250 మంది మహిళలు ఆరు నెలల్లో 2,719 క్రొచెట్ పాంచోలు తయారుచేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు. ఈ ΄పాంచోలను గిరిజన పిల్లలకు ఉచితంగా పంచిపెడుతున్నారు. విశాఖపట్నం వేదికగా వీరందరూ ఒక తాటి మీదకు వచ్చి చేసిన ఈ ప్రయత్నం ఎంతో మందిని ఆకట్టుకుంటోంది. మహిళా మనోవికాసం పేరుతో క్రొచెట్ గ్రూప్‌ను ప్రారంభించిన మాధవి సూరిభట్ల, డెభ్బై ఏళ్ల వయసులోనూ చురుగ్గా పాల్గొన్న రాఘవమ్మ, టీమ్‌లీడర్‌గా ఫణి శిరీష, తనూజలు ఈ సందర్భంగా ఈ రికార్డు సాధనపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
కొత్త ప్రపంచం
కుటుంబ జీవనంలోనే ఏళ్లు గడిచిపోయాయి. 70 ఏళ్ల వయసులో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నుంచి సర్టిఫికెట్ అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎంబ్రాయిడరీ, క్రొచెట్ అల్లిక చిన్నప్పటి నుంచీ అలవాటు. మహిళా గ్రూప్‌లో చేరి నాలుగేళ్లు అవుతోంది. వచ్చిన పనిని నలుగురితో షేర్ చేసుకోవడం, తెలియంది తెలుసుకోవడం చేస్తుంటాను. ఇంటి దగ్గర రోజూ కొంత సమయం ఎంబ్రాయిడరీకి కేటాయిస్తుంటాను. ఈ గ్రూప్ ద్వారా ఈవెంట్‌లో పాల్గొని చాలామంది మహిళలతో పరిచయాలు పెంచుకోగలిగాను. ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్టుగా, చాలా ఆనందంగా అనిపించింది.
– డి.వి.రాఘవమ్మ, విజయవాడ
గ్రూప్‌కి లీడర్‌ని
మా పిల్లలతో కలిసి స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొంటుంటాను. మూడేళ్ల క్రితం మహిళా మనోవికాస్‌లో జాయిన్ అయ్యాను. 25 మంది ఉన్న గ్రూప్‌కి లీడర్‌గా ఉన్నాను. ఇలా మొత్తం తొమ్మిది టీమ్స్ ఉన్నాయి. ఒక్కో టీమ్‌లో 25 నుంచి 35 వరకు ఉంటారు. నెల రోజులు ఆన్‌లైన్‌లో క్రొచెట్ కోర్సు నేర్చుకున్నాను. కిందటేడాది గ్రూప్ అంతా దాదాపు 4,686 క్రొచెట్ టోపీలు అల్లి, ఈవెంట్ చేశాం. ఆ టోపీలను చలి ఎక్కువ ఉండే గిరిజన ప్రాంతాల పిల్లలకు అందజేశాం. ఈసారి పాంచోస్‌ను కూడా అదేవిధంగా పంపిణీ చేస్తున్నాం. రెండుసార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ నుంచి సర్టిఫికెట్ అందుకోవడం ఆనందంగా ఉంది.
– ఫణి శిరీష, హైదరాబాద్
ఆన్‌లైన్ క్లాసుల నుంచి మొదలు...
ప్రైవేట్ కంపెనీలో హెచ్‌ఆర్ ఉద్యోగం చేసే నేను పిల్లలు సెటిలయ్యాక మానేశాను. ఇంటి వద్ద ఉంటూ నా హాబీస్ పైన దృష్టి పెట్టాను. అన్నిరకాల హ్యాండ్‌క్రాఫ్ట్స్ చేయగలను. అందులో భాగంగానే నా క్రాఫ్ట్ వర్క్ నలుగురికీ తెలియజేద్దామని ఎఫ్‌బిలో మధురం క్రాఫ్ట్స్ అండ్ క్రియేషన్స్ పేరుతో పోస్ట్ చేసేదాన్ని. కొంతమంది తమకు క్లాసులు చెప్పమన్నారు. దీంతో కోవిడ్ టైమ్‌లో గ్రూప్ స్టార్ట్ చేసి, ఆన్‌లైన్ క్లాసులు చెబుతూ వచ్చాను. విదేశాలలోనూ నా స్టూడెంట్స్ ఉన్నారు. చెన్నై గ్రూప్‌తో 3 సార్లు క్రొచెట్ గిన్నిస్ రికార్డ్‌లో పాల్గొన్నాను.
నా వ్యక్తిగతంగానే ఏడుసార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించాను. వైజాగ్‌లోనూ ఈవెంట్ చేయాలనే ఆలోచనతో మహిళా మనోవికాస్ పేరుతో గ్రూప్ ప్రారంభించాను. ఆన్‌లైన్‌లో మహిళలకు క్రోచెట్ క్లాసులు తీసుకునేదాన్ని. ఒకరి ఆలోచనను ఇంకొకరు పంచుకుంటూ క్రొచెట్ అల్లికలు చేసి, వాటిని పేదవారికి పంచాలనేది ఆలోచన. దేశ విదేశాల నుంచి ఒకరి ద్వారా మరికొందరు పరిచయం అవుతూ ఆన్‌లైన్‌లో ఒక తాటిమీదకు వచ్చారు. కిందటేడాది క్రొచెట్ టోపీలు తయారుచేశాం. ఇప్పుడు పాంచోస్ తయారుచేశాం.
పెళ్లి అయిన తర్వాత గృహిణులుగా ఉన్నవారు తమ జీవితంలో ఎలాంటి అచీవ్‌మెంట్ లేదు అనుకునేవారికి ఇదో మంచి బూస్టింగ్ అయ్యింది. మా గ్రూప్‌లో క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఉన్నారు. కీమో తీసుకుంటూ కూడా ఈ అల్లికలు చేశారు. ఈవెంట్‌కు అటెండ్ అవ్వాలనుకునేవారు 150 మెంబర్స్ వచ్చారు. ఆరేళ్ల పాప నుంచి 80 ఏళ్ల వయసు వారు ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. అందరికీ ఇది ఒక స్ట్రెస్ బస్టర్ అని చెప్పవచ్చు.
– మాధవి సూరిభట్ల, విశాఖపట్నం
మా పిల్లలకూ నేర్పిస్తున్నాను..
డెలీవరీ టైమ్‌లో ఖాళీగా ఉండటంతో ఆన్‌లైన్‌లో క్రోచెట్ బేసిక్స్ నేర్చుకున్నాను. ఆర్డర్స్ మీద అమీ గ్రూమీ స్టఫ్డ్ టాయ్స్ కూడా చేయడం నేర్చుకున్నాను. మా పిల్లలకు కూడా నేర్పిస్తున్నాను. ప్రతి ఒక్కరూ పది పాంచోస్ చేస్తే చాలు అనుకున్నాను. నేను 25 పాంచోస్ చేసిచ్చాను. ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు ఎలా అచీవ్‌మెంట్ వస్తుంది అని. కొంతమంది ‘మాకు నేర్పిస్తారా, మేం ఎలా ఇందులో పాల్గొనాలి..’ అని అడుగుతున్నారు. ట్రైబల్ పిల్లలకు వాటిని అందజేశారు.
– తనూజ, నంద్యాల
-నిర్మలా రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment