సాధారణంగా చాలామంది స్త్రీలు ముఖ్యంగా గృహిణులు కుటుంబ సభ్యులందరి ఆరోగ్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ తమ గురించి తాము ఏమాత్రం పట్టించుకోరు. ఫలితంగా నిండా నాలుగు పదులు కూడా రాకుండానే వయసు మీద పడ్డట్టు కనిపిస్తారు.
అయితే కొన్ని రకాల పదార్థాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అందంగా... ఆరోగ్యంగా.. ఉన్న వయసు కంటే తక్కువగా కూడా కనిపిస్తారు. అవేంటో తెలుసుకుందాం..
పాలు
స్త్రీలు పాలు తాగడం ఎంతో మంచిది. ఎందుకంటే పాలలో ప్రోటీన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అయితే కొవ్వు శాతం తక్కువగా ఉండే పాలనే తాగాలి. పాలలో ఎముకలను బలంగా ఉంచే కాల్షియం, విటమిన్ డి, విటమిన్ సి లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి.
పెరుగు
కొవ్వు తక్కువగా ఉండే పెరుగు స్త్రీలకు ఎంతో హితకరమైనది. ఈ రకమైన పెరుగును తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కడుపులో మంట, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడేవారికి పెరుగు ఔషధంలా పనిచేస్తుంది. స్త్రీలకు వచ్చే కొన్నిరకాల ఇన్ఫెక్షన్లను, అల్సర్‌ను కూడా తగ్గిస్తుంది.
టొమోటాలు
స్త్రీలకు టమాటాలు ఔషధంతో సమానం. ఎందుకంటే దీనిలో పుష్కలంగా ఉండే లైకోపీన్ రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని చాలా అధ్యయనాలు నిరూపించాయి. ఇక టొమాటాల్లో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెజబ్బులను తగ్గించడానికి సహాయపడతాయి.
టొమోటాలను రోజూ తినడం వల్ల ఎంత వయసు వచ్చినా యవ్వనంగానే కనిపిస్తారు. ఎందుకంటే ఇవి చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.
పోషకాల సోయా
పోషకాలు పుష్కలంగా ఉండే సోయాను తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఎన్నోరకాల పోషకాలు అందుతాయి. వీటిలో విటమిన్స్, ఐరన్ వంటి పోషకాలకు కొదవే ఉండదు. ఇవి అతివలను అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంచుతాయి.
బలాన్నిచ్చే డ్రై ఫ్రూట్స్
రోజూ గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల శరీరానికి అవసరమైన ఎన్నోరకాల పోషకాలు అందుతాయి. అందుకే వీటిని స్త్రీలు తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో విటమిన్ బి12, విటమిన్ ఇ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. రోజూ డ్రై ఫ్రూట్స్‌ను తింటే బలంగా ఉంటారు.
క్యాన్సర్‌ను అడ్డుకునే బెర్రీలు
బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీలు, రాస్ బెర్రీలు, స్ట్రాబెర్రీలు, క్రాన్ బెర్రీలను రోజూ తింటే మీరు ఎలాంటి రోగాల బారిన పడే అవకాశమే రాదంటారు నిపుణులు. ఎందుకంటే వీటిలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. వీటిని రెగ్యులర్‌గా తినడం వల్ల పెద్దపేగు క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది.
ఎందుకంటే వీటిలో క్యాన్సర్‌తో పోరాడే ఔషధ గుణాలుంటాయి. వీటితో పాటు గ్రీన్ టీ, డార్క్ చాకొలెట్, అవిసె గింజెలు సైతం యవ్వనంగా కలినపించడంలో దోహందం చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చూశారుగా... ఎక్కువ వయసు ఉన్నవారిలా కనిపిస్తున్నామని బాధపడకుండా పైన చెప్పుకున్న వాటిని రోజువారీ తీసుకుంటూ అందంగా.. ఆరోగ్యంగా... యవ్వనంగా కనిపించేందుకు ప్రయత్నించడం మంచిది కదా!
Comments
Please login to add a commentAdd a comment