చేపల కూర వండటం అందరికీ.. అంతబాగా కుదరదు! అయితే చేపల కూర వండడం రాకపోయినా.. కాస్త వంట చేయడం వచ్చిన వారు ఎంతో సులభంగా చేసుకునే చేపల కూరే గ్రీన్‌ఫిష్ కర్రీ. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు..
చేప ముక్కలు–ఒక కేజీ, ఆయిల్– నాలుగు స్పూ న్లు, కొత్తిమీర– రెండు కట్టలు, పుదీన – చిన్నకట్ట ఒకటి, పచ్చిమిరపకాయలు– ఎనిమిది, వెల్లుల్లి – మీడియం సైజు రెండు, లవంగాలు– నాలుగు, అల్లం– అరఅంగుళం ముక్క, చింతపండు– మీడియం సైజు నిమ్మకాయంత, పెద్ద ఉల్లిపాయలు– రెండు, దాల్చిన చెక్కపొడి–స్పూను, నల్ల మిరియాల పొడి–స్పూను, జీలకర్ర పొడి–అరస్పూను, పసుపు–అరస్పూను, ఉప్పు– రుచికి సరిపడా.
తయారీ విధానం..
► ముందుగా చేప ముక్కలను ఒకటికి మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తరువాత కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ముక్కలకు పట్టించి మ్యారినేట్ చేసుకుని అరగంటపాటు పక్కన పెట్టి ఉంచాలి.
► కొత్తిమీర, పుదీనా ఆకుల్ని శుభ్రంగా కడిగి మిక్సీ జార్‌లో వేసుకోవాలి. తరువాత దీనిలో అల్లం, వెల్లుల్లి, చింతపండు, ఆరు పచ్చిమిరప కాయలు వేసి మెత్తని పేస్టులా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
► పెద్ద ఉల్లిపాయలను సన్నగా తరిగి, పచ్చిమిరపకాయలు రెండింటిని మధ్యలో చీల్చి పక్కన పెట్టుకోవాలి
► ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చేపలకూర వండేందుకు సరిపోయే పాత్రను పెట్టుకోవాలి. పాత్ర వేడెక్కిన తరువాత నాలుగు స్పూన్ల ఆయిల్ వేయాలి.
► తరువాత నాలుగు లవంగాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు, పచ్చిమిరపకాయ చీలికలు వేసి, ఉల్లిపాయ ముక్కలు మెత్తగా ఉడికేంతవరకు వేయించాలి.
► ఉల్లిపాయ ముక్కలు వేగాక దానిలో అరస్పూను పసుపు, మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్టును వేసి వేగనివ్వాలి.
► ఐదునిమిషాల తరువాత కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి.
► తరువాత స్పూను∙మిరియాల పొడి, అరస్పూను జీలకర్రపొడి వేసి కలిపి మూత పెట్టి మరో ఐదునిమిషాలు ఉడికించాలి.
► మసాలా ఉడికి నూనె పైకి తేలుతున్న సమయంలో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపముక్కలను దానిలో వేయాలి.
► తరువాత రుచికి సరిపడా ఉప్పు, గ్రేవీ కోసం రెండు కప్పుల నీళ్లు పోసి వెంటనే తిప్పాలి.
► ఇప్పుడు మూత పెట్టి సన్నని మంట మీద ఇరవై నిమిషాలపాటు ఉడకనివ్వాలి.
► మధ్యలో గరిట పెట్టకుండా పాత్రను పట్టుకుని చుట్టూ తిప్పుతూ కలుపుకోవాలి.
► గరిట పెట్టి తిప్పితే ముక్కలు చితికిపోతాయి.
► ఇరవై నిమిషాల తరువాత చేపముక్కలు బాగా ఉడికి మంచి వాసనతోపాటు, నూనె పైకితేలుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. దీంతో గ్రీన్ ఫిష్ కర్రీ రెడీ అయినట్లే.
► అన్నం, చపాతీల్లోకి వేడివేడి గ్రీన్ ఫిష్ కర్రీ ఎంతో బావుంటుంది. చాలా ఈజీగా ఉంది కదా!ఇంకెందుకాలస్యం మీరు కూడా ట్రైచేసి రుచిచూడండి.
గమనిక: రవ్వ, బొచ్చ వంటి చేపలనేగాక, చిన్న చేపలు కూడా ఈ పద్ధతిలో వండుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment