ప్రతి రోజూ తమ ఆరోగ్యం కోసం సమయం కేటాయించ లేనివారు అనారోగ్యం కోసం చాలా సమయాన్ని చాలా రోజులు త్యాగం చేయక తప్పదు. మారుతున్న జీవన శైలి అనేక రుగ్మతలకు దారి తీస్తోంది. బీపీ, డయాబెటిస్, కార్డియోవాస్కులర్ సమస్యలు వంటివాటి బారిన పడుతున్నారు. మితాహారం, కాలానుగుణ ఆహారం ఆరోగ్యానికి కీలకం. అసంక్ర మిత వ్యాధుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది, దీనిని నివారించడానికి ఏమాత్రం ఖర్చు కాకుండా మన ఆరోగ్యాన్ని ‘ప్రకృతి వైద్యం’ ద్వారా నయం చేసుకోవచ్చు.
ఎలాంటి శారీరక శ్రమ లేకుండా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే అత్యాశే అవుతుంది. కష్టతరమైన పనులు చేసేవారు, రైతులు, కూలీలు, హెవీ మోటార్ డ్రైవర్లు, నిర్మాణ కార్మికులు, హమాలీలు, శరీర కష్టం చేసే వారు ప్రత్యేకంగా వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఎవరి పనులు వారు చేసుకుంటే వ్యాయామం చేసే అవసరం తగ్గుతుంది. రోజువారీ పనులనునడక, సైకిల్ ద్వారా చేసుకుంటే సహజంగానే వ్యాయామం లభిస్తుంది. ఏ వ్యాయామం అయినా క్రమం తప్పకుండా చేయాలి. వ్యాయామం ఏదైనా ఒక్కటే నియమం, ‘శక్తికి మించి వ్యాయామం చేయకూడదు’. మిట్ట మధ్యాహ్నం ఎండలో వ్యాయామం చేయకుంటే మంచిది.
నిత్య జీవితంలో రోజూ చేసే పనులు శారీరక శ్రమకు లింక్ చేయడం మంచిది. ఒబేసిటీ, బీపీ, మధుమేహ నియంత్రణకు వ్యాయామం చాలా అవసరం. అలాగే మనం ఇంట్లో కూర్చుని యోగ పైసా ఖర్చు లేకుండా చేసుకోవచ్చు. యోగాసనాలు శరీరానికి, మెదడుకీ ఎంతగానో మేలు చేస్తాయి. ప్రకృతివైద్య సిద్ధాంతంలో, అనారోగ్యం అనేది ఆరోగ్యానికి భంగం కలిగించే ప్రక్రియగా, సహజ వ్యవస్థల సందర్భంలో ఆ తర్వాత కోలుకునే ప్రక్రియగా పరిగణించబడుతుంది. పేలవమైన పోషణ, దీర్ఘకాలిక ఒత్తిడి వంటి అనేకమైన విషయాలు ఆరోగ్యానికి ఎక్కువగా భంగం కలిగిస్తాయి. వీటిని గుర్తించడం, తగ్గించడం ద్వారా ఆరోగ్యాన్ని పునరుద్ధరించడం ప్రకృతి వైద్యుల లక్ష్యం.
– డా‘‘ ఎం. అఖిల మిత్ర, గౌతమ బుద్ధ అభివృద్ధి సమాఖ్య
Comments
Please login to add a commentAdd a comment