ఈ భూప్రపంచంలో అమ్మను మించిన ప్రేమ దొరకదు. ఆ ప్రేమకు మరో ప్రత్యామ్నాయం లేదు. తన ప్రాణాలు పోతున్నా కూడా బిడ్డ క్షేమం గురించే ఆలోచిస్తుంది. ఈ విషయం అనేక సార్లు రుజువైంది. తాజాగా కేన్సర్‌తో చనిపోతూ తన కుమారుడికి రాసిన ఒక లేఖ ఇంటర్నెట్‌లో సంచలనంగా మారింది. పలువురి చేత కన్నీళ్లు పెట్టిస్తోంది.
రెడ్డిట్ యూజర్ మాట్ గాల్డ్ కేన్సర్‌తో చనిపోవడానికి ముందు తన తల్లి రాసిన ఒక లేఖను పోస్ట్ చేశారు. చని పోతానని తెలిసి తన కొడుకుపై ప్రేమను, తన బాధను ఈ లేఖలో వ్యక్తం చేసింది ఆ మాతృమూర్తి. ‘‘కన్నా నేను చనిపోతానన్న బాధకన్నా, నిన్ను విడిచి వెళ్లాలన్న ఆలోచన నా ప్రాణాల్ని తోడేస్తోంది. నా తరువాత నిన్ను ఎవరు చూసకుంటారు అనేదే ఎక్కువ బాధగా ఉంది. ఏదో ఒకరోజు నీకు ఇది దొరుకుతుందనే ఆశతో ఈ ఉత్తరం వ్రాస్తున్నాను. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసని ఆశిస్తున్నాను.. నువ్వు నా బంగారు కొండవి. మరే ఆదాయం రాదని తెలిసినా నాకోసం ఉద్యోగం మానేసి మరీ ఎంతో సేవ చేసావ్. నీతో గడిపిన ప్రతీ క్షణం చాలా అద్భుతం. ఎప్పుడూ నీతోనే రా..నాన్నా. ఆ పైనుంచి నిన్ను చూస్తూనే ఉంటాను కన్నా.!" అంటూ మాట్ గాల్డ్ చేసిన త్యాగాలకు ధన్యవాదాలు తెలుపుతూ ఆమె రాసిన లేఖ నెటిజన్లు భావోద్వేగానికి లోను చేసింది.
‘‘ప్రతిరోజూ అమ్మను మిస్ అవుతున్నా.. ఏడుపొస్తోంది. కానీ చిరునవ్వు మధ్య ఆ బాధనంతా దిగమింగుతున్నాను. ఎందుకంటే నాన్న కూడా కేన్సర్‌తో బాధపడుతూ ఐసీయూలో ఉన్నారు. ఆయన్ని చూసుకోవాలి’’ అంటూ మాట్ గాల్డ్ రెడ్డిట్ పోస్ట్ లో రాసుకొచ్చారు. దీంతో నెటిజన్లు సారీ బ్రో అంటూ కమెంట్ చేశారు. నిజంగా మీరు మంచి కొడుకు.. మీకు అంతా మంచి జరగాలని అని కొందరు, అమ్మ ప్రేమ ఎపుడూ మీతోనే... తల్లీ కొడుకుల అనుబంధం ఎప్పటికీ శాశ్వతమే అని మరొకరు వ్యాఖ్యానించారు. మీ కోసం ఆమె కన్న కలలతోపాటు మీ కలలు కూడా నిజం కావాలి అంటూ మరికొందరు యూజర్లు అతనికి ఓదార్పునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment