
ఇటీవల కాలంలో చదువుకునే విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. ఎగ్జామ్స్‌లో అనుకున్నన్ని మార్కులు రాకపోయినా లేదా తమ లక్ష్యాన్ని చేరుకోలేకపోయినా ఆందోళనకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కన్నవాళ్లకు తీరని వ్యధను మిగులుస్తున్నారు. ఇలాంటి వాటిని అరికట్టేలా పాఠశాల స్థాయి నుంచే మార్పులు తీసుకువచ్చేలా విద్యామంత్రిత్వ శాఖ వినూత్న నిర్ణయం తీసుకుంది. అందుకోసం ముసాయిదా మార్గదర్శకాలను జారీ చేసింది. సున్నిత మనస్తత్వం గల విద్యార్థులను గుర్తించి స్వీయ హాని తలపెట్టుకోకుండా మద్దతు ఇచ్చేలా పాఠశాలల్లో సమగ్రమైన టీమ్ విధానాన్ని అవలంభించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ మేరకు విద్యార్థులు స్వీయ హానిని చేసుకోకుండా నిరోధించేలా ప్రేరేపించడం, నిర్వహించడం, సానుభూతి, సాధికారత, అభివృద్ధి తదితద మద్దతు అందించేలా మార్గదర్శకాలను విడుదల చేసింది మంత్రిత్వ శాఖ.
అందుకు అనుగుణంగా స్కూల్ వెల్‌నెస్ టీమ్‌ని ఏర్పాటు చేయడం. స్వీయ హాని ప్రమాదంలో ఉన్న విద్యార్థులను ఆ టీమ్ గుర్తించి స్పందించడం, మద్దతు ఇవ్వడం వంటి చర్యలు ఈ ముసాయిదా మార్గదర్శకాల్లో ఉన్నాయి. విద్యార్థులు వ్యక్తిగత సామాజిక సమస్యలు, ఆందోళనలను సమర్ధవంతంగా నిర్వహించలేనప్పుడూ నిరంత దుఃఖం, అసంతృప్తి, నిరాశ, మానసిక కల్లోలం, నిస్సహాయ భావన వంటి తీవ్ర పరిణామాలకి దారితీస్తుంది. చాలామటుకు ఇలాంటి కేసులు చివరకు స్వీయ హానికి దారితీస్తున్నాయని ముసాయిదా మార్గదర్శకాలు పేర్కొన్నాయి.
అందువల్ల ముందుగా ఆత్మహత్యల నివారణ దిశగా ఈ స్కూల్ టీమ్‌లు ప్రయత్నాలు చేయాలని విద్యామంత్రిత్వ శాఖ పేర్కొంది. పాఠశాలల్లో అందుబాటులో ఉన్న వనరులను బట్టి స్కూల్ వెల్‌నెస్ టీమ్ క్రమం తప్పకుండా విద్యార్థుల తీరు తెన్నులను గమనిస్తూ ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండేలా మద్దతు ఇచ్చి వారిని గైడ్ చేయాలని పేర్కొంది. పాఠశాలలోని ఈ స్కూల్ వెల్‌నెస్ టీమ్‌లు పనితీరును వార్షిక ప్రాతిపదికన సమీక్షించాలి. అలాగే ఆత్మహత్యలను సమర్ధవంతంగా నిరోధించేలా పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి కుటుంబాలు సమిష్టిగా భాగస్వామ్యం అయ్యి పనిచేయాలని ముసాయిదా సిఫార్సు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment