లీగల్
నేను ఇదివరకే వీలునామా రాసి ఉంచాను. అలా వీలునామా రాసిన విషయం నా కుటుంబ సభ్యులకు, స్నేహితులకి చెప్పి ఉంచాను. ఇప్పుడు ఆ వీలునామాను మార్చాలను కుంటున్నాను. వీలవుతుందా? – పి. కోటేశ్వరరావు, విజయవాడ
మీరు సంపాదించిన ఆస్తులపై, మీకు సంక్రమించిన ఆస్తులపై వీలునామా రాయడం అనేది మీ హక్కు. మీ జీవిత కాలంలో మీ వీలునామాని మీరు కావాలి అంటే మార్చుకోవచ్చు. అయితే అలా మార్చుకోవాలి అనుకున్నప్పుడు గతంలోనే మీరు వీలునామా రాసిన విషయాన్ని, అందులోని అంశాలను, వివరాలను ప్రస్తావిస్తూ, పాత వీలునామా ఇక చెల్లదు అని మీరు రాయబోయే వీలునామాలో పేర్కొనాల్సి ఉంటుంది. మీ వీలునామాలో మీరు కావాలి అంటే ‘మరలా ఒకసారి కూడా వీలునామా మార్చవచ్చును’ అని, అలా మార్చక΄ోతే ఇదే ఆఖరి వీలునామా అవుతుంది అని కూడా రాయించవచ్చు.
మీరు వీలునామా రాసిన విషయాన్ని ఇప్పటికే మీ బంధుమిత్రులకు, స్నేహితులకు చెప్పాను అని అన్నారు. అలాంటి వీలునామాలు చట్టరీత్యా చెల్లినప్పటికీ మీ తదనంతరం మీ ఆస్తిలో భాగం కోరుకునే వారు ఎవరైనా ఆ వీలునామా సరైనది కాదు అని లేదా మరొక కారణం చూపి లేని΄ోని కేసులు వేయవచ్చు. సొంతంగా రాసుకున్న వీలునామాలలో కచ్చితంగా ΄÷ందుపరచవలసిన కొన్ని అంశాలను విస్మరించడం తరచుగా చూస్తుంటాం. అలాంటి వీలునామాలు కోర్టు కేసులలో బలమైన అంశాలుగా పరిగణించబడవు. వీలునామాలో మీరు పేర్కొనే వారసులు ఒకవేళ మైనర్ అయితే, వారికి గార్డియన్ను నియమించటం, శానిటీ ఓత్ (చిత్తశుద్ధి ప్రమాణం/ధ్రువీకరణ) చేయటం, అచ్చుతప్పులు లేకుండా రాయటం, ఆస్తి వివరాలను క్షుణ్ణంగా వివరించటం వంటి అంశాలు వీలునామా చెల్లుబాటునకు అవసరం. అలా లీగల్ గా చెల్లుబడి అయేలా మెరుగైన వీలునామాను మీ దగ్గరలోని లాయర్‌తో రాయించుకుని, వీలునామాలో మీరు పొందుపరచాలి అనుకున్న నిబంధనలు ఏవైనా ఉంటే అవి చట్టరీత్యా చెల్లుతాయా లేదా అనే అంశాలను కూడా అడిగి తెలుసుకోవడం మంచిది. మరో ముఖ్య విషయం ఏమిటంటే, మీరు రాసిన వీలునామాను రిజిస్టర్ చేయించుకోవడం ఉత్తమం. అలా రిజిస్ట్రేషన్ చేయించిన వీలునామా అయితే మీ తదనంతరం కూడా అందరికీ అన్ని విధాలా మేలు చేస్తుంది. మీరు అనుకున్న విధంగా మీ వీలునామా అమలుకు నోచుకుంటుంది.
– శ్రీకాంత్ చింతల
హైకోర్టు న్యాయవాది
మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshi.family3@gmail.com కు మెయిల్ చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment