రణవీర్ సింగ్, దీపికా పడుకోన్ నటించిన బాజీరావ్ మస్తానీ సినిమా గుర్తందా? ఆ సినిమాలో బాజీరావు ఇల్లు శనివార్‌వాడా కళ్ల ముందు మెదులుతోందా? ఆ శనివార్ వాడా ఉన్నది పూణేకి సమీపంలోనే. ఆ సినిమాలో అనేక ప్రధానమైన సన్నివేశాల చిత్రీకరణ ఈ కోటలోనే జరిగింది. పూణేకి వెళ్లాల్సిన పని పడితే తప్పకుండా చూడండి. కోట ప్రధానద్వారం భారీ రాతి నిర్మాణం. ఏడంతస్థుల నిర్మాణంలో ఒక అంతస్థు మాత్రమే రాతి కట్టడం, ఆ తర్వాత ఇటుకలతో నిర్మించారు.
కోటలోపల ప్రతి అంగుళమూ మరాఠాల విశ్వాసాలను, సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంటుంది. 18వ శతాబ్దం నాటి ఈ నిర్మాణం భారత జాతీయ రాజకీయ క్లిష్టతలను కూడా ఎదుర్కొంది. 19వ శతాబ్దంలో కొంత భాగం అగ్నికి ఆహుతైపోయింది. నిర్మాణపరంగా, చరిత్ర పరంగా గొప్ప నేపథ్యం కలిగిన ఈ కోట పర్యాటకుల దృష్టిని పెద్దగా ఆకర్షించలేదు. బాజీరావు మస్తానీ సినిమా తర్వాత పలువురి దృష్టి దీని మీదకు మళ్లింది. మహారాష్ట్ర టూరిజమ్ గార్డెన్‌లను మెయింటెయిన్ చేస్తోంది.
కానీ పెరుగుతున్న పర్యాటకులకు తగినట్లు పార్కింగ్, రెస్టారెంట్ సౌకర్యం లేదు. ఈ కోటలో కాశీబాయ్ ప్యాలెస్, అద్దాల మహల్ పిల్లలను ఆకట్టుకుంటాయి. ఈ కోట లోపల తిరుగుతూ ఉంటే సినిమా దృశ్యాలు కళ్ల ముందు మెదులుతూ మనమూ అందులో భాగమైన భావన కలుగుతుంది. టీనేజ్ పిల్లలకు ఈ నిర్మాణాన్ని చూపించి తీరాలి.
Comments
Please login to add a commentAdd a comment