అంకిత భావమే అమోఘ విజయం | Ankit Agrawal: Founder and CEO Insurance Dekho success story | Sakshi
Sakshi News home page

అంకిత భావమే అమోఘ విజయం

Published Fri, Jun 2 2023 2:55 AM | Last Updated on Sat, Jul 15 2023 4:13 PM

Ankit Agrawal: Founder and CEO InsuranceDekho success story - Sakshi

నలుగురు నడిచే దారిలో నడిచేవారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దారి మార్చి వెళ్లే వారికి మాత్రం సవాలక్ష ప్రశ్నలు ఎదురొస్తుంటాయి. వాటికి అదేపనిగా సమాధానాలు చెప్పడం కంటే ఎంచుకున్న దారిలో వేగంగా నడవడానికే కొద్దిమంది ప్రాధాన్యత ఇస్తారు. అంకిత్‌ అగర్వాల్‌ ఈ కోవకు చెందిన వ్యక్తి. ‘ఇన్సూరెన్స్‌దేఖో’ ద్వారా ఇన్సూరెన్స్‌ సెక్టార్‌లో గెలుపు జెండా ఎగరేశాడు...

‘మన చుట్టూ ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్‌తో పనిలేదు’ అనే అంకిత్‌ అగర్వాల్‌ హరియాణా, రాజస్థాన్‌లోని ఎన్నో పట్టణాలు, గ్రామాలు తిరిగాడు. మూడు వేలమందికి పైగా ఇన్సూరెన్స్‌ ఏజెంట్‌లను కలిశాడు. ‘ఇన్సూరెన్స్‌ దేఖో’ ప్రారంభించడానికి ముందు ఊరూవాడా అనే తేడా లేకుండా కాలికి బలపం కట్టుకొని తిరిగాడు అంకిత్‌.

‘ఇన్సూరెన్స్‌ దేఖో’కు సంబంధించిన ఆలోచనలను ఇతరులతో, మిత్రులతో పంచుకునేప్పుడు ‘పిచ్చి ముదిరింది’ అన్నట్లుగా చూసేవాళ్లు. ‘హాయిగా ఉద్యోగం చేసుకోక ఏమిటీ కర్మ’ అని మందలించేవాళ్లు కొందరు. ‘యూనివర్శిటీ ఆఫ్‌ దిల్లీ’లో ఎంబీఏ(ఫైనాన్స్‌) చేశాడు అంకిత్‌. అమెరికాలోని ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ కంపెనీ యూబీఎస్‌లో చేస్తున్న ఉద్యోగానికి అంకిత్‌ రాజీనామా చేసి, ఇన్సూర్‌టెక్‌ స్టార్టప్‌ గురించి ఆలోచిస్తున్నప్పుడు  ‘తెలివి తక్కువ పనిచేశావు’ అన్నవాళ్లే ఎక్కువ.

ఇన్సూరెన్స్‌ సెక్టార్‌లోకి అడుగు పెట్టిన తరువాత ఆఫ్‌లైన్‌(ఇన్సూరెన్స్‌ ఏజెంట్స్‌) సామర్థ్యాన్ని, ఆన్‌లైన్‌లో తనకు పనికివచ్చే సాంకేతికతను బాగా ఉపయోగించుకున్నాడు అంకిత్‌.
‘ఇన్సూరెన్స్‌ ఏజెంట్‌ల బ్యాగులు ఖాళీగా ఉండాలని మొదటి లక్ష్యంగా నిర్ణయించుకున్నాను’ నవ్వుతూ అంటాడు అంకిత్‌. ఎందుకంటే, సంప్రదాయ ఇన్సూరెన్స్‌ ఏజెంట్‌ల బ్యాగ్‌లు నోటుబుక్స్, బోలెడు డాక్యుమెంట్స్‌తో నిండిపోయి భారంగా ఉంటాయి!

అందుకే స్మార్ట్‌ఫోన్‌ ప్లస్‌ యాప్‌ ద్వారా ఆ బ్యాగులు తేలికయ్యేలా చేయడంలో అంకిత్‌ విజయం సాధించాలనుకున్నాడు. అయితే అంకిత్‌ వేసే ప్రతి అడుగులో ప్రతికూల మాటలు వినిపించేవి. అవేమీ పట్టించుకోకుండా ‘మొదటి దశలో ఏజెంట్‌. ఆ తరువాత టెక్‌’ అంటూ తన దారిలో తాను వెళ్లాడు అంకిత్‌.
‘ఆర్మీ ఆఫ్‌ ఏజెంట్స్‌’ పేరుతో యువబృందానికి తయారుచేసుకొని గట్టి శిక్షణ ఇచ్చాడు. ఈ బృందంలో ఎక్కుమందికి ఇన్సూరెన్స్‌కు సంబంధించిన విషయాల గురించి పెద్దగా ఏమీ తెలియదు.
ప్రసిద్ధ నినాదం ‘రోటీ కప్‌డా మకాన్‌’లో ‘బీమా’ చేర్చి తన బృందంతో ఊరూవాడా తీసుకెళ్లాడు అంకిత్‌.

గురుగ్రామ్‌(హరియాణా) కేంద్రంగా చిన్నగా మొదలైన ‘ఇన్సూరెన్స్‌దేఖో’ ప్రయాణం పట్టణాల నుంచి పల్లెల వరకు విస్తరించింది. తమ అవసరాలకు సరిపోయే పాలసీలను ఎంచుకోవడంతో పాటు ఎన్నో విధాలుగా వియోగదారులకు దారి చూపే నేస్తంగా మారింది ఈ ఇన్సూర్‌టెక్‌ స్టార్టప్‌.
‘పిచ్చి అగర్వాల్‌’ అని చాటుమాటుగా వెక్కిరించినవాళ్లే ఈ విజయం చూసి ‘అగార్వల్‌ మెథడ్‌’ అని గొప్పగా పిలుచుకునేవారు!

‘ఇన్సూరెన్స్‌దేఖో అనేది ఇన్సూరెన్స్‌ సెక్టార్‌లో భారీ మార్పు తీసుకురావడమే కాదు సామాజిక ప్రభావాన్ని కలిగించింది’ అంటాడు కార్‌దేఖో గ్రూప్‌ కో–ఫౌండర్‌ అమిత్‌ జైన్‌.
‘ఇన్సూరెన్స్‌దేఖో’ ఇటీవల ముంబైకి చెందిన ఎస్‌ఎంఈ ఇన్సూరెన్స్‌ ప్లాట్‌ఫామ్‌ ‘వెరాక్‌’ను కొనుగోలు చేయడం ద్వారా వార్తల్లోకి వచ్చింది.
ఎంతోమంది యంగ్‌స్టర్స్‌ అంకిత్‌ను ‘వన్‌–పాయింట్‌ అడ్వైజ్‌’ అడుగుతుంటారు. అతడి నోటి నుంచి వచ్చే ‘అంకితభావం’ అనే జవాబును ఊహించడం కష్టం కాదేమో!
 
నా కంపెనీ లాభాలతో
దూసుకుపోతుంది అని చెప్పడం నా లక్ష్యం కాదు. నా అసలు సిసలు విజయం ఆరులక్షల గ్రామాల్లోకి ఇన్సూరెన్స్‌ను తీసుకెళ్లడం.
– అంకిత్‌ అగర్వాల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement