Aishwarya: మూడు వందలకు పైగా డాన్స్‌ ప్రదర్శనలు.. ఇంకా | Aishwarya Bhagyanagar: Bharatanatyam Dancer Artist Painter Inspiring Story | Sakshi
Sakshi News home page

Aishwarya Bhagyanagar: మూడు వందలకు పైగా డాన్స్‌ ప్రదర్శనలు.. అంతేకాదు చిత్రకారిణి కూడా!

Published Wed, Apr 27 2022 1:16 PM | Last Updated on Wed, Apr 27 2022 1:26 PM

Aishwarya Bhagyanagar: Bharatanatyam Dancer Artist Painter Inspiring Story - Sakshi

చక్కటి రూపం, పొడవైన జడ, చెవులకు జూకాలు ధరిస్తూన్న అచ్చమైన తెలుగు యువతి, ఆ పక్కనే మాయాబజార్‌ ప్రియదర్శినిలో అభిమన్యుడిని తన్మయత్వంతో చూస్తున్న శశిరేఖ, మరో చిత్రంలో ఓ పాపాయి. తండ్రి చేతుల్లో భద్రంగా ఉన్నాననే భరోసా ఆ పాపాయి కళ్లలో ప్రతిబింబిస్తోంది.

ఇక కెంపులు పొదిగిన ఈ కంఠాభరణం సహజమైన మెరుపుతో అచ్చమైన బంగారు ఆభరణాన్ని తలపిస్తోంది. ఈ చిత్రాలకు రూపమిచ్చిన కళాకారిణి ఈ పక్కన ఉన్న భరత నాట్యకారిణి... ఐశ్వర్య భాగ్యనగర్‌.

భరతనాట్యం, బాలీవుడ్‌ డాన్స్‌ ఫ్యూజన్, భాంగ్రా నృత్యం, హిప్‌హాప్, థియేటర్‌ స్కిట్, టిక్‌టాక్‌... వీటన్నింటి మధ్యలో కుంచె పట్టుకుని సుదీర్ఘంగా పెయింటింగ్‌లో నిమగ్నమైపోవడం... ఇదీ ఈ అమ్మాయి ప్రపంచం. యూఎస్‌లో పుట్టిపెరిగిన ఈ తెలుగమ్మాయి తనకు తానుగా సృష్టించుకున్న ప్రపంచం. ‘పెర్‌ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ అంటే నాకిష్టం. ఎదుటివారిని ఎంటర్‌టైన్‌ చేయడంలో నేను ఎంటర్‌టైన్‌ అవుతాను’ అంటున్న ఐశ్వర్య భాగ్యనగర్‌ పరిచయం. 

ఐశ్వర్య భాగ్యనగర్‌ పూర్వికులది కరీంనగర్‌ జిల్లా. ఆమె తండ్రి వేణు భాగ్యనగర్‌ యూఎస్‌లో స్థిరపడ్డారు. రెండేళ్లకోసారి ఇండియాకి వచ్చే ఈ అమ్మాయి భారతీయతతో ఎక్కువగా కనెక్ట్‌ అయింది. ఫ్యాషన్‌ ప్రపంచం ఇండియాని వెస్ట్రనైజ్‌ చేస్తుంటే, ఐశ్వర్య మాత్రం యూఎస్‌కి ఇండియా అంటే ఏమిటో తెలియచేస్తోంది. ఇక్కడి కళలను అక్కడ ప్రదర్శించి అలరిస్తోంది. శాస్త్రీయ నాట్యానికే జీవితాన్ని అంకితం చేసిన కళాకారిణులకు దీటుగా ప్రదర్శనలిస్తోంది.

‘‘మేము డాలస్‌లో మన పండుగలన్నీ జరుపుకుంటాం. బతుకమ్మ, ఉగాది, ఇంకా తెలుగు వాళ్ల చిన్న చిన్న గ్యాదరింగ్‌లలో కూడా ఏదో ఒక పెర్ఫార్మెన్స్‌కి అవకాశం ఉంటుంది. నాకు స్టేజ్‌ షోలంటే ఇష్టం. అమ్మానాన్నలకు ఓన్లీ కిడ్‌ని. ఇక నన్ను ఆపేదెవరు? ఏ చిన్న కార్యక్రమం అయినా నా ఆర్ట్‌ ఫార్మ్‌ ఒక్కటైనా ఉంటుంది. నాలుగేళ్ల కిందట ఇండియాకి వచ్చినప్పుడు రవీంద్రభారతిలో కూడా ప్రదర్శన ఇచ్చాను.

ఒక సామాజిక ప్రయోజనం కోసం నిర్వహిస్తున్న కార్యక్రమం అది. అందులో ప్రదర్శన ఇవ్వడంలో ఒక సంతృప్తి ఉంటుంది. పైగా నా రూట్స్‌ ఉన్న నేలకు ఇస్తున్న గౌరవం అది. అందుకే వెంటనే ఒప్పుకున్నాను’’ అన్నది ఐశ్వర్య 2018లో హైదరాబాద్‌లో ఇచ్చిన సోలో ప్రదర్శనను గుర్తు చేసుకుంటూ. 
 
ఆరంగేంట్రానికి అన్నీ ఇక్కడి నుంచే!
ఐశ్వర్య ఐదేళ్ల వయసులో నాట్యసాధన ప్రారంభించింది. నాట్యగురువు మధుశ్రీ సేతుపతి ఆధ్వర్యంలో 2016లో ఆరంగేంట్రం చేసింది. ఆరంగేంట్రానికి అన్నీ చెన్నై నుంచి తీసుకువెళ్లింది. ‘‘పెర్‌ఫార్మెన్స్‌ విషయంలో రాజీ పడకూడదు. ప్రతిదీ కచ్చితంగా ఉండాలి. నాట్యంలో దుస్తులు, ఆభరణాలు కూడా సంప్రదాయాన్ని, సంస్కృతిని ప్రతిబింబించి తీరాలి. ఇవన్నీ కల్చర్‌ని ఒకతరం నుంచి మరో తరానికి తీసుకువెళ్లే వాహకాలు.

ఇప్పటి ఫొటోలు తర్వాతి తరానికి డాక్యుమెంట్‌లు. ఆ తరం అర్థం చేసుకోవడానికి పనికి వచ్చే ఆధారాలు. అందుకే రాజీ పడకూడదంటాను. మనం కొంత రాజీపడితే ఆ ఫొటోలు చూసిన వాళ్లలో ఎవరో ఒకరు వాటినే ప్రామాణికంగా తీసుకునే ప్రమాదం ఉంటుంది.

అందుకే అంత కచ్చితంగా ఉంటాను’’ అంటోంది ఐశ్వర్య. ఆమె ఆ మాట అనడమే కాదు, ఆమె పెయింటింగ్స్‌లో భరతనాట్యంలో ధరించే ఆభరణాలున్నాయి. భరతనాట్యం థీమ్‌తో వేసిన వాటిని చూస్తే ఇది పెయింటింగా లేక యాంటిక్‌ ఆభరణాల ఫొటోనా అని సందేహం కలిగేటంత సహజంగా ఉన్నాయి. 
 
ఆర్ట్‌ని చదివింది
‘‘ఆర్ట్‌ని హాబీగా నేర్చుకోవడం కాదు, సిక్స్‌త్‌ క్లాస్‌ నుంచి నేను ఆర్ట్‌ని ఒక సబ్జెక్ట్‌గా చదివాను. అందుకే స్కూల్‌డేస్‌ నుంచి పెయింటింగ్‌ కాంపిటీషన్‌లు, ఎగ్జిబిషన్‌లు పాతిక వరకు ఉన్నాయి. డాన్స్‌ ప్రదర్శనలైతే మూడు వందలు దాటి ఉంటాయి. అయితే అందులో భరతనాట్యం ప్రదర్శనలే ఎక్కువ. ఇవి కాకుండా ఇండియన్‌ కాస్ట్యూమ్స్‌కి మోడలింగ్‌ చేస్తాను. అయితే సీరియస్‌ మోడల్‌ని కాను. సరదాగా చేస్తానంతే.

డాలస్‌లో మాకు ఇండియాలో ఉన్నట్లే ఉంటుంది. తెలుగు సినిమాలు కూడా బాగా చూస్తాం. నేనైతే ఫస్ట్‌డే ఫస్ట్‌ షో చూడాల్సిందే. ఆచార్య సినిమాకి టికెట్స్‌ బుక్‌ చేసుకున్నాను. ఇవన్నీ చేస్తుంటే నేను చదువు ఎప్పుడు చదువుతానని సందేహంగా ఉంది కదా! డిసెంబర్‌లో గ్రాడ్యుయేషన్‌ తీసుకున్నాను. ఇప్పుడు జాబ్‌ చూసుకోవాలి. ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా నా ఆర్ట్స్‌ని కొనసాగించాలనేది ఆకాంక్ష.

నేను ఇన్ని రకాల డాన్స్‌లు చేయడానికి ఫౌండేషన్‌ భరతనాట్యం ప్రాక్టీసే. అందుకే డాన్స్‌ని కొనసాగించే విధంగా కెరీర్‌ని డిజైన్‌ చేసుకుంటాను’’ అన్నది ఐశ్వర్య. తన ప్రపంచంలో తాను హాయిగా ఉంది. అంతకు మించి చక్కటి ఆకాంక్షలతో ఉంది. అందుకు తగిన ఆత్మవిశ్వాసంతోనూ ఉంది. అందుకే ఐశ్వర్య భాగ్యనగర్‌కి ఆల్‌ ది బెస్ట్‌ చెబుదాం. 
– వాకా మంజులారెడ్డి     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement