పండుగ సీజన్ ఫుల్ స్వింగ్‌లోకి వచ్చేసింది. వినాయక చవితి తరువాత వరుసగా వచ్చే పండుగల సందడి మామూలుగా ఉండదు. ఇంటిని అందంగా అలంకరించుకోవడం, పిండి వంటలు మాత్రమే కాదు, పండుగకు అందంగా తయారు కావడం, స్పెషల్ ముస్తాబుతో మురిసిపోవడం చాలా సాధారణం. అందుకే ఫెస్టివల్ లుక్‌లో ఎలా మెరిసి పోవాలో చూద్దాం.
శరీరాన్ని తేమగా ఉంచుకోవాలి. చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటేనే మెరుస్తూ ఉంటుంది. ఇందుకోసం తగినన్ని నీళ్లు తాగాలి. అలాగే ఫ్యాటీఫుడ్స్‌కు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన ఆహారం, ఆకుకూరలు, పండ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఉపవాసాల సమయంలో తేలికపాటి ఆహారం తీసుకోవాలి. పల్చటి మజ్జిగ, పండ్ల రసాలు మెనూలో చేర్చుకోవాలి. ఒత్తిడికి దూరంగా ఉంటూ సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి. రోజూ వాకింగ్, యోగా లాంటి వ్యాయామం చేస్తే ఫేస్‌లో చక్కటి గ్లో వస్తుంది. అలాగే ముఖానికి ఇంట్లోనే తయారు చేసుకునేలా ఫేస్ ప్యాక్, జుట్టు అందం కోసం ప్యాక్‌లు వేసుకోవడం మర్చిపోవద్దు.
ఫేస్ ప్యాక్
బంగాళాదుంపను మిక్సిలో వేసి రసం తీసి పక్కన పెట్టుకోండి. ఇందులో కొద్దిగా శనగపిండి, నాలుగు చుక్కల బాదం నూనె, కొద్దిగా తేనె వేసి బాగా కలపండి. ముఖాన్ని ముందుగా శుభ్రం చేసుకున్న తరువాత దీన్ని అప్లయ్ చేసి, పూర్తిగా ఆరడానికి 10-15 నిమిషాలు ఆగి చల్లని నీటితో శుభ్రంగా కడగాలి. ఆ తరువాత సబ్బు, ఫేస్ వాష్ లాంటివి వాడకండి. మీ ఫేస్‌లోని మెరుపు చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ మిశ్రమాన్ని శుభ్రపర్చిన గాజు సీసాలో దాచుకోవచ్చు.
చర్మం ముడతలు లేకుండా,
కాంతిమంతంగా ఉండాలంటే..: టేబుల్ స్పూన్ మినప్పప్పు, 6 బాదాంపప్పులు కలిపి నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ రెండింటినీ మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి పట్టించి, మృదువుగా రుద్దాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. చర్మం మృదువుగా, తాజాగా కనిపిస్తుంది.∙టేబుల్ స్పూన్ చొప్పున ఆరెంజ్ జ్యూస్, నిమ్మరసం తీసుకొని కప్పు పెరుగులో కలపాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి పట్టించి, ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో స్నానం చేయాలి.
జుట్టుకు బలమైన చూర్ణం
అరకప్పు డ్రైఫ్రూట్స్... బాదం, పల్లీలు, పొద్దుతిరుగుడు గింజలు, వాల్‌నట్స్; అరకప్పు ఓట్స్, పచ్చి శనగపప్పు, పెసరపప్పు కలిపి అరకప్పు, సబ్జా గింజలు అరకప్పు, అవిసె గింజలు అరకప్పు చొప్పున తీసుకుని దోరగా వేయించి చూర్ణం చేసుకుని డబ్బాలో నిల్వ చేయాలి. ఈ పొడిని టేబుల్ స్పూన్ తీసుకుని టీ లేదా స్మూతీలో వేసుకుని తాగాలి. టీ అలవాటు లేని వాళ్లు వేడినీళ్లలో కలుపుకొని రోజూ ఉదయాన్నే తాగితే రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ పొడి జుట్టు సంరక్షణకే గాక ఆరోగ్యాన్నీ మెరుగు పరుస్తుంది.
ఫ్యాషన్ అండ్ మ్యాజిక్
మంచి కలర్‌ఫుల్ డ్రెస్‌లను ఎంచుకోండి. పండుగ సీజన్‌లో ప్యాషన్ ,లేదా సంప్రదాయ దుస్తులు ఏదైనా సరే మన శరీరానికి నప్పేలా ఉండాలి. డ్రెస్‌కు సరిపడా సింపుల్, లేదా హెవీ జ్యుయలరీ ఉంటే అద్భుతమైన ఫెస్టివ్ లుక్ మీసొంతం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment