PC: Anal Kotak
అనల్ కొటాక్‌ను గుజరాత్ ఎంగెస్ట్ ఫుడ్ ఎక్స్‌పర్ట్‌గా శ్లాఘిస్తారు. చిన్న వయసులో జాతీయ స్థాయిలో గుజరాతీ వంటలకు గుర్తింపు తేవడమే ఆమె ఘనత. యూ ట్యూబ్‌లో వీడియోలతోపాటు మూడు నగరాల్లో ‘ది సీక్రెట్ కిచెన్’ పేరుతో నడుపుతున్న సొంత రెస్టరెంట్లు కిటకిటలాడుతుంటాయి.
ఇంటి ఫంక్షన్‌లో వంటవాళ్లు రాకపోయేసరికి అనుకోకుండా గరిటె పట్టిన అనల్ నేడు బాండీలో కరెన్సీకి పోపేస్తోంది. పెళ్లయ్యాక, కోడలి హోదాలో ఒక రెస్టరెంట్ ప్రారంభించాలంటే ఎన్ని ఇబ్బందులుంటాయో అనల్‌ని అడగాలి.
‘నేను వడోదరాలో నా తొలి రెస్టరెంట్‌ను ప్రారంభించాలనుకున్నాను. దాని పని రాత్రి పది దాకా జరిగేది. అప్పుడు ఇల్లు చేరేదాన్ని. అది చూసి ఇరుగుపొరుగు వారు మా అత్తగారి దగ్గరకు వెళ్లి ఏమిటేమిటో చెప్పేవారు. మీ కోడలు హోటలు నడిపితే ఇంట్లో వంట ఎవరు చేస్తారు? అత్తగారు అయ్యాక కూడా మీరే వండుతున్నారా?
మీకు ఇప్పుడు మీ కోడలు సంపాదించాల్సినంత డబ్బు అవసరం ఏమొచ్చింది? బాగనే ఉన్నాయిగా మీకు... ఇలా మాట్లాడేవారు. కాని మా అత్తగారు, మామగారు, నా భర్త ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. అందుకే మొదలైన రెండు నెలల్లో నా రెస్టరెంట్– ది సీక్రెట్ కిచెన్ సూపర్ హిట్ అయ్యింది’ అంటుంది అనల్ కొటాక్.
అనల్‌కు ఇప్పుడు వడోదర, సూరత్, అహ్మదాబాద్‌లలో ‘ది సీక్రెట్ కిచెన్’ పేరుతో రెస్టరెంట్లు ఉన్నాయి. ఇవి కాక కెఫేలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో కూడా చైన్ రెస్టరెంట్లు ఉన్నాయి. ఇవన్నీ భర్త సపోర్ట్‌తో అనల్ నడుపుతోంది. ఫుడ్ ఎంట్రప్రెన్యూర్‌గా ఆమె సాధించిన ఈ విజయం సామాన్యమైనది కాదు.
వంట పిచ్చి
‘చిన్నప్పటి నుంచి నాకు వంట అంటే ఆసక్తి ఉండేది. మాది కలిగిన కుటుంబం. అమ్మమ్మ, నానమ్మ రకరకాల వంటలు చేసేవారు. వారిలాగా వండటం ఇప్పటికీ నాకు అసాధ్యం. కాని నేర్చుకున్నాను. నాకు హోటల్ మేనేజ్‌మెంట్ చేయాలని ఉండేది. మా నాన్న ‘ఏంటి వంట చదువు చదువుతావా?’ అన్నారు. దాంతో ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను నిఫ్ట్‌లో. కాని వంట మీద ఆశైతే చావలేదు. అప్పుడే ‘కలర్స్ గుజరాతీ’ చానల్‌లో ‘రసోయి షో’ అని వచ్చేది.
అందులో పాల్గొనాలని వెళితే నీకింకా 19 ఏళ్లే. ఇక్కడంతా 40 ఏళ్ల గృహిణులు ఉన్నావు... నువ్వు నెగ్గలేవు అని పంపించేశారు. మరుసటి సంవత్సరం నా పెళ్లికి మెహందీ జరుగుతుండగా ఆ చానల్ నుంచి అదే షో కోసం ఆడిషన్‌కు పిలిచారు.
