Best Gifts For Friends Different Seasons: పండగలు, వేడుకల సందర్భాలలో బంధుమిత్రుల ఇంటికి వెళ్లినప్పుడు ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోయేలా కానుక ఏదైనా తీసుకెళ్లాలనుకుంటారు ఎవరైనా. అయితే, ఆ ఎంపికలో ఎక్కువ శాతం వాల్ ఫ్రేమ్స్ లేదా గడియారాలు, కొన్ని షో పీసులు ఉంటాయన్నది చాలా మంది ఒప్పుకోవాల్సిందే. కానీ, కొద్దిగా ఆలోచిస్తే మనం ఇచ్చే కానుక ఆ ఇంట్లో అన్ని విధాలా ఉపయోగపడే విధంగా ఎంపిక చేయచ్చు. చలికాలానికి రగ్గులు, వేసవి కాలానికి మగ్గులు, వర్షాకాలానికి గొడుగులు.. కానుకలుగా కాలానుగుణంగానూ ఎంపిక చేసుకోవచ్చు. లేదంటే, అన్ని వేళల్లోనూ ఉపయోగపడేవాటిని ఎంచుకోవచ్చు. ఆలోచనకు కొన్ని ఎంపికలు..
1. బ్లాంకెట్ : చలిని తట్టుకునేలా వెచ్చని ఆశీర్వచనంగా ప్రతి వింటర్‌లో ఉపయోగపడేవిధంగా బ్లాంకెట్‌ను ఎంపిక చేయచ్చు. వీటిలో అత్యంత ఖరీదైనవీ, బడ్జెట్‌కు తగినవీ ఉంటాయి. మార్కెట్లో అరుదుగా లభించేవి, నాణ్యమైనవీ, రంగులూ, డిజైన్లూ.. ఇలా మన ఎంపికలో ఓ ప్రత్యేకత ఉండేలా జాగ్రత్తపడవచ్చు. కొన్ని చలికాలాల పాటు మీ ఆప్తులకు మీరిచ్చిన రగ్గు వెచ్చదనాన్ని పంచుతుంది. ఆత్మీయతను పదిలం చేస్తుంది.
2. టీ పాట్: ప్రతి ఇంట్లోనూ తేనీరూ ఓ తప్పనిసరి అవసరం. కాలాలకు అతీతంగా వాడే ఈ పానీయాన్ని అతిథులకు అందించడానికి చూడచక్కని టీ కెటిల్ మంచి ఎంపిక అవుతుంది. అలాగే తేనీటికి సంబంధించి కప్పులు, ట్రే, టీ కెటిల్.. ఇలాంటివి అవసరంగా ఉంటాయి. వీటిలో ఏదైనా మంచి అందమైన సెట్‌ను కానుకగా అందిస్తే ప్రతిరోజూ మీ అతిథులను పలకరించినట్టుగానే ఉంటుంది.
3. వాటర్ జగ్స్ /బాటిల్స్: నీటిని నింపి టేబుల్ మీద పెట్టుకునే వాటర్ జగ్ లేదా బాటిల్స్ ఎంపిక మీ అభిరుచిని తెలియజేస్తుంది. అవసరం అంతగాలేని కానుకల కోసం ఎక్కువ ఖర్చు పెట్టే బదులు ఇలాంటి నిత్యావసరంగా ఉండేవాటిని కానుకలుగా ఇవ్వడానికి ఎంపిక చేసుకోవచ్చు.
4. టవల్: ‘మరీ టవల్‌ను కానుకగా ఇవ్వడం ఏంటి?!’ అనే ఆలోచనే చేయనక్కర్లేదు. నాణ్యమైన టవల్‌ను లేదా టవల్స్ సెట్‌ను కానుకగా ఇస్తే ఆ ఇంటి వారికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది.
5. టేబుల్ నాప్కిన్స్–హోల్డర్స్: అతిథి మర్యాదలు చేసే సమయంలో డైనింగ్ టేబుల్ వద్ద ఉంచే నాప్కిన్స్ మంచి డిజైన్‌తో ఉన్న ఎంపికల గురించి చాలా తక్కువే ఆలోచిస్తారు. ‘ఎప్పుడో గానీ ఉపయోగించం కదా! ఖరీదు ఎందుకు’ అనుకునేవారు ఉంటారు. మీ బంధుమిత్రుల ఆలోచన కొద్దిగానైనా మీకు తెలిసి ఉంటుంది కాబట్టి, అందమైన నాప్కిన్, వాటికి అలంకారంగా ఉండే హోల్డ్‌ర్స్‌ని గిఫ్ట్‌గా ఇవ్వచ్చు. ఇదే విధంగా గ్లాస్ హోల్డర్, స్పూన్లు, టేబుల్‌మ్యాట్స్.. ఇలా కానుకల ఎంపికలో చేర్చుకోవచ్చు.
6. ఫ్లోర్/కార్నర్ బాస్కెట్: పిల్లలు ఆడుకున్న బొమ్మలు లేదా ఇతరత్రా అవసరాలకు ఉపయోగించడానికి ప్లాస్టిక్ బుట్టలు లాంటివి వాడుతుంటారు. పర్యావరణ హితమైనవి, మంచి డిజైన్‌తో ఉన్న బుట్టలను కానుకగా ఇవ్వచ్చు.
7. గ్లాస్ సెట్: పానీయాలు సేవించడానికి ఉపయోగించే గ్లాస్ సెట్స్ ఎన్ని ఉన్నా భిన్నమైన ఆకృతిగల గ్లాసుల కోసం శోధిస్తూనే ఉంటారు. అందుకని, కానుకల విభాగంలో అందమైన గ్లాస్ సెట్ మంచి ఎంపిక అవుతుంది.
8. ఇండోర్ బోర్డ్ గేమ్స్: అతిథులు నలుగురు కలసిన వేళ కాలక్షేపానికి ఏం చేయాలో కొంత సమయం తర్వాత అర్థంకాదు. అలాంటప్పుడు ఇండోర్ బోర్డ్ గేమ్స్ బాగా ఉపయోగపడతాయి. ఆసక్తిగా అనిపించే పజిల్ గేమ్స్‌ను కానుకగా ఇవ్వచ్చు.
9. పండ్ల బుట్ట: పువ్వులు, పండ్లు పెట్టుకోవడానికి అందమైన డిజైన్లు గల రకరకాల బుట్టలు మార్కెట్లో లభిస్తున్నాయి. వెదురు నుంచి అన్ని రకరకాల లోహాల్లోనూ ఇవి లభిస్తుంటాయి. మన అభిరుచి అతిథులకు తెలిపేలా అందమైన పండ్ల బుట్టను కానుకగా ఇవ్వచ్చు.
10. పింగాణీ పాత్రలు/డిన్నర్‌సెట్: అతిథులకు భోజనాలు వడ్డించే సమయంలో ఉపయోగించే పింగాణీ పాత్రలు, ట్రే .. వంటివి తప్పనిసరి అవసరాలుగా ఉంటాయి. వీటినే కానుకగా అందిస్తే ఆతిథ్యం ఇచ్చేవారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి.
కానుకల ఎంపికలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే మార్కెట్లో అనవసర వస్తువుల కోసం ఖర్చు పెట్టే విధానం కూడా తగ్గుతుంది. కానుకను తీసుకునే బంధుమిత్రుల స్థోమతను కూడా అంచనా వేసుకొని, దానికి తగినట్టు మన ఎంపిక ఉండటం ముఖ్యం అని భావించాలి.
చదవండి: Mallappa Gate Story: అసలు ఎవరీమె? మనిషా.. దయ్యమా?.. అవును నేనే!
Comments
Please login to add a commentAdd a comment