అమెరికాలోని నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్)లో ఉద్యోగం... ఈ కల చాలా మందికే ఉండి ఉంటుంది. ఈ కలను సాకారం చేసుకున్న తొలి భారతీయ యువతి అక్షత కృష్ణమూర్తి. నాసా అనగానే మనకు అంతరిక్షంలోకి వెళ్లి గ్రహాలను అధ్యయనం చేసిన రాకేశ్ శర్మ గుర్తు వస్తారు. అలాగే కల్పనా చావ్లా, సునీత విలియమ్స్ కూడా గుర్తుకు వస్తారు. కల్పనా చావ్లా, సునీత విలియమ్స్ ఇద్దరూ భారతీయ సంతతికి చెందిన వారే కానీ భారత పౌరసత్వం ఉన్న వాళ్లు కాదు. అమెరికా పౌరసత్వమే వారి అంతరిక్ష పథాన్ని సుగమం చేసింది. ఇక అక్షత విషయానికి వస్తే...
ఆకాశానికి ఆవల
బెంగళూరుకు చెందిన అక్షతా కృష్ణమూర్తికి చిన్నప్పటి నుంచి ఆకాశానికి ఆవల ఏముంటుంది అనే ఆలోచనే. ఆమె బాల్యం ఆకాశంలో నక్షత్రాలను చూడడంతో, చుక్కల్లో చందమామ వెలుగుతో సంతృప్తి చెందలేదు. అంతరిక్షం అంటే మనకు కనిపించేది మాత్రమే కాదు, ఇంకా ఏదో ఉంది, అదేంటో తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. బాల్యంలో మొదలైన ఆసక్తిని పెద్దయ్యేవరకు కొనసాగించింది.
తన పయనాన్ని అంతరిక్షం వైపుగా సాగాలని కోరుకుంది. అందుకోసం తీవ్రంగా శ్రమించింది, నేడు నాసాలో ఏరో స్పేస్ ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించింది. ఆ వివరాలను తెలియచేస్తూ ‘‘ఇది కేవలం అదృష్టం అని కానీ, కాకతాళీయంగా జరిగిపోయిందని చెప్పను. పూర్తిగా పదిహేనేళ్ల కఠోర శ్రమతోనే, అంతకు మించిన ఓర్పుతోనే సాధ్యమైంది’’ అంటుంది అక్షత. అలాగే అంతరిక్షంలో కెరీర్‌ని వెతుక్కోవాలంటే పాటించాల్సిన కొన్ని సూత్రాలను కూడా పంచుకుంది.
నక్షత్రశాల నుంచి అంతరిక్షం వరకు...
‘‘నాసాలోని జెట్ ప్రోపల్షన్ లాబొరేటరీలో స్పేస్ మిషన్‌లకు ‘ప్రిన్సిపల్ నావిగేటర్ అండ్ స్పేస్ సిస్టమ్స్ ఇంజనీర్’గా విధులు నిర్వర్తిస్తున్నాను. నాసా–ఇస్రో సంయుక్తంగా నిర్వహించిన సింథటిక్ ఆపెర్చర్ రాడార్ మిషన్‌లో ఫేజ్ లీడ్‌గానూ, మార్స్ 2020 మిషన్‌లో రోబోటిక్స్ సిస్టమ్స్ ఇంజనీర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాను. నేను చదివింది స్టేట్ బోర్డ్ సిలబస్‌లోనే. మాది సంపన్న కుటుంబం కూడా కాదు. అయితే చిన్నప్పుడు నా వీకెండ్ ఎంజాయ్‌మెంట్‌లో ప్లాలానిటేరియం విజిట్స్, బెంగుళూరులో ఎయిర్‌షోస్ ఎక్కువగా ఉండేవి. నా ఆసక్తిని గమనించిన మా అమ్మానాన్న నేనడిగిన ప్రతిసారీ తీసుకెళ్లేవారు.
హబుల్ టెలిస్కోప్ గురించి తెలుసుకోవడం నా జీవితంలో గొప్ప మలుపు. బహుశా 2000 సంవత్సరంలో అనుకుంటాను. నాకప్పుడు పదేళ్లు. వ్యోమగాములు అంతరిక్షంలో నడవడం గురించి తెలిసి చాలా ఆనందం కలిగింది. అంతరిక్షం నుంచి భూమిని చూడాలనే కోరిక కూడా. కెరీర్ గురించిన ఆలోచనలకు స్పష్టమైన రూపం వచ్చింది కూడా అప్పుడే. అంతరిక్షంలోకి వెళ్లే మార్గాల గురించి అధ్యయనం చేయగా చేయగా వ్యోమగాముల్లో ఎక్కువమంది ఎమ్‌ఐటీలోనే చదివారని తెలిసింది. నేను అదే సంస్థలో చదవాలని నిర్ణయించుకున్నాను. దాంతో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో చేరాను. బెంగళూరులోని ఆర్ కాలేజ్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ 2010 బ్యాచ్‌లో నేను మాత్రమే అమ్మాయిని.
యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయీలో ఏరోస్పేస్‌లో మాస్టర్స్ చేశాను. పీహెచ్‌డీకి ఎమ్‌ఐటీ (మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) నుంచి స్కాలర్‌షిప్‌తో సీటు వచ్చింది. అయితే యూఎస్‌లో అంతరిక్షంలో ఉద్యోగం రావాలంటే ఆ దేశ పౌరసత్వం ఉండాలి కనీసం గ్రీన్‌కార్డ్ అయినా ఉండాలి. సెమినార్‌లలో నేను సమర్పించిన పేపర్‌లకు ప్రశంసలు వచ్చినప్పటికీ ఉద్యోగం వచ్చేది కాదు. అయినా నా పరిశోధనలను మాత్రం ఆపలేదు.
ప్రొఫెసర్‌లకు వారితో కలిసి పని చేసే అవకాశం ఇవ్వమని వినతులు పోస్ట్ చేయడం కూడా ఆపలేదు. నా అప్లికేషన్ ఎప్పుడూ వెయిల్ లిస్టులోనే ఉండేది. వీసా సమయం పూర్తి కావస్తున్న సమయంలో ఒక పేపర్ ప్రెజెంటేషన్ సారా సీగర్ అనే ఆస్ట్రో ఫిజిసిస్ట్ దృష్టిని ఆకర్షించింది. అలా ఒక ఏడాదికి ఇంటర్న్‌షిప్‌కి అవకాశం వచ్చింది. ఆ ఏడాది పూర్తవుతున్న సమయంలో మరో పీహెచ్‌డీకి అప్లయ్ చేశాను. నాసా – ఇస్రో సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమాల్లో కూడా పని చేశాను. మొత్తం మీద మూడవ ప్రయత్నంలో నాసాలో ఫుల్‌టైమ్ ఉద్యోగినయ్యాను.
మేధ ఉంది– పాదు లేదు
మనదేశంలో అంతరిక్షంలో పరిశోధన చేయగలిగిన మేధ ఉంది. మొక్క ఎదగాలంటే అందుకు అనువైన పాదు ఉండాలి. అలాంటి పాదును తల్లిదండ్రులు బాల్యంలోనే వేయాలి. అలాంటి ప్రోత్సాహం మన దగ్గర ఉండాల్సినంతగా లేదనే చెప్పాలి. అందుకే లక్ష్యాన్ని సాధించడంలో నాకు ఎదురైన సవాళ్లతోపాటు అవకాశాలను వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నాను. నేను సూచించేదేమిటంటే... స్కూల్‌లో సైన్స్ ప్రాజెక్టుల్లో పాల్గొనాలి.
అంతరిక్షంలో కూడా ఆస్ట్రో ఫిజిక్స్, ఆ్రస్టానమీ, టెక్నాలజీ, ఇంజినీరింగ్ వంటి చాలా విభాగాలుంటాయి. మన ఆసక్తి ఎందులో అనేది తెలుసుకోవాలి. అంతరిక్షరంగంలో స్థిరపడాలంటే బాచిలర్స్ సరిపోదు. బాచిలర్స్‌లో సైన్స్, ఇంజినీరింగ్‌తోపాటు పీహెచ్‌డీ తప్పనిసరి. అలాగే ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, కోడింగ్ వంటి నైపుణ్యాలను కూడా మెరుగుపరుచుకోవాలి. అంతరిక్షానికి సంబంధించి వీలైనంత ఎక్కువ సదస్సులు, సమావేశాల్లో పాల్గొనాలి. నిపుణులను సంప్రదిస్తూ మన సందేహాలను నివృత్తి చేసుకుంటూ జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఇవన్నీ అంతరిక్షయానాన్ని సుగమం చేసే మార్గాలు’’ అంటోంది అక్షత.
(చదవండి: వీల్‌చైర్‌కి పరిమితమైన వెనక్కి తగ్గలేదు..వ్యాపారవేత్తగా..!)
Comments
Please login to add a commentAdd a comment