌తో కలిసి పనిచేయడం ప్రారంభించాను. స్టడీ మెటిరియల్, స్టేషనరీలు విద్యార్థులకు అందించి వారిని చదివించేందుకు ప్రోత్సహిస్తున్నాను. ఢిల్లీలోని మురికివాడల్లోని వెయ్యిమందికిపైగా పిల్లలకు చదువు చెబుతున్నాము. ఈ క్రమంలోనే మా సామాజిక సేవా కార్యక్రమాలను పదిరాష్ట్రాల్లోని యాభై జిల్లాల్లో విస్తరించాము.
స్నేహితులతో కలిసి గతేడాది జూలైలో మైక్‌డ్రాప్ పేరిట ప్రాజెక్టును ప్రారంభించాను. స్త్రీవాదం, రాజకీయాలు, లింగ సమానత్వం, ఇంకా కళల ద్వారా మహిళలు ఎలా ఉపాధి పొందవచ్చు అన్న అంశాలపై వివిధ రకాల ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ప్రస్తుతం మా బృందంలో 50 మంది సభ్యులు ఉండగా మరో150 మంది కంట్రిబ్యూటర్స్ వివిధ ప్రాంతాల నుంచి పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే వర్క్‌షాపులు, వెబినార్స్‌ను నిర్వహిస్తూ నిరుపేదల్లో అవగాహన కల్పిస్తున్నాము’’ అని దేవాన్షి వివరించింది.
మనదేశంలో కరోనా మహమ్మారి పంజా విసురుతున్న సమయంలో సనా మిట్టార్ 150 వలంటీర్లతో డిజిటల్ క్యాంపెయిన్‌ను సమన్వయ పరిచి ఐదు లక్షల రూపాయల విరాళాలను సేకరించింది. అంతేగాక లాక్‌డౌన్ కాలంలో నిరుపేద విద్యార్థులు స్మార్ట్‌ఫోన్లు కొనుక్కునేందుకు సాయం చేసింది. 40 మంది విద్యార్థులు సనా సాయంతో ఆన్‌లైన్ తరగతులకు హాజరవుతున్నారు. సోషల్ ఎంటర్‌పైజ్ గ్లోబల్ వలంటీర్ యాక్షన్ నెట్‌వర్క్(జీవీఏఎన్)ను ఏర్పాటు చేసి సాయం చేయాలని ఉన్నా చేయలేని పరిస్థితుల్లో ఉన్న యువతను జీవీఏఎన్ వేదికగా వారి సహాయ సహకారాలను సమాజానికి అందిస్తోంది సనా.
పిల్లలకు చదువు చెబుతున్న దేవాన్షి, సనా
Comments
Please login to add a commentAdd a comment