‘ఫ్యాన్ కంపెనీ స్టార్టప్ మొదలుపెట్టాలనుకుంటున్నాను’ అని మనోజ్ మీనా తన ఆలోచనను చెబితే నవ్వి తేలికగా తీసుకున్నవారే తప్ప భుజం తట్టినవారు తక్కువ. ‘ఇప్పటికే మార్కెట్‌లో బోలెడు ఫ్యాన్ కంపెనీలు ఉన్నాయి. ఇక పెద్ద కంపెనీల సంగతి సరే సరే. వాటిని వదిలి మీ ఫ్యాన్ కోసం జనాలు వస్తారా?’ అడిగాడు ఒక మిత్రుడు. నిజమే మరీ...బోలెడు పోటీ!
ఇలాంటి సమయంలోనే ‘మా ప్రత్యేకత ఏమిటి?’ అనే ప్రశ్న ముందుకు వస్తుంది. అయితే వారి ప్రత్యేకతే కంపెనీ విజయానికి బాటలు వేసింది. మనోజ్ మీనా, శిబబ్రత్‌దాస్‌లు ఐఐటీ, బాంబే గ్రాడ్యూయెట్స్. మనోజ్ మీనా ఫౌండర్‌గా ‘ఆటంబెర్గ్ టెక్నాజీస్’ మొదలైంది. తరువాత దాస్ కో–ఫౌండర్‌గా చేరాడు. ఇద్దరికీ కాలేజిరోజుల నుంచి ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్ అంటే ఇష్టం. దీనికి సంబంధించిన కార్యక్రమాలు, పోటీలలో ఉత్సాహంగా పాల్గొనేవారు.
ఆటంబెర్గ్ టెక్నాజీస్ వారి ‘గొరిల్లా ఫ్యాన్’ విజయవంతం కావడానికి కారణం...
సంప్రదాయ సీలింగ్ ఫ్యాన్‌లతో పోల్చితే ఇవి ఇంధనాన్ని ఆదా చేస్తాయి.
కరెంటు బిల్లు బరువును తగ్గిస్తాయి.
ఈ ఫ్యాన్‌ను ఆన్ చేయాలన్నా, ఆఫ్ చేయాలన్నా, స్పీడ్ తగ్గించాలన్నా, పెంచాలన్నా గోడకు ఉన్న స్విచ్ దాకా వెళ్లనక్కర్లేదు.
చేతిలో ఉన్న స్మార్ట్ రిమోట్‌తో చేయవచ్చు.
సామాన్యుడికి ఇంతకంటే కావాల్సింది ఏమిటి! సామాన్యులే కాదు ఈ ఫ్యాన్‌లను ఇన్ఫోసిస్, ఆదిత్య బిర్లా గ్రూప్...లాంటి పెద్ద కంపెనీలు కొనుగోలు చేయడం విశేషం. బంగ్లాదేశ్, నైజీరియా...మొదలైన దేశాలకు గొరిల్లా ఫ్యాన్‌లు ఎగుమతి అవుతున్నాయి.
ఈ మేడిన్–ఇండియా కంపెనీ 2017లో నేషనల్ ఎంటర్‌పెన్యూర్‌షిప్ అవార్డ్ గెలుచుకుంది. ఇక్కడితో ఆగిపోలేదు. గ్లోబల్ క్లైమెట్ సాల్వర్ అవార్డ్(వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్) గెలుచుకుంది. గ్లోబల్ క్లీన్‌టెక్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ విన్నర్‌గా నిలిచింది. ప్రధానమంత్రి నీతి ఆయోగ్ ‘ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్’ గుర్తింపు పొందింది. ఫోర్బ్స్ 30 అండర్ 30
‘సైన్స్ అండ్ గ్రీన్ టెక్నాలజీ’ విభాగంలో, ఫోర్బ్స్ 30 అండర్ 30 ఏషియా ‘ఇండస్ట్రీ, మాన్యుఫాక్చరింగ్ అండ్ ఎనర్జీ’ విభాగంలో చోటు సంపాదించింది. ‘మార్కెట్ బజ్‌వర్డ్స్‌ను గుడ్డిగా ఫాలో కావద్దు. ఉదాహరణకు...ఆటోమేషన్ అనేది మూడు, నాలుగు సంవత్సరాల క్రితం మార్కెట్ బజ్‌వర్డ్. తరువాత ఐవోటీ(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) బజ్‌వర్డ్‌గా మారింది.
వాటి వెంట పరుగులు తీసేముందు... వినియోగదారులకు వాటిని ఎలా అందుబాటులోకి తేవాలనేదానిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. సమంజసమైన ధరలలో ప్రాడక్ట్‌ను వినియోగదారులకు చేరువ చేయగలిగితే ఆ ప్రాడక్ట్ మార్కెట్‌లో బెస్ట్‌సెల్లర్‌గా నిలుస్తుంది’ అంటాడు ‘ఆటంబెర్గ్ టెక్నాలజీస్’ కో–ఫౌండర్ దాస్.
ఇక ఇన్వెస్టర్స్ గురించి ఫౌండర్ మనోజ్ మీనా ఇలా అంటాడు... ‘మన కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ఇన్వెస్టర్స్ ఆసక్తి చూపడం సంతోషించదగిన విషయమే అయినా సరిౖయెన ఇన్వెస్టర్స్‌ను ఎంపిక చేసుకోవడం అనేది ఒక సవాలు’. అయితే ముంబై కేంద్రంగా మొదలైన ‘ఆటంబెర్గ్’ కంపెనీ మొదట్లో అనూహ్యమైన విజయమేమీ సాధించలేదు. మొదటి ఆరు నెలలు జీరోరెవెన్యూ వెక్కిరించింది.
మరోవైపు రకరకాల ఆర్థిక ఒత్తిళ్లు. ఇద్దరినీ తీవ్రమైన నిరాశ కమ్మేసింది. ఆ సమయంలో తాత్వికుల మాట ‘ఆగనంత వరకు నీ ప్రయాణం ఎంత నెమ్మదిగా సాగుతుంది అనేది ముఖ్యం కాదు’ పదేపదే గుర్తు తెచ్చుకొని ధైర్యం తెచ్చుకునేవారు. ఆర్ అండ్ బీ, ట్రైనింగ్, ఫండ్ రైజింగ్, భాగస్వాములను వెదుక్కోవడం....ఒక్కటా రెండా, ఎన్నెన్నో విషయాలు తలకు మించిన భారం అయ్యాయి.
అయినప్పటికీ భయానికి ఎక్కడా తలవంచలేదు. వారి ఆశ వృథా పోలేదు. మెల్లగా అయినా సరే కంపెనీ వృద్ధిరేటు పెరుగుతూ పోయింది. కూలర్స్, ఎయిర్ ప్యూరిఫైయర్స్, ఏసీ...మొదలైన అప్లికేషన్‌లపై పనిచేస్తున్న ‘ఆటంబెర్గ్’ భవిష్యత్‌లో హౌజ్‌హోల్డ్ కన్జ్యూమర్ అప్లికేషన్‌లలో అత్యున్నతస్థాయి విజయాలు సాధించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది.
చదవండి: ఐ యామ్ ఏబుల్.. వైకల్యాన్నే కాదు, మా నైపుణ్యాలనూ చూడండి..!
Comments
Please login to add a commentAdd a comment