షాపింగ్‌కి ఆడవాళ్లు ముందుంటారని అందరూ అంటుంటారు. కానీ అనితకు షాపింగ్ అంటే చిరాకు. తల్లిదండ్రులు ఎంత బతిమిలాడినా వెళ్లేది కాదు. ఇల్లు, కాలేజీ తప్ప మరోచోటికి కదలదు. ఎక్కడికైనా వెళ్లినా అక్కడేమీ తినదు. ఎంత అవసరం వచ్చినా పబ్లిక్ రెస్ట్ రూమ్‌లకు వెళ్లదు. అన్నింటికంటే చిత్రమైన విషయం ఏంటంటే కనీసం సెల్‌ఫోన్ కూడా వాడదు. దాంతో అందరూ ‘అనిత ఈ కాలం పిల్ల కాదమ్మా’ అని మెచ్చుకునేవారు.
ఇంజినీరింగ్ ఫైనలియర్‌లో ఉండగానే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న హరికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి వేడుకల్లో కూడా బిడియంగానే ఉంది. పెళ్లి కూతురుకు సిగ్గు ఎక్కువ అనుకున్నారు అందరూ. ఆ తర్వాత బెంగళూరులో కాపురం పెట్టారు. వీకెండ్స్‌లో హరి బయటకు వెళ్దామన్నా వద్దనేది. కొత్తదనం వల్ల అనుకున్నాడు. కానీ కూరగాయలకు కూడా బయటకు వెళ్లకపోవడం, దగ్గర్లోని షాపింగ్ మాల్‌కి వెళ్లాలన్నా వణికిపోవడం గమనించి.. సమస్య ఏమిటని అడిగాడు.
కొత్త వ్యక్తులను కలవాలన్నా, జనాలు ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లాలన్నా తనకు భయమని, అలాంటి సందర్భాల్లో గుండె వేగం పెరుగుతుందని, ఆందోళనగా ఉంటుందని చెప్పింది. అది సిగ్గు కాదని, ఏదో మానసిక సమస్య అని హరి అర్థం చేసుకుని ఆన్‌లైన్ కౌన్సెలింగ్ కోసం సంప్రదించాడు. అనితతో మాట్లాడాక, సైకో డయాగ్నసిస్ అనంతరం ఆమె సోషల్ ఫోబియా లేదా సోషల్ యాంగ్జయిటీ డిజార్డర్ లేదా అఈతో బాధపడుతోందని అర్థమైంది.
అది సిగ్గు, బిడియం కాదు..
సిగ్గు కంటే అఈ భిన్నంగా ఉంటుంది. సిగ్గు పదిమందిలో కలవడానికి మాత్రమే అడ్డుపడితే, అఈ షాపింగ్, జాబ్ లాంటి రోజువారీ కార్యకలాపాలనూ కష్టతరం చేస్తుంది. ఈ రుగ్మత ఉన్నవారికి తమ భయాలు అహేతుకమని తెలిసినా, వాటిని అధిగమించ లేరు. తమను ఇతరులు గమనిస్తుంటారని, తమ గురించే మాట్లాడుకుంటారని ఆందోళన చెందుతుంటారు. టీనేజ్‌లో ప్రారంభమయ్యే ఈ సమస్య దాదాపు 8 నుంచి 10 శాతం మందిలో ఉంటుందని ఒక అధ్యయనంలో తేలింది. అఈకి కచ్చితమైన కారణం తెలియదు. అయితే భౌతిక, జీవ, జన్యుపరమైన కారకాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. మానసిక స్థితిని నియంత్రించడంలో సహాయపడే సెరటోనిన్, డోపమైన్‌ల అసమతుల్యత కూడా కారణం కావచ్చు. అలాగే బాల్యంలో శారీరక, మానసిక హింస, తల్లిదండ్రుల అతి నియంత్రణ, జీవితంలో ఎదురయ్యే పరిస్థితులూ కారణం కావచ్చు.
జనాల్లోకి వెళ్లాలంటే వణుకు
► అఈని నిర్ధారించడానికి ఎలాంటి వైద్య పరీక్ష లేదు. కుటుంబ చరిత్ర, వ్యక్తి లక్షణాలను బట్టి నిర్ధారిస్తారు. ప్రతి ఒక్కరూ కొన్ని సమయాల్లో ఆందోళనకు గురవుతారు. అఈ ఉన్న వ్యక్తులు ఇతరులు తమను ఏమైనా అనుకుంటారేమో, అవమానిస్తారేమో నిరంతరం భయపడుతుంటారు.
► మొహం ఎర్రబడటం, వికారం, చెమటలు పట్టడం, వణుకు, కండరాలు పట్టేయడం, తల తిరగడం, గుండెవేగం పెరగడం, మైండ్ బ్లాంక్ అయినట్లు అనిపించడం, మాట్లాడటం కష్టమవ్వడం లాంటి శారీరక లక్షణాలు కనిపిస్తాయి.
► తన భయాందోళనలను ఇతరులు గమనిస్తారనే ఆందోళన, దీన్నుంచి బయటపడేందుకు ఆల్కహాల్ తీసుకోవాలని భావించడం, ఆందోళన కారణంగా స్కూల్ లేదా కాలేజీ లేదా వర్క్ ఎగ్గొట్టడం వంటి మానసిక లక్షణాలు ఉంటాయి.
మనిషిని బట్టి థెరపీ
అఈతో బాధపడుతున్న వ్యక్తుల్లో మూడింట ఒక వంతు మంది కనీసం పదేళ్లపాటు దీన్ని సమస్యగా చూడరు. చూసినా సహాయం కోరరు. దీన్ని అధిగమించేందుకు రకరకాల థెరపీలు సహాయపడతాయి. అయితే ఏ థెరపీ ఎంత బాగా పనిచేస్తుందో వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుంది. కొంతమందికి ఒక రకమైన చికిత్స మాత్రమే అవసరమైతే కొందరికి వివిధ థెరపీల కలయిక అవసరం కావచ్చు. కౌన్సెలింగ్, సైకోథెరపీ, లైఫ్ స్టైల్ మార్పులు, మందులతో దీన్ని ఎదుర్కోవచ్చు.
- బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లు, మెడిటేషన్, యోగా లాంటివి ఒత్తిడిని మేనేజ్ చేయడానికి సహాయపడతాయి
- రోజూ వ్యాయామం చేయడం, మంచి ఆహారం, నిద్ర వంటివి ఆందోళనను కొంతవరకు తగ్గిస్తాయి. మనసైన వారితో మనసు విప్పి మాట్లాడటం కూడా ఆందోళన, ఒత్తిడి తగ్గడానికి సహాయపడుతుంది.
- ప్రతికూల ఆలోచనలను సానుకూలమైన వాటితో భర్తీ చేయడానికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (ఇఆఖీ) సహాయం చేస్తుంది.
- ప్రతికూల భావాలు ఉన్నప్పటికీ విలువలతో ఎలా జీవించాలో acceptance and commitment థెరపీ ద్వారా తెలుసుకుంటారు.
- సామాజిక సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవడానికి గ్రూప్ థెరపీ సహాయ పడుతుంది.
- గ్రూప్‌లో పనిచేయడం వల్ల మీరు ఒంటరిగా లేరని అర్థమవుతుంది.
- సామాజిక పరిస్థితులను నివారించే బదులు క్రమంగా ఎదుర్కొనేందుకు ఎక్స్‌పోజర్ థెరపీ సహాయపడుతుంది.
- ఇవన్నీ క్వాలిఫైడ్ సైకాలజిస్ట్ లేదా క్లినికల్ సైకాలజిస్ట్ ఆధ్వర్యంలో జరగాలి.
- కౌన్సెలింగ్, థెరపీలతో రుగ్మత తగ్గకపోతే సైకియాట్రిస్ట్‌ని కలసి మందులు వాడాల్సి ఉంటుంది.
-సైకాలజిస్ట్ విశేష్
Comments
Please login to add a commentAdd a comment