నీలోఫర్ బయత్
పారిపోవాలి. బతకాలి. తాలిబన్ల చేతికి చిక్కకూడదు. లక్షల మంది ఆకాంక్ష అఫ్గానిస్తాన్‌లో ఇప్పుడు. కాని అందరికీ వీలవుతుందా? సాధ్యమవుతుందా? తుపాకీ గొట్టాన్ని తప్పించుకోగలరా? అఫ్గానిస్తాన్ వీల్‌చైల్ బాస్కెట్‌బాల్ కెప్టెన్ నీలోఫర్ బయత్ అక్కడి నుంచి భర్తతో సహా స్పెయిన్‌కు తప్పించుకోగలిగింది. కాని దాని వెనుక ఒక సినిమా అంత కథ ఉంది. ఏమిటి అది?
ఆగస్టు 14న కాబూల్ తాలిబన్ల హస్తగతం అయ్యింది. ఆగస్టు 20న నీలోఫర్ బయత్ స్పెయిన్‌కు చేరుకోగలిగింది. ఈ మధ్యలోని 5 రోజులే ఆమె పారిపోవడానికి సంబంధించిన ఒక ఉత్కంఠ కథ.
స్పెయిన్‌లోని బిల్‌బావ్ నగరానికి చేరుకుని ఆమె తెరిపినపడి కాఫీ తాగుతూ కూచుంది కాని ఆమె చేతులు ఇంకా ఒణుకుతున్నాయి. గుండె అదురుతూనే ఉంది. కళ్లు ఉండి ఉండి కన్నీరు కారుస్తూనే ఉన్నాయి. ఆమె తన భర్తతో పాటు తప్పించుకోగలిగింది. కాని తన బంధువులు, అయినవారు కాబుల్‌లోనే ఉన్నారు. వారి గతి ఏమిటి?
భర్తతో కలిసి స్పెయిన్ విమానాశ్రయంలో ...
ఆమె చేసిన పని
కాబూల్ తాలిబన్ల హస్తగతం అయిన వెంటనే నీలోఫర్ బయత్ తీసుకున్న నిర్ణయం ఏమిటంటే దేశాన్ని విడిచి పెట్టడం. ఆమె అఫ్గానిస్తాన్‌లోని వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ టీమ్ కెప్టెన్. అంతేకాదు మహిళల హక్కుల గురించి, దివ్యాంగుల అవసరాల గురించి కూడా మాట్లాడుతుంది. కాబూల్‌లో ఆమె ఒక సెలబ్రిటీ. ఆమె భర్త రమేష్ కూడా దివ్యాంగుల బాస్కెట్‌బాల్ టీమ్‌లో ఆడతాడు. ఇద్దరూ ఎన్నో కలలు కన్నారు. గత దశాబ్ద కాలంలో కాబూల్‌లో దివ్యాంగుల క్రీడల ఉన్నతికి పని చేస్తున్నారు. ఇంకా చేయాలనుకున్నారు.
ఇంతలోనే తాలిబన్లు వచ్చేశారు. ‘వాళ్లు కచ్చితంగా నా కోసం వెతుకుతారని నాకు తెలుసు. అప్పటికే నాలాంటి వారి కోసం ఇల్లిల్లు వెతుకుతున్నారు’ అని నీలోఫర్ బయత్ అంది. ‘వెంటనే మనం దేశం విడిచిపెట్టాలి అని నా భర్తతో చెప్పాను’ అందామె. ఆమె అంత భయపడటానికి కారణం ఆమె చిన్నప్పుడు తాలిబన్ల మొదటి పాలనలో ఒక మిస్సైల్ ఆమె ఇంటి మీద కూలింది. ఒక సోదరుడు మరణించాడు. ఆమె వీపు కాలిపోయి వెన్నుకు గాయమైంది. దాంతో దివ్యాంగురాలైంది. అలాగే భర్త కూడా ల్యాండ్‌మైన్ పేలడంతో దివ్యాంగుడయ్యాడు. ఆ అనుభవాలు చాలు అనుకుందామె.
జర్నలిస్ట్ ప్రమేయంతో...
