అశ్వనీ తివారీ అయ్యర్
41 ఏళ్ల అశ్వినీ తివారీ అయ్యర్ మొన్న కంగనా రనౌత్‌తో ‘పంగా’ తీసింది. నిన్న లాక్‌డౌన్‌లో కూచుని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి – సుధామూర్తిల బయోపిక్ కోసం స్క్రిప్ట్ పూర్తి చేసింది. అదే సమయంలో మొదటిసారిగా ఒక నవల రాసి మార్కెట్‌లోకి ఆగస్టు 1న విడుదల చేస్తోంది. అందరిలానే ఆమెకూ రెండు చేతులే ఉన్నాయి. కాని స్త్రీలు ఇన్ని పనులు చేయగలరు అని సృజనాత్మకంగా ఉండగలరని చెబుతోంది.
‘ది హిడెన్ పవర్స్ ఇన్ ఎవ్రి ఉమన్’ అని నాలుగేళ్ల క్రితం బెంగళూరు టెడ్‌ఎక్స్ కోసం ఒక ఉపన్యాసం ఇచ్చింది అశ్వినీ తివారీ అయ్యర్. ప్రతి స్త్రీలో ఉండే అంతర్గత శక్తులను ఆ స్త్రీలు తెలుసుకోవాలని, వాటిని ఉపయోగంలోకి తేవాలని ఆమె మాట్లాడింది. ముంబైలో పుట్టి పెరిగిన అశ్వినీ తివారీ అయ్యర్ నిజానికి అడ్వర్‌టైజ్‌మెంట్ రంగంలో విశేష గుర్తింపు పొందింది. ‘లియో బర్నెట్’ వంటి అంతర్జాతీయ అడ్వర్‌టైజ్‌మెంట్ కంపెనీలో క్రియేటివ్ డైరెక్టర్‌గా పని చేసింది. కాని ఆమె తనలో ఒక సినిమా దర్శకురాలు దాగి ఉందని గ్రహించిన మరుక్షణం 2013లో ఆ మంచి ఉద్యోగానికి రాజీనామా చేసి బాలీవుడ్‌లో పని చేయడం మొదలెట్టింది. ‘నీల్ బత్తి సన్నాట’, ‘బరేలీకి బర్ఫీ’, ‘పంగా’ సినిమాలకు దర్శకత్వం వహించింది. ఆమె దర్శకత్వ ప్రతిభకు అవార్డులు వచ్చాయి.
‘ఏ క్షణమూ ఖాళీగా ఉండటం నాకు నచ్చదు’ అని చెప్పే అశ్వినీ అయ్యర్ గత రెండేళ్లుగా కరోనా వల్ల పని సరిగ్గా జరక్కపోయినా సోనీ లివ్ కోసం ‘ఫాడు’ అనే ప్రేమ కథను తీసింది. ఇన్ఫోసిస్ దిగ్గజాలు సుధామూర్తి, నారాయణమూర్తి జంట జీవిత కథను అధ్యయనం చేసి వారి బయోపిక్‌కు స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంది. అంతేనా? ఒక నవల కూడా రాసేసింది. దాని పేరు ‘మాపింగ్ లవ్’. గణితంలో మేప్‌ల ద్వారా అంచనాలను చేస్తారు. అలా ప్రేమను మేప్ చేయగలమా? అదే ఈ కథాంశం.
‘ఇది నా మొదటి నవల. లాక్‌డౌన్‌లో దొరికిన ఏకాంతంలో కూచుని రాశాను. రాయడంలో ఉండే ఆనందాన్ని అనుభవించాను’ అంటుంది అశ్వినీ అయ్యర్. ఈ నవల ఆగస్టు 1న మార్కెట్‌లోకి రాబోతోంది.
అశ్విని తన సినిమా కథాంశాలకు గాని నవలకు గాని స్త్రీల జీవితాన్నే తీసుకుంది. ‘నీల్ బత్తి సన్నాట’లో చిన్న ఊళ్ల స్త్రీలు కనే కలలను ఆమె చూపించింది. ఇక ‘పంగా’ అయితే వైవాహిక జీవితంలో మునిగిపోయిన స్త్రీ తిరిగి తన క్రీడా సామర్థ్యాన్ని పరీక్షించుకోవాలని చూస్తుంది. ‘స్త్రీలు ఎన్నో చేయగలరు. ఎన్నో చేయాలి’ అంటుంది అశ్వినీ. ‘దంగల్’ దర్శకుడు నితేష్ తివారి ఈమె భర్త.
సుధామూర్తితో...,; కంగనా రనౌత్‌తో...
Comments
Please login to add a commentAdd a comment