ధర్మాచరణకు ప్రధానమైన ప్రతికూల పరిస్థితులు రెండు–అర్థము, కామము. ఇవి ధర్మాచరణకు నిరంతరం పరీక్ష పెడుతుంటాయి. అర్థము అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, భోగ సంబంధమైన సమస్త వస్తువుల రాశిని అర్థము అనవచ్చు. తనకు సుఖాన్నిచ్చే మంచం, కుర్చీ, ప్రయాణించే వాహనం ఏదయినా కావచ్చు. కామము అంటే – కోర్కె వేరు, అవసరం వేరు. రెండింటికీ మధ్య సున్నితమైన భేదం ఉంది. అవసరం తీరకపోతే పాపం అడ్డు వస్తున్నదని గుర్తు. దానిని తీసేయగలిగిన శక్తి ఒక్క భగవంతుడికే ఉంది. పాపం పోవడానికి యజ్ఞ యాగాదులు చేస్తారు. సంతానం కోసం అశ్వమేథం.. వంటివి.
మనం ఒక కోరిక కోరుకుంటున్నాం. అది అవసరం కూడా. దానికి భగవంతుడిని ఆశ్రయించడం తప్పు కానేకాదు. భగవంతుడు ఏమంటాడంటే... నాలుగు రకాల భక్తులు నన్ను ఎప్పుడూ ఆశ్రయించి ఉంటారు. చాలా ఆర్తి కలిగినవాళ్ళు, అసలు భగవంతుడెవరని తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్నవాళ్ళు. మంచి పనులు చేయడానికి ధనసహాయం కోరుకుంటున్న వాళ్ళు. తత్త్వతః పరమాత్మను ఎరుకలోకి తెచ్చుకుని స్తోత్రం చేసేవాళ్ళు. చివరి తరగతి భక్తులగురించి శంకరాచార్యులవారు ఏమంటారంటే... సముద్ర కెరటం సముద్రాన్ని స్తోత్రం చేస్తే ఎలా ఉంటుందో తత్త్వాన్ని అవగతం చేసుకుని జ్ఞాని భగవంతుడిని స్తోత్రం చేయడం అలా ఉంటుంది–అని. ఎక్కడో కోటానుకోట్లలో ఒక్కరే కారణజన్ములుంటారు. వారికి జన్మతః వైరాగ్యం ఉంటుంది. వారికి అర్థకామముల మీద ఎటువంటి తపనా ఉండదు. ఒకవేళ ఏదయినా మనసులో ఏర్పడినా, ధర్మాన్ని రక్షించడానికి ఇలా చేద్దామన్న ఆలోచనే తప్ప వ్యక్తిగతంగా ఏమీ ఉండదు. ఏకాకిగా తనలో తాను రమిస్తూ ఉంటాడు. దేనినీ కోరుకోడు. అతడు జీవన్ముక్తుడు.
కానీ అందరూ ఆ స్థితిలో ఉంటారా !!! ఉండరు.
ధర్మానికి పెద్ద పరీక్ష అర్థము. ఒక కోరిక తీర్చుకోవడానికి పరుగులు తీయడం.. చివరకు తీర్చుకుంటాడు. అది తీరి΄ోయింది కనుక మళ్లీ ఆ కోరిక పుట్టదు– అని చెప్పలేం. మామిడిపండు తినాలని ఆరాటపడి, చివరకు అది దొరికి తిన్న తరువాత.. అది అక్కడితో ఆగదు. అదే పండు మళ్ళీ మళ్లీ కావాలనిపించవచ్చు, ఏ పండయినా సరే అని మళ్ళీ పరుగులు మొదలు కావచ్చు. ఇది ఎలా ఉంటుంది అంటే నేతి ΄ాత్ర పట్టుకుని వెళ్ళి అగ్నిహోత్రాన్ని చల్లార్చడానికి ప్రయత్నించినట్లు ఉంటుంది. ప్రజ్వరిల్లే అగ్ని మీద నెయ్యి చల్లితే, అది ఆరదు, మరింత విజృంభిస్తుంది. కోరికలూ అంతే. అవి ఉపశమించే అవకాశం ఉండదు.
మరి అర్థకామములు లేకుండా మనిషి ఎలా ఉంటాడు? అది సాధ్యం కాదు. అవి ఉండితీరతాయి. ఎవరికయినా భోగం అనుభవించాలన్న కోరిక ఉంటుంది. దానిని తీర్చుకోవడానికి అవసరమయిన సాధనసంపత్తిని సమకూర్చుకోవాలన్న కోరికా ఉంటుంది. దానికి సనాతన ధర్మం ఒక చక్కటి పరిష్కారం చూపింది. అర్థకామములను ధర్మంతో ముడిపెట్టింది. ఇప్పుడు ధర్మబద్ధమైన కామము, ధర్మబద్ధమైన అర్థము.. ఇవి మోక్షానికి కారణమవుతాయి తప్ప బంధాలకు, కోరికలు అపరిమితంగా ప్రజ్వరిల్లడానికి కారణం కావు. అప్పుడు మనిషి జీవితం, కుటుంబ జీవనం, సామాజిక వ్యవస్థ అన్నీ క్రమబద్ధంగా ఉంటాయి, నియంత్రణలో ఉంటాయి. చెలియలికట్ట దాటే సాహసం చేయవు.
Comments
Please login to add a commentAdd a comment