ఇంట్లో అమ్మకు మస్కా కొట్టి వెళ్లి ఇచ్చి సెలెక్ట్ అయ్యాను. పెళ్లయ్యాక ఆ షోలో పాల్గొంటే ఫైనల్ స్టేజ్‌కు చేరి ‘యంగెస్ట్ చెఫ్ ఆఫ్ గుజరాత్’గా అవార్డు అందుకున్నాను. ఆ పాపులారిటీతో అదే చానల్‌వారు వంట షోకు నన్ను యాంకర్‌గా తీసుకున్నారు. అలా నేను వంటల ప్రపంచంలో అడుగుపెట్టాను’ అంటుంది అనల్.
డిప్రెషన్
‘రెస్టరెంట్ బాగా నడుస్తున్నప్పుడు ప్రెగ్నెంట్ అయ్యాను. దాంతో అమ్మానాన్న, అత్తమామలు పని తగ్గిచ్చుకో... బాబుకు టైమ్ ఇవ్వాలి అనడం మొదలెట్టారు. గర్భంతో ఆనందంగా ఉండాల్సిన సమయంలో నా పని నేను చేసుకోలేనా అని డిప్రెషన్ మొదలయ్యింది. చాలా బాధ పడ్డాను. కాని లోపలి నుంచి నా బిడ్డ నాకు ధైర్యం చెప్పినట్టు అనిపించింది.
నేను నీకు బలమే అవుతానమ్మా... బలహీనతగా మారను అన్నట్టుగా భావించి మళ్లీ మామూలుగా పనిలో పడ్డాను. కొడుకు పుట్టాడు. వాడికి మూడేళ్లు. పొద్దున వెళ్లి తిరిగి రాత్రి ఎనిమిదికే వాణ్ణి చూస్తాను. కాని ఉన్నంతసేపు వాడికి పూర్తి సమయం ఇస్తాను. వాడికి మంచి అమ్మగా ఉంటూనే నేను సాధించాల్సిన విజయాలన్నీ సాధిస్తాను’ అంది అనల్.
అనల్ ఇప్పుడు గృహిణుల కోసం తన సొంత మసాలాలను ‘టిఎస్‌కె’ బ్రాండ్ మీద అమ్ముతోంది కూడా. ఇంట్లో నలుగురి కోసం వండేది వంటే. కాని అందులో ప్రావీణ్యం, ప్రయత్నం ఉంటే వంటతో కూడా ఐశ్వర్యం పొందవచ్చు. అందుకు అనల్ ఒక ప్రత్యక్ష ఉదాహరణ.
మసాలా రహస్యం
‘నాకు రెస్టరెంట్ ప్రారంభించాలనిపించింది. కాని జనం డబ్బు తీసుకుని ఆహారం అమ్మాలి. అది ఎంత రుచిగా ఉండాలి. మన దేశం మసాలాలకు పట్టుగొమ్మ. ఆ మసాలాల రహస్యం తెలుసుకోవాలనుకున్నాను. సొంతగా మసాలాలు తయారు చేశాను.
ఆ రహస్య మసాలాలతో నా రెస్టరెంట్ ‘ది సీక్రెట్ కిచెన్’లో వంటలు చేశాను. రెండు నెలల్లో పేరు వచ్చింది. ఎంత పేరంటే ముంబై నుంచి గుజరాతీలు వడోదరా వచ్చి మరీ తినడం మొదలెట్టారు’ అంటుంది అనల్. గుజరాత్‌లో సౌత్ ఇండియన్ రెస్టరెంట్‌ను ‘సౌత్‌ఏకె’ పేరుతో తెరిచిందామె.
చదవండి: Rishi Sunak: అక్కడ మొదలైన రిషి- అక్షత ప్రేమకథ.. మామగారి గురించి బ్రిటన్ ప్రధాని ఏమన్నారంటే!
Comments
Please login to add a commentAdd a comment