రియల్‌ మోడల్‌ | 24 Year Old Shreeshma Prepareing For Civils Works As A Driver | Sakshi
Sakshi News home page

రియల్‌ మోడల్‌

Published Fri, Nov 27 2020 7:59 AM | Last Updated on Fri, Nov 27 2020 8:24 AM

24 Year Old Shreeshma Prepareing For Civils Works As A  Driver   - Sakshi

చేస్తున్నది చిన్న ఉద్యోగమా, పెద్ద ఉద్యోగమా అన్నది ముఖ్యం కాదు, గౌరవంగా జీవించడం ప్రధానం అని నిరూపిస్తున్న ఓ యువతి తనకు తాను వేసుకున్న బతుకు బాట ఇది. టెన్త్, ట్వల్త్‌ క్లాసులతోపాటు బీటెక్‌లో కూడా మంచి గ్రేడ్‌ తెచ్చుకుని ఇప్పుడు సివిల్స్‌కు ప్రిపేరవుతున్న ఇరవై నాలుగేళ్ల శ్రీష్మ టిప్పర్‌ లారీ డ్రైవర్‌గా పని చేస్తోంది! రోజుకు ఆరు లోడ్‌లు దింపి తిరిగి తన సివిల్స్‌ పరీక్షల కోసం ప్రిపేరవుతోంది. కరోనా మహమ్మారి కారణంగా ఈ పనులు చేస్తున్నారా అని అడిగిన వాళ్లకు ఆమె చెప్పే సమాధానం ఒక్కటే. ‘మా నాన్నకు సహాయం చేయడం కోసమే’ అని చెప్తోంది. ఇలాంటి రోల్‌ మోడల్‌ పాత్రలు సినిమాల్లోనే కనిపిస్తుంటాయి. శ్రీష్మ మాత్రం రియల్‌ మోడల్‌.

శ్రీష్మ తండ్రి పురుషోత్తమన్‌ సిమెంట్‌ వ్యాపారి. వాళ్లది కేరళలోని కున్నూరు. కరోనా కారణంగా ఆయన వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నది. తల్లి శ్రీజ ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్‌. కరోనా సమయంలో పాఠశాలలు తెరవకపోవడంతో ఆమెకు కూడా జీతాలు సరిగా రావడం లేదు. కరోనా కష్టకాలాన్ని దాటడానికి శ్రీష్మ టిప్పర్‌ స్టీరింగ్‌ పట్టుకుంది. చిన్నప్పుడు ఇష్టంగా నేర్చుకున్న డ్రైవింగ్‌ ఇప్పుడు తమ కుటుంబాన్ని సరైన దారిలో నడిపిస్తోందని చెబుతోంది శ్రీష్మ. ‘‘అప్పుడు నేను ఐదవ తరగతి. అమ్మకు డ్రైవింగ్‌ నేర్పించాడు నాన్న. నేను కూడా నేర్చుకుంటానని మొండికేశాను. డ్రైవింగ్‌ నేర్పించాడు కానీ ఇప్పుడే లైసెన్స్‌ ఇవ్వరు కాబట్టి నడపడానికి వీల్లేదని గట్టిగా చెప్పేశారు అమ్మానాన్న. నాకు డ్రైవింగ్‌ వచ్చినా సరే నడపడానికి వాహనం ఇచ్చేవాళ్లు కాదు. దాంతో పద్దెనిమిదేళ్లు వచ్చిన తర్వాత నా కల నెరవేర్చుకున్నాను. టూవీలర్, త్రీ వీలర్, ఫోర్‌ వీలర్‌ పరీక్షలు పాసయ్యి లైసెన్స్‌లు తెచ్చుకున్నాను. అంతటితో సంతృప్తి చెందలేదు. హెవీ వెహికల్‌ లైసెన్స్‌ కోసం బస్సు, లారీ కూడా నడిపాను.

హెవీ వెహికల్‌ పరీక్షకు హాజరైన వాళ్లలో అమ్మాయిని నేనొక్కర్తినే. మగవాళ్లు నన్ను విచిత్రంగా చూశారు. అప్పుడు నా వయసు 21. నాకు చదువు రాలేదేమోనని, పెద్ద ఉద్యోగాలకు అవకాశం లేకపోవడంతో డ్రైవింగ్‌కి వచ్చానని కూడా అనుకున్నారు వాళ్లు. బస్సులు, లారీలు నడపడం ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు మా చుట్టుపక్కల వాళ్లు నవ్వారు, బీటెక్‌ చదువుతూ ఉద్యోగాల గురించి ఆలోచించకుండా లారీలు నడపడమేంటని బాగా ఎగతాళి చేశారు. నేర్చుకునేటప్పుడే కాదు, ఆరు నెలల కిందట నేను గ్రావెల్‌ రవాణా టిప్పర్‌ లారీ తోలుతున్నప్పుడు కూడా అలాగే చూశారు. ఇప్పుడు మాత్రం ఈ పని వెనుక ఉన్నది ఉద్యోగం రాక కాదు, నాన్నకు సహాయం చేయడానికని వాళ్లకు అర్థమైంది. వాళ్లకు అర్థం కాకపోయినా నేనేమీ పట్టించుకోను. నాన్నకు ఆర్థిక కష్టం వచ్చినప్పుడు నేను సహాయంగా నిలిచానా లేదా అన్నదే నాకు ముఖ్యం. నేను హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ నేర్చుకుంటున్నప్పుడు నా ఫ్రెండ్స్‌ మాత్రం చాలా సంతోషపడ్డారు. అమ్మాయిలు చేయలేని పని చేస్తున్నందుకు ప్రశంసించేవాళ్లు. కొంతమంది తమకూ నేర్పించమని అడిగి మరీ డ్రైవింగ్‌ నేర్చుకున్నారు. ఇప్పుడు కూడా నా ఫ్రెండ్స్‌ గ్రేట్‌ అంటూ ప్రోత్సహిస్తున్నారు. రేపటి రోజున నా చదువుకు తగిన మరో ఉద్యోగం సంపాదించుకోగలను. అలాగని నా చదువుకు తగిన ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఈ రోజును నిర్వీర్యంగా గడిపేయడం నచ్చదు. ప్రతిదీ గౌరవప్రదమైన ఉద్యోగమే. ఏ పనినీ తక్కువగా చూడకూడదు. నాకు డ్రైవింగ్‌ ఇష్టం కాబట్టి ఈ పని చేస్తున్నాను’’ అన్నది శ్రీష్మ. 

అవును.. మా అమ్మాయే
శ్రీష్మలో పరిస్థితిని తనకు తానుగా చక్కదిద్దుకోగలిగిన నైపుణ్యం ఉందని, తండ్రిగా సంతోషపడుతున్నానని చెప్పాడు పురుషోత్తమ్‌. టిప్పర్‌ తోలే అమ్మాయి మా అమ్మాయేనని గర్వంగా చెప్పుకుంటున్నాడు. ‘‘ఒకసారి టిప్పర్‌ లారీ చిత్తడి నేలలో కూరుకుపోయింది, తాను బెంబేలు పడకుండా స్థానికుల సహాయంతో బండిని బయటకు తీసి లోడు గమ్యాన్ని చేర్చింది. డ్రైవింగ్‌ చేస్తున్న కారణంగా తన ప్రిపరేషన్‌కు అంతరాయం కలగనివ్వడం లేదు. ప్రిపరేషన్‌ కొనసాగిస్తోంది. చదువుకున్న అమ్మాయి కుటుంబం కోసం తండ్రికి సహాయం చేయాలనే మంచి ఆలోచనతో టిప్పర్‌ నడుపుతోందని తోటి మగ డ్రైవర్లు కూడా శ్రీష్మను అభిమానంగా, గౌరవంగా చూస్తున్నారు’’ అని చెప్పారాయన. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement