సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జీవన శైలి జబ్బులైన బీపీ, షుగర్‌లు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. ఇంతకముందు పట్టణాల్లోనే ఎక్కువగా కనిపించిన ఈ జబ్బులు ఇప్పుడు పల్లెల్లోనూ వ్యాపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రతి నలుగురిలో ఒకరికి బీపీ, 30 ఏళ్లు నిండిన ప్రతి ఐదుగురిలో ఒకరికి షుగర్ ఉందంటే పరిస్థితి తీవ్రతను అంచనా వేయొచ్చు. గ్రామాల్లో 26 శాతం మంది, పట్టణాల్లో 30 శాతం మంది బీపీ బాధితులు, పల్లెల్లో 19 శాతం మంది, పట్టణాల్లో 24 శాతం షుగర్ బాధితులున్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో 20.5 శాతం మంది షుగర్ బాధితులున్నారు. అయితే ఈ స్థాయిలో బీపీ, షుగర్ బాధితులుండటం అత్యంత ఆందోళన కలిగించే అంశమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవగాహన లేక కొందరు, నిర్లక్ష్యంతో మరికొందరు ఈ రెండు ప్రమాదకర జబ్బులను నియంత్రణలో ఉంచుకోలేక గుండెజబ్బులకు గురవుతున్నారు.
నియంత్రణకు చర్యలు
► జీవనశైలి జబ్బులు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది.
►వారానికోసారి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ఎన్‌సీడీ(జీవనశైలి జబ్బులు) స్క్రీనింగ్ నిర్వహిస్తోంది.
►104 వాహనాల ద్వారా కూడా స్క్రీనింగ్ నిర్వహించి ఉచితంగా మందులిస్తోంది.
►30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా స్క్రీనింగ్ చేస్తున్నారు. ఈ వయసు దాటిన వాళ్లు తరచూ బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
వ్యాయామం లేకే ఈ దుస్థితి
ఒత్తిడి కారణంగా ఈ జబ్బులొస్తున్నాయి. వ్యాయామం లేదు, సరైన ఆహారమూ తీసుకోవడం లేదు. పిల్లలు ఎలక్ట్రానిక్ పరికరాల ప్రభావానికి లోనవుతున్నారు. దీన్నుంచి బయటపడాలంటే వారిని క్రీడల వైపు మళ్లించాలి. పెద్దవాళ్లు యోగా చేయాలి. శారీరక వ్యాయామం లేకుంటే చిన్న వయసులోనే ఈ జబ్బులు వచ్చే అవకాశం ఉంది.
–డా.విద్యాసాగర్, ప్రొఫెసర్, జనరల్ మెడిసిన్, కర్నూలు ప్రభుత్వ వైద్యకళాశాల
Comments
Please login to add a commentAdd a comment