నీలోఫర్ వెంటనే చాలా ఏళ్లుగా తనకు తెలిసిన స్పానిష్ జర్నలిస్టు ఆంటోనియో పంప్లెగాతో తన బాధ మొరపెట్టుకుంది. ఆ జర్నలిస్టు ఆమె గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. స్పెయిన్ పౌరులు ఆ పోస్టుకు స్పందించారు. స్పెయిన్ ప్రభుత్వం కాబూల్ కేంద్రంగా యూరోపియన్ యూనియన్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో పని చేసిన తన దేశీయులను, అఫ్గాన్ పౌరులను తరలించే కార్యక్రమాలు చేస్తోంది. ఆ విమానాల్లోనే నీలోఫర్‌ను భర్తతో పాటు తీసుకురావడానికి అంగీకరించింది.
స్పెయిన్‌లో భర్తతో నీలోఫర్ బయత్
‘అది తెలిసిన వెంటనే నేనూ నా భర్త కాబూల్ ఎయిర్‌పోర్ట్ వైపు కదిలాం. కాని సులభమా ఆ పని? అప్పటికే తాలిబన్లు ఎయిర్‌పోర్ట్‌ను చుట్టుముట్టారు. వాళ్ల తుపాకులు గాల్లో కాల్పులు చేస్తున్నాయి. మరోవైపు ఇతర పౌరులు కూడా వెర్రెత్తి ఎయిర్‌పోర్ట్‌లో చొరబడాలని చూస్తున్నారు. అసలు ఎయిర్‌పోర్ట్‌లో ప్రవేశించగలమా? అనుకున్నాను. ఎయిర్‌పోర్ట్ బయట ఏ క్షణమైనా మేము చనిపోవచ్చు. ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టడానికి బయట మేము 9 సుదీర్ఘ గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు కూడా తాలిబన్లు మా లగేజ్‌ను మాతో తీసుకెళ్లనివ్వలేదు. కట్టుబట్టలతో లోపలికి వెళ్లాం’ అందామె.
వొంటి మీద బట్టలతో ఐదు రోజులు
ఒంటి మీద బట్టలతో కాబుల్ ఎయిర్‌పోర్ట్‌లోకి చేరుకున్న నీలోఫర్ ఆమె భర్త రమేశ్ తమకు విమానంలో చోటు దక్కడం కోసం దాదాపు ఐదు రోజులు ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయారు. ‘దేశం విడిచిపెట్టడమే ఒక విషాదం. కట్టుబట్టలతో పరాయి దేశంలో దిగడం అంటే మళ్లీ జీవితాలను జీరో నుంచి మొదలెట్టడమే’ అందామె. ఎయిర్‌పోర్ట్‌లో అనుక్షణం ఆశనిరాశల భీతావహ క్షణాల తర్వాత వారికి స్పెయిన్ విమానం చోటు ఇచ్చింది. మొత్తం 105 పాసింజర్లతో అఫ్గాన్ శరణార్థుల కోసం స్పెయిన్ తన దక్షిణ భాగాన తెరిచిన మిలటరీ బేస్‌కు సురక్షితంగా చేరుకుంది. అక్కడి నుంచి ఆ దంపతులు బిల్‌బావ్ నగరానికి చేరుకున్నారు.
ఊపిరి పోసిన ఆదరణ
నీలోఫర్ బయత్ అదృష్టవంతురాలు. స్పెయిన్ బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ వెంటనే ఆమెకు బిల్‌బావ్ బాస్కెట్‌బాల్ టీమ్‌లో ఆడటానికి ఆహ్వానం పలికింది. భర్త రమేశ్‌కు కూడా పురుషుల టీమ్‌లో ఆడమని కోరింది. వారికి ఉపాధి దొరికినట్టే. కాని శరణార్థులుగా వారి జీవితం ఏం కానుంది? అఫ్గానిస్తాన్‌లో ఉండిపోయిన వాళ్ల బంధువుల జీవితాలు ఏం కానున్నాయి. ఇవన్నీ కాలమే తేల్చనుంది.
మనిషి ఎంత ఆధునికుడైనా సాటి మనిషిని వేధించడంలో మృగ స్వభావం ప్రదర్శిస్తూనే ఉన్నాడు. ఆ మృగాన్ని మొదటే గుర్తించి ఆపకపోతే ఇవాళ అఫ్గానిస్తాన్ రేపు ఏదేశమో?
Comments
Please login to add a commentAdd a comment