మాట్లాడుతూ లేదా భోజనం చేస్తూ నాలుక కరుచుకోవడం అనేది సర్వసాధారణం. కరచుకున్న వెంటనే బాధగా ఉంటుంది. ఆ తర్వాత కాసేపటికి లేదా మరుసటి రోజుకి తగ్గిపోతుంది. అంత సీరియస్ అయిన ఘటనలు ఇంతవరకు జరగలేదు కూడా. కానీ ఇక్కడొక మహిళకు ఎదురైన విపత్కర స్థితిని చూస్తే మాత్రం వామ్మో!నాలిక కరచుకుంటే ఇంతలా జరుగుతుందా? అని ఆశ్చర్యపోవడం ఖాయం. ఆ మహిళ భోజనం చేస్తూనే అనుకోకుండా నాలిక కరుచుకుంది. అదే ఏకంగా ఆమె ప్రాణాలను కోల్పోయే స్థితికి దారితీసింది. ఈ అనుహ్య ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే..27 ఏళ్ల ఆస్ట్రేలియన్ మహిళ కైట్లిన్ అల్సోప్ తన స్నేహితులతో కలిసి భోజనం చేస్తుండగా నాలుక కరుచుకుంది. ఆ టైంలో ఆమెకు కాస్త నొప్పిగా అసౌకర్యంగా అనిపించింది. సర్వసాధారణంగా జరిగేదే కదా అని తేలిగ్గా తీసుకుంది. అంతే కొన్ని గంటలకే ఊపిరి ఆడటం, శ్వాస తీసుకోవటం కష్టమై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఒక్కసారిగా స్నేహితులంతా ఆమె పరిస్థితిని చూసి కంగుతిన్నారు. వెంటనే ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించి ఎమర్జెన్సీ కేసు అంటూ టెస్ట్‌లు చేయడం ప్రారంభించారు వైద్యులు. ఆమె ఒక విధమైన అనాఫిలాక్సిస్ అనే ఎలర్జీకి గురయ్యిందని చెప్పారు. తక్షణమే కొన్ని మందులు ఇచ్చి పరిస్థితి నార్మల్‌కి వచ్చేలా యత్నించారు వైద్యులు.
ఐతే అనూహ్యంగా ఆమె పరిస్థితి విషమంగా మారడం ప్రారంభమైంది. చూస్తుండగానే చర్మం ఎరుపు నుంచి నీలం రంగులోకి వచ్చేసింది. ఆమె నాలుకు నల్లగా అయిపోవడం జరిగింది. ఇక ఆమె నాలుకను తీసేయాల్సి వస్తుందని భావించి వెంటనే అప్రమత్తమయ్యి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు. చివరికి ఆమె అరుదైన లుడ్విగ్స్ ఆంజినా అనే ప్రాణాంతక ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఇది నోరు, మెడ వరుకు ఉన్న మృదుకణజాలంపై ప్రభావం చూపే ప్రాణాంతక సెల్యూటైటిస్‌గా పేర్కొన్నారు.
ఈ ఇన్ఫెక్షన్ ఆమె నోటిలో ఉండే జ్ఞాన దంతాల కారణంగా వచ్చిందని, ఇది ఆమె నోటిలోకి వేగంగా వ్యాపించడం ప్రారంభించిందని అన్నారు. ఇదికాస్త సెప్సిస్‌కి గురయ్యి అవయవాన్ని తీసేయాల్సిన ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు వైద్యలు. తక్షణమే చికిత్స అందించేందుకు ఆమెకు మత్తు ఇచ్చి ట్రీట్‌మెంట్ చేయడం ప్రారంభించారు. ఆక్సిజన్ సరఫరా తక్కువగా ఉన్నందున్న ఇతర అవయవాలు మూసుకుపోకుండా చూసుకోవాల్సి ఉందని ఇది చాలా క్రిటికల్ ఆపరేషన్ అని చెప్పారు. సూమారు గంటపాటు వైద్యలు శ్రమించి కొద్దిపాటి శస్త్ర చికిత్స చేశారు. ఇప్పుడిప్పుడే క్లైటిన్ కోలుకుంటోంది.
లుడ్విగ్ ఆంజినా అంటే..
ఇటీవల జరిగిన గాయం ఇన్ఫెక్షన్‌కి గురయ్యినా లేదా మధుమేహం, మద్యపానం, పోషకాహారలోపం తదితరాల కారణంగా గాయలైతే అది లుడ్విగ్ ఆంజినా అనే ఎలర్జీకి గురయ్యి రోగి పరిస్థితిని దిగజారస్తుంది. ఇది సాధారణంగా దంతాల ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందట. దాదాపు 10 నుంచి 9 కేసుల్లో దవడలోని రెండవ లేదా మూడవ దంతాల నుంచి మొదలవుతుందని వైద్యులు చెబుతున్నారు.
దీని లక్షణాలు
- మాట్లాడటం కష్టం
- అధిక జ్వరం, చలి
- దవడలో నొప్పి
- మెడ నొప్పి
- వాపు
- వాచిపోయిన నాలుక
- నోరు సున్నితత్వం మారడం
- తీవ్రమైన పంటి నొప్పి
నివారణ: లుడ్విగ్ ఆంజినాను నివారించాలంటే నోటి పరిశుభ్రత పాటించాలని చెబుతున్నారు వైద్యులు. దంతాలు పుచ్చిపోకుండా చూసుకోవాలని చెప్పారు. దంతాల ఇన్ఫెక్షన్ కారణంగానే వస్తుందని అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది దంతాలు ఇన్ఫెక్ట్ కాకుండా ఉండేలా చేస్తుందని కూడా చెప్పొచ్చు అంటున్నారు వైద్యులు.
(చదవండి: ఆ వ్యాధి క్యాన్సర్ కంటే ప్రాణాంతకం! చికిత్స కూడా లేదు!)
Comments
Please login to add a commentAdd a